
ఏమిస్తారో..!
సాక్షి, ఏలూరు : ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాలను కైవసం చేసుకుని రాష్ట్రంలో అధికారం చేపట్టిన చంద్రబాబునాయుడు పశ్చిమగోదావరి జిల్లాకు ఇప్పటివరకూ చేసిందేమీ లేదు. రాష్ట్ర విభజన తర్వాత జిల్లాలో స్థాపించే పరిశ్రమలు, సంస్థలపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో గురువారం విజయవాడలో కలెక్టర్ల సమావేశం జరుగుతుండటంతో జిల్లాకు సంబంధించి కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఎటువంటి ప్రతిపాదనలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి కూడా ఎలాంటి వరాలిస్తారనేదానిపైనా ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం జిల్లాలో ప్రభుత్వ భూముల లభ్యత, పరిశ్రమలు, సంస్థల ఆవశ్యకత, పర్యాటక అభివృద్ధి, వాస్తవ పరిస్థితులను వివరిస్తూ కలెక్టర్ నివేదికను సీఎంకు సమర్పించనున్నారు.
సీఎం దృష్టికి కలెక్టర్ తీసుకువెళ్లే ప్రధానాంశాలు
జిల్లాలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు భూములు ఎంపిక చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించడంతో కలెక్టర్ మూడు ప్రాంతాల్లో భూములు ఉన్నట్లు గుర్తించారు. తాడేపల్లిగూడెం విమానాశ్రయ భూములు, వెంకట్రామన్నగూడెం, చింతలపూడి అటవీ భూములు అనువుగా ఉంటాయని, ఈ మూడు చోట్ల దాదాపు 1500 ఎకరాలు అందుబాటులో ఉన్నాయని నివేదిక తయారుచేశారు.
నరసాపురం వద్ద మినీ ఫిషింగ్ హార్బర్, భీమవరం పరిసరాల్లో లేసుపార్క్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటువ్యవసాయాధారిత పరిశ్రమలు ఏర్పాటు ద్వారా అభివృద్ధి ల్లేరు, సముద్రతీరం, చారిత్రక ప్రదేశాలు, ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయం, పాలకొల్లు, భీమవరం పంచారామ క్షేత్రాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధితో ఆదాయం. జిల్లా కేంద్రం ఏలూరులో ప్రభుత్వ శాఖల కార్యాలయాలను ఒకే చోటికి చేర్చాలని భావిస్తున్నారు. దీనికి అవసరమైన భవనాల నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూర్చాల్సిందిగా ప్రభుత్వాన్ని కలెక్టర్ కోరనున్నారు.
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు శిక్షణ కోసం జిల్లాలో అత్యాధునిక భవన నిర్మాణం జరగనుంది. దాని కోసం రూ.కోటి నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. పం చాయతీల పాత భవనాలను ఆధునీకరించడంతో పాటు కొత్త భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. ప్రతి కార్యాలయానికీ కంప్యూటర్లు అందించనున్నారు. వాటిని ఆపరేట్ చేసేం దుకు తాత్కాలిక పద్ధతిలో సిబ్బందిని నియమించుకోనున్నారు. దీనికి సం బంధించిన నిధులు, అనుమతులు త్వరితగతిన ఇప్పించాల్సిందిగా కలెక్టర్ సీఎంను కోరే అవకాశం ఉంది.
పరిశ్రమలు, చిన్న సంస్థల ఏర్పాటుకు కూడా భూములు ఎంపిక చేస్తున్నారు. మొదటి విడతగా భీమవరం, కొవ్వూరు, ద్వారకాతిరుమల పరిసరాలు, ఏలూరు-తణుకు మధ్య భూ ములను గుర్తించారు. ఈ ప్రాంతాల్లో దాదాపు 50 ఎకరాల ప్రభుత్వ స్థలాలు ఉన్నట్లు నిర్ధారించారు. వాటి విలువ సుమారు రూ.80 కోట్లుగా లెక్కించారు. గుర్తించిన ప్రభుత్వ స్థలాలు కబ్జా కోరల్లోకి వెళ్లకుండా ఉండేలా రక్షణ చర్యలు చేపట్టనున్నారు. స్థలం చుట్టూ ప్రహరీ గోడలు నిర్మించనున్నారు. దీనికోసం దాదాపు రూ.66 లక్షలు వెచ్చించనున్నట్లు సీఎంకు వెల్లడించనున్నారు.
ఏలూరు నగరం, పట్టణాల శివార్లలో గజం స్థలం ధర రూ.7వేల నుంచి రూ. 15వేలకు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో నాన్ లే-అవుట్ స్థలాలు గజం రూ.4 వేలు, లే-అవుట్ వేసిన స్థలాలు గజం రూ.5వేలు పైబడి ఉన్నాయి. వ్యవసాయ భూముల ధరలు ఆశాశాన్నంటుతున్నాయి. గరిష్టంగా ఎకరం రూ.20 లక్షలు వరకూ ఉంది. పొలంలోకి రహదారి, సాగునీటి సౌకర్యం ఉంటే ఆ ధర మరింత భారీగా ఉంటోంది. లే-అవుట్‌లు, వ్యాపార, వాణిజ్య అవసరాలకు ఉపయోగపడే భూములైతే ఎకరం రూ.కోటి పైగా పలుకుతున్నాయి. ఈ పరిణామాలను ముఖ్య మంత్రి దృష్టికి కలెక్టర్ తీసుకువెళ్లనున్నారు.