
‘జిల్లా’ జగడం
సాక్షి, ఏలూరు : గిరిజన జిల్లా ఏర్పాటు ప్రతిపాదనపై వివాదం ముదురుతోంది. ఆరు మండలాలకు చెందిన గిరిజనేతరులు సోమవారం భారీ సంఖ్యలో ఏలూరులోని కలెక్టరేట్‌కు తరలివచ్చారు. కలెక్టర్ కాటమనేని భాస్కర్‌ను కలిసేం దుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు రంగప్రవేశం చేసి గుంపులుగా ఉన్న గిరిజనేతరులను అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా సూచించారు. మైదాన మండలాలను గిరిజన జిల్లాలో కలపవద్దని, గిరిజన జిల్లా ఏర్పాటు అనివార్యమైతే గిరిజనేతరులను వేరే మండలంలో కలపాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతానికి గిరిజన జిల్లా ఏర్పాటు ఒక ఆలోచన మాత్రమేనని, ప్రజల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఏలూరు ఎంపీ మాగంటి బాబు, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు గిరిజనేతరుల ఏజెన్సీలో
గిరజనేతరుల తరపున కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఆందోళన చెందవద్దు : ఎంపీ
ప్రజాభిప్రాయం ప్రకారమే ప్రత్యేక గిరిజన జిల్లా ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని ఏలూరు ఎంపీ మాగంటి బాబు హామీ ఇచ్చారు. క్యాంపు కార్యాలయంలో ఎంపీ బాబును, జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజును జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం గ్రామాలకు చెందిన సుమారు వెయ్యిమంది రైతులు సోమవారం కలిశారు. ఏజెన్సీలో ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని కోరారు. గిరిజన జిల్లా ఏర్పాటు చేస్తే తమకు అభ్యంతరం లేదని, ఏజెన్సీలో నివసిస్తున్న 80శాతం గిరిజనేతరుల జీవనం, హక్కుల విషయంలో తగు నిర్ణయం తీసుకుని గిరిజనేతరులకు రక్షణ కల్పించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లామని, ప్రజలు ఎటువంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని మాగంటి బాబు చెప్పారు. అనంతరం వారిని తీసుకుని కలెక్టరేట్‌కు వచ్చారు.
అందరి అభిప్రాయాలు తీసుకుంటాం : కలెక్టర్
ఏజెన్సీ మండలాల్లో అందరి అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని, ఈ విషయంలో ఎవరూ కూడా ఎటువంటి అపోహలు చెందవద్దని కలెక్టర్ కాటమనేని భాస్కర్ ప్రజాప్రతినిధులు, గిరిజనేతరులతో అన్నారు. జిల్లాలోని ఏజెన్సీ మండలాలను ప్రత్యేక గిరిజన జిల్లాలో కలిపే విషయంలో అటు గిరిజనులకు, ఇటు గిరిజనేతరులకు సమన్యాయం జరిగేలా చూడాలని ఎంపీ మాగంటి బాబు కలెక్టర్‌ను కోరారు. జీలుగుమిల్లి, బుట్టాయగూడెం ప్రజల తరఫున వినతిపత్రాన్ని కలెక్టర్‌కు ఎంపీ అందచేశారు. తనకు తెలియకుండానే అన్నీ జరిగిపోతున్నాయని బాబు అసహనం వ్యక్తం చేశారు. గిరిజన జిల్లా ఏర్పాటు మంచిదేనని, అయితే గిరిజనేతరుల హక్కులకు ఎటువంటి భంగం కలగకుండా సరైన చట్టాలను రూపొందించి రక్షణ కల్పించాలని కోరారు.