bidders visits
-
HMDA: భూములు వేలం.. హెచ్‌డీఎంకు బిడ్డర్ల ఝలక్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ)కు బిడ్డర్లు హ్యాండ్ ఇచ్చారు. హెచ్ఎండీఏ పరిధిలో ఇటీవల ఈ-వేలంలో ప్లాట్లకు పాటపాడి బిడ్డర్లు డబ్బులు చెల్లించకుండా డిఫాల్టర్లుగా మారుతున్నారు. హెచ్ఎండీఏ పరిధిలోని ఆరు లేఅవుట్లలో ఏకంగా 497 మంది డిఫాట్లర్టుగా మారడం గమనార్హం. కాగా, డబ్బులు చెల్లించేందుకు నిర్ణీత గడువు కంటే ఎaక్కువ సమయం ఇచ్చినా బిడ్డర్లు మిగతా వాయిదాలు చెల్లించలేదు. దీంతో, ఆ ప్లాట్ల ధరావతు సొమ్ము రూ.4.5 కోట్లకుపైగా హెచ్ఎండీఏ జప్తు చేసింది. వివరాల ప్రకారం.. హెచ్ఎండీఏలో ఈ-వేలంలో ప్లాట్లను దక్కించుకున్న వారిలో చాలామంది డిఫాల్టర్లుగా నిలిచారు. ఆరు లేఅవుట్లకు సంబంధించి 497 మంది చెల్లింపులు చేయలేక చేతులెత్తేశారు. వారికి నిర్ణీత గడువు కంటే మరికొంత సమయం ఇచ్చినా సొమ్ము చెల్లించలేదు. ఈ క్రమంలో చేసేదేమీ లేకపోవడంతో ఆ ప్లాట్ల ధరావతు సొమ్ము రూ.4.5 కోట్లకుపైగా హెచ్ఎండీఏ జప్తు చేసింది. ► ఇక, మోకిలలో ఇటీవల నిర్వహించిన ఈ-వేలంలో చదరపు గజం రూ.లక్ష పలకడం రియల్ ఎస్టేట్ రంగంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇలా అధిక ధరకు ప్లాట్లు దక్కించుకున్న చాలామంది డబ్బులు చెల్లించడంలో వెనకడుగు వేశారు. ఒక్క మోకిలలోనే 148 మంది వరకు డిఫాల్టర్లుగా మిగిలారు. షాబాద్‌లో 50 ప్లాట్లకుగాను కేవలం 10 మందే చెల్లింపులు చేశారు. తొర్రూరులో 504 ప్లాట్లకు 114 మంది డబ్బులు కట్టలేదు. మిగతా లేఅవుట్లలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ►ఆరు నెలల్లో మోకిల, మేడిపల్లి, బాచుపల్లి, బహదూర్‌పల్లి, తొర్రూరు, షాబాద్ తదితర ప్రాంతాల్లో వెయ్యికి పైగా ప్లాట్లను హెచ్ఎండీఏ వేలం వేసింది. వేలంలో పాల్గొనాలంటే ప్రతి ప్లాటుకు తొలుత రూ.లక్ష ధరావతు చెల్లించాలి. కొన్నిచోట్ల ఈ మొత్తం తక్కువ ఉంటుంది. అలా వేలంలో ప్లాటు దక్కించుకున్న తర్వాత మిగతా మొత్తం కట్టకుంటే డిఫాల్టర్లుగా తేల్చి ఆ ధరావతును జప్తు చేస్తారు. అంతేకాక డిఫాల్టర్లు భవిష్యత్తులో వేలంలో పాల్గొనలేరు. -
బీపీసీఎల్ ప్రెవేటైజేషన్‌కు బ్రేక్: ఎందుకంటే?
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) ప్రైవేటైజేషన్ ప్రతిపాదనకు బ్రేక్ పడింది. దాదాపు 53 శాతం వాటాను విక్రయించే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం విరమించుకుంది. ఇంధన ధరలపై స్పష్టత లేకపోవడం వంటి సమస్యలపై ఇద్దరు బిడ్డర్లు వాకౌట్ చేయడంతో కేవలం ఒక బిడ్డర్ మాత్రమే పోటీలో ఉన్నారు. దీంతో ప్రైవేటీకరణకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో నెలకొన్న పరిస్థితులరీత్యా ప్రస్తుతం ప్రయివేటైజేషన్ ప్రక్రియలో పాల్గొనలేమంటూ అత్యధిక శాతం బిడ్డర్లు అశక్తతను వ్యక్తం చేసినట్లు దీపమ్ పేర్కొంది. కంపెనీలో ప్రభుత్వానికిగల మొత్తం 52.98% వాటాను విక్రయించేందుకు తొలుత ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. ఇందుకు వీలుగా 2020 మార్చిలోనే ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్స్‌కు ఆహ్వానం పలికింది. అదే ఏడాది నవంబర్‌కల్లా కనీసం మూడు సంస్థలు బిడ్స్ దాఖలు చేశాయి. అయితే ఇంధన ధరల విషయంలో స్పష్టత లేకపోవడంతో రెండు సంస్థలు రేసు నుంచి వైదొలగాయి. దీంతో ఒక కంపెనీ మాత్రమే బరిలో నిలిచింది. ఫలితంగా డిజిన్వెస్ట్‌మెంట్‌పై ఏర్పాటైన మంత్రివర్గ కమిటీ ప్రైవేటైజేషన్ ప్రక్రియ రద్దుకు నిర్ణయించినట్లు దీపమ్ వెల్లడించింది. పరిస్థితుల ఆధారంగా ఈ అంశంపై భవిష్యత్‌లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలియజేసింది. బీపీసీఎల్‌లో ప్రభుత్వ వాటా కొనుగోలుకి వేదాంతా గ్రూప్, యూఎస్ వెంచర్ ఫండ్స్ అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ ఇంక్, ఐ స్క్వేర్డ్ క్యాపిటల్ అడ్వయిజర్స్ ఈవోఐలను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్తల నేపథ్యంలో బీపీసీఎల్ షేరు 0.5% నీరసించి రూ. 325 వద్ద ముగిసింది. శుక్రవారం స్వల్ప లాభంతో అక్కడే కదలాడుతోంది. -
పారదర్శకత కోసం అమల్లోకి ఈ-బిల్ ప్రాసెసింగ్ సిస్టమ్
న్యూఢిల్లీ: బడ్జెట్లో ప్రతిపాదించిన కొత్త ఎలక్ట్రానిక్ బిల్(ఈ-బిల్) ప్రాసెసింగ్ సిస్టమ్ బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. ప్రయోగాత్మకంగా ఎనిమిది శాఖలతో మొదలుపెట్టిన ఈ విధానాన్ని 2022-23లో అన్ని శాఖలు, విభాగాల్లో దశలవారీగా అమల్లోకి తేనున్నారు. సరఫరాదారులు, కాంట్రాక్టర్లకు చెల్లింపులను పారదర్శకంగా నిర్వహించేందుకు ఇది ఉపయోగపడగలదని 46వ సివిల్ అకౌంట్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కాంట్రాక్టరు లేదా సరఫరాదారు తమ క్లెయిమ్‌లను నేరుగా డిజిటల్ విధానంలో దాఖలు చేయొచ్చని ఆమె చెప్పారు. డిజిటల్ సిగ్నేచర్‌తో కూడిన క్లెయిమ్ ప్రభుత్వానికి అందగానే కాంట్రాక్టరుకు పేమెంట్ జమవుతుందన్నారు. బాకీలను విడుదల చేయాలంటూ అధికారులు, శాఖల చుట్టూ తిరగనక్కర్లేదని, నెలల తరబడి నిరీక్షించనక్కర్లేదని మంత్రి తెలిపారు. (చదవండి: కొత్తగా రుణం కోసం దరఖాస్తు చేసుకునే వారికి షాకిస్తున్న బ్యాంకులు..!) -
ఎయిర్‌పోర్టు ప్రాంతాన్ని పరిశీలించిన బిడ్డర్లు
భోగాపురం : విజయనగరం జిల్లా భోగాపురంలో ఏర్పాటు చేయనున్న గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ప్రాంతాన్ని సోమవారం బిడ్డర్లు పరిశీలించారు. పోర్టు నిర్మాణానికి పోటీలో ఉన్న జీఎంఆర్, జీవీకే, టాటా, అదానీ తదితర 8 సంస్థల ప్రతినిధులు కంచేరు, గూడెపు వలస, కవులవాడ రెవెన్యూ గ్రామాల పరిధిలోని ప్రాంతాన్ని, అప్రోచ్ రోడ్లను పరిశీలించారు. అనంతరం ఈ సంస్థల ప్రతినిధులు స్థానిక సన్‌రే రిసార్ట్సులో సమావేశమైనట్లు తెలుస్తోంది. ఎయిర్‌పోర్టు అథారిటీ, సర్వే సంస్థల అధికారులు బిడ్డర్లకు అవసరమైన సమాచారం అందించటంతో పాటు సందేహాలను నివృత్తి చేశారు.