ప్రేమోన్మాది వేధింపులకు విద్యార్థిని బలి
భూదాన్‌పోచంపల్లి: ఓ ప్రేమోన్మాది వేధింపులకు మనస్తాపం చెంది పదో తరగతి విద్యార్థిని ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జిబ్లక్‌పల్లి గ్రామానికి చెందిన ఉప్పునూతల కావ్య(16) చౌటుప్పల్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో పదోతరగతి చదువుతోంది. కావ్య ఇన్‌స్టా్రగామ్‌లో ఇదే గ్రామానికి చెందిన మాచర్ల శివమణి తనను ప్రేమించాలని మెసేజ్‌లు పెడుతూ వేధింపులకు గురిచేస్తున్నాడు.
అందుకు ఆమె తిరస్కరించడంతో తనను ప్రేమించకపోతే మీ నాన్న, అన్నను చంపేస్తానని, డబ్బులు కూడా కావాలని బెదిరింపులకు గురిచేశాడు. భయపడిన కావ్య ఇటీవల తన సోదరుడు నరేశ్‌కు విషయం చెప్పింది. దీంతో తన చెల్లెలికి మేసేజ్ పెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని శివమణిని నరేశ్ హెచ్చరించాడు. ఇదే క్రమంలో డిసెంబర్ 31న అర్ధరాత్రి నరేశ్, శివమణి మధ్య గొడవ జరిగింది. ఆ రోజు రాత్రి కావ్యకు శివమణి ఫోన్‌చేసి ‘మీ అన్నను చంపేస్తాను’ అని బెదిరించడంతో ఆమె మనస్తాపం చెంది పురుగుమందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించడంతో కోలుకొని ఈ నెల 2న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చింది.
మందలించినా మారని తీరు..
ఈ నెల 2న గ్రామంలో ఇరు కుటుంబాల పెద్ద మనుషులు పంచాయతీ పెట్టారు. ఇకపై కావ్య, ఆమె కుటుంబం జోలికి పోకుండా చూసుకోవాలని శివమణి తల్లిదండ్రులకు చెప్పారు. అయినా శివమణి మళ్లీ మెసేజ్‌లు పెడుతుండటంతో కావ్య కలత చెందింది. బుధవారం తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమె ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొంది. సాయంత్రం నరేశ్ ఇంటికి వచ్చి చూడగా కావ్య ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది.
పోలీసులు పోస్ట్‌మార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. గురువారం సాయంత్రం కావ్య అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతురాలి తండ్రి కన కయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సైదిరెడ్డి తెలిపారు. కాగా, నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోచంపల్లిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థినులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు.