big festival
-
తెలుగువారికి పెద్ద పండుగ అంటే సంక్రాంతే..!
తెలుగువారికి పెద్ద పండుగ అంటే సంక్రాంతే.రాత్రిపవలూ పండుగే. అదీ మూడు,నాలుగు రోజుల పాటు సాగుతుంది.అన్ని రకాల అభిరుచులవారికి, అన్ని వయస్సులవారికీ ఆనందాన్ని నింపే పండుగ సంక్రాంతి. నిజం చెప్పాలంటే? ఏ పండుగ శోభ చూడాలన్నా, పల్లెల్లోనే చూడాలి.మరీ ముఖ్యంగా సంక్రాంతి పల్లెసీమల పండుగ. పేరుకు మూడు రోజులైనా, ముక్కనుము వరకూ నాలుగురోజులపాటు అన్ని సీమల్లోనూ బోలెడు విందు వినోదాలు సందడి చేస్తాయి. సంక్రాంతి అంటే సంక్రమణం, అంటే మార్పు.మారడం అని అర్ధం. పల్లెటూర్లలో 'సంకురాత్తిరి' అని అంటారు.దాదాపు అన్ని మాండలీకాలలోనూ ఇదే మాట వినపడుతుంటుంది. పల్లెల్లో జీవించేవారికి,కనీసం బాల్యమైనా కొన్నేళ్లు పల్లెటూరులో గడిపినవారికి ఈ పండుగ బాగా అర్ధమవుతుంది. పట్టణాల్లో, నగరాల్లో,విదేశాల్లో జీవించేవారు సైతం పిల్లలను తీసుకొని తమ పల్లెలకు వెళ్ళడం సరదా. రవాణా సౌకర్యాలు బాగా పెరిగిన నేపథ్యంలో,ఈ సరదా ఈమధ్య బాగా పెరుగుతోంది. జనం రాకతో పల్లెలు నేడు కూడా కళకళలాడుతున్నాయి. ఇది మంచి పరిణామం. సూర్యుడు... మేషం మొదలైన 12రాశులలో క్రమంగా పూర్వ రాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడం 'సంక్రాంతి'. సంవత్సరానికి 12సంక్రాంతులు ఉంటాయి. పుష్యమాసంలో,హేమంత రుతువులో చల్లగాలులు వీస్తూ, మంచు కురిసే వేళలలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చేది 'మకర సంక్రాంతి'. దీనికే అత్యంత ప్రాముఖ్యతనిచ్చి, పండుగలు జరుపుకుంటాం. సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగు పెడతాడు.తెలుగువారితో పాటు తమిళులు ఈ పండుగను బాగా జరుపుకుంటారు. భోగి,సంక్రాంతి,కనుమ, ముక్కనుమగా నాలుగురోజుల పాటు జరుపుకుంటాం. కనుమ,ముక్కనుమను మాంసాహార ప్రియులకు గొప్ప వేడుకగా నిలుస్తుంది. రైతులకు పంట చేతికొచ్చే కాలమిది. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర దొరికి, నాలుగు రూపాయలు మిగిలినప్పుడే రైతుకు నిజమైన పండుగ.గిట్టుబాటు ఎట్లా ఉన్నా? పంట చేతికి వచ్చిన అనందంతోనూ రైతు పండుగ చేసుకుంటాడు. ప్రతి రైతు కుటుంబంలో అనందం నింపడం ప్రభుత్వాల బాధ్యత. అది తీరేది ఎన్నడో?? "పండుగలు అందరి ఇంటికీ వస్తాయి,కానీ,ఎందుకో మా ఇంటికి రావు!" అన్నాడు ఒక పేద కవి. ప్రతి పౌరుడు అనందంగా జీవించిన ప్రతిరోజూ పండుగే. "గరీబీ హటావో " అనే నినాదాన్ని ఎన్నో ఏళ్ళ క్రితం అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వినిపించారు. ఇప్పటికీ పేదరికం తగ్గకపోగా, డబ్బున్నవాడికి -లేనివాడికి మధ్య వ్యత్యాసం బాగా పెరిగిపోయింది.ఈ పరిణామం దేశ శాంతికి,సోదరత్వానికి మంచిది కాదు. కొనుగోలు శక్తి గతంలో కంటే నేడు కొందరిలో పెరిగినా,దారిద్ర్య రేఖకు దిగువనే ఇంకా చాలామంది వున్నారు. అందరి వైభవమే దేశ వైభవం. అది ఇప్పటికైనా గుర్తెరిగి పాలకులు నడుచుకోవాలి. ఈ పండుగ వేళల్లో నిత్యావసర ధరలు 50శాతం పెరిగాయనే వార్తలు వస్తున్నాయి.పేదవాడు, దిగువ,మధ్యతరగతి వాళ్లు పండుగ ఎట్లా జరుపుకుంటారు?సొంతఊర్లకు వెళ్లాలంటే బస్సులు, విమానాల టిక్కెట్ల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ప్రతి పండుగ సమయాల్లో ఇదే తీరు నడుస్తోంది. ఏలినవారు శుభాకాంక్షలు చెప్పడం కాదు,ఈ ధరలను నియంత్రణ చెయ్యాలి.ఈ చీకటి కోణాలు పక్కన పెట్టి,పండుగ వెలుగుల్లోకి వెళదాం. పల్లెసీమల్లో బుడబుక్కలవాళ్లు, పగటి వేషధారులు,వివిధ రూపాల్లో జానపద కళాకారులు చేసే హడావిడి అంతా ఇంతాకాదు. ముగ్గులు,గొబ్బెమ్మలతో వీధులు మెరిసిపోతూ ఉంటాయి. భోగి ముందు రోజు నుంచి రాత్రి వేళల్లో వేసే మంటల దగ్గర చలికాచుకోవడం గొప్ప అనుభూతి. రేగిపండ్ల శోభ చూచి తీరాల్సిందే. కోడి పందాలు,ఎడ్లబండ్ల పందాలు పోటాపోటీగా సాగుతాయి. కోడి పందాలకు పలనాడు ఒకప్పుడు చరిత్ర సృష్టించింది. యుద్ధాలే జరిగాయి.ఇప్పటికీ కోడి పందాలు జరుగుతూనే వున్నాయి.గోదావరి జిల్లాల్లో కొన్నేళ్ల నుంచి కోడి పందాలు బాగా పెరిగాయి.ఎద్దుల బండి పోటీలు పలనాడు,ప్రకాశం,రాయలసీమ జిల్లాల్లో ఒకప్పుడు చాలా బాగా జరిగేవి.'ఒంగోలు గిత్త 'కు ప్రపంచంలోనే ఎంతో ఖ్యాతి వచ్చింది. ఈ ఖ్యాతి తగ్గుముఖం పట్టిన కాలంలో నేడు మనం జీవిస్తున్నాం. ఉత్తరాయణ పుణ్యకాలంలో శారీరక పరిశ్రమకు, వ్యాయామానికి,ధ్యాన, యోగ సాధనకు చాలా అనువైన కాలం.ఉత్తరాయణాన్ని ఎంతో పుణ్యకాలంగా భారతీయులు భావిస్తారు.అందుకే,భీష్ముడు ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత ప్రాణాలు వదిలేశాడు. యోగ మార్గంలో ప్రాణాలను వదిలే సాధన ఇప్పటికీ ఉంది. ఇంతటి పుణ్యకాలంలో,వారి వారి శక్తి మేరకు దానధర్మాలు చేయడం చాలా మంచిది. మన భరతభూమిపై ఎన్నో ఏళ్ళ నుంచి ఈ సంస్కృతి ఉంది. కలియుగంలోని ప్రధాన ధర్మం దానం చేయడంగా పెద్దలు చెబుతారు. బొమ్మలకొలువులు, చెరుకుగడలు,పసుపుపారాణులు , తాంబూలాలు ఎటు చూచినా కనిపిస్తాయి. అరిసెలు,బొబ్బట్లు, జంతికలు,గారెలు,చక్కినాలు గురించి చెప్పక్కర్లేదు. గంగిరెద్దులు, డోలు సన్నాయిలు, డూడూ బసవన్నలు చేసే సందడి చూడాల్సిందే. తిరునామం తీర్చి, కాళ్లకు గజ్జెలు కట్టి,చేతిలో తాళం మోతలతో,హరిలో రంగ హరీ! అంటూ హరిదాసులు పాడుతూ నాట్యం చేస్తూ ఉంటే, పిల్లాజెల్లా తన్మయులైపోతారు. ఇటువంటి ఎన్నో వినోదాలు, ఆనంద దృశ్యాలు సంక్రాంతి పండుగ వేళల్లో కనువిందు, విన పసందు చేస్తాయి. జీవహింసగా భావించి కోడి పందాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఉత్తర భారతదేశంలో మకర్ సంక్రాంతి లేదా లోరీని జరుపుకుంటారు. ఆదిశంకరాచార్యుడు సంక్రాంతి నాడే సన్యాస దీక్ష తీసుకున్నారని చెబుతారు. వైష్ణవ భక్తులు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి, సంక్రాతి పండుగనాడు గోదాకళ్యాణం జరుపుకుని, వ్రతం సంపూర్ణమైనట్లుగా భావిస్తారు. అనాదిగా,పల్లెలు పునాదిగా జరుపుకుంటున్న సంక్రాంతి వేడుకలు ఆనందానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీకలు. అందరికీ భోగి, సంక్రాంతి,కనుమ శుభాకాంక్షలు. - మాశర్మ, సీనియర్ జర్నలిస్టు -
సంక్రాంతిని 'పెద్ద పండుగ' అని ఎందుకు పిలుస్తారు?
భోగభాగ్యల భోగి పండుగను చిన్నా పెద్ద అంతా ఆనందంగా జరుపుకున్నారు. ఇక తరువాత రోజే అసలైన పండుగ 'సంక్రాంతి'. ఈ పండుగ రోజు ఉండే హడావిడి అంతా ఇంత కాదు. పైగా ఈ పండుగను పెద్దల పండుగ లేదా పెద్ద పంగ అని అంటారు. ఈ రోజు నవ్వులతో చేసిన వంటకాలను తప్పకుండా తింటారు. నాలుగు రోజులు పండుగల్లో ఈ సంక్రాంతి మాత్రమే ఎలా పెద్ద పండుగ అయ్యింది?. ఇన్ని సంక్రమణాలు ఉండగా ఈ సంక్రమణానికి ఎందుకంత విశిష్టత? నెలకు ఒక రాశి చొప్పున సూర్యభగవానుడు ఏడాది మొత్తం కలిపి 12 రాశుల్లో సంచరిస్తాడు. రాశిమారిన ప్రతిసారీ సంక్రమణం అంటారు. కానీ ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి సూర్యుడు సంచరించేటప్పుడు పెద్ద పండుగను జరుపుకుంటారు. అదే సంక్రాంతి పండుగ. సంక్రాంతి అనగా నూతన క్రాంతి. ప్రతి ఒక్కరి జీవితంలో నూతన అధ్యాయం మొదలు కాబోతుందనే దానికి సంకేతం. అలాగే దక్షిణదిక్కువైపు ప్రయాణించిన సూర్యుడు తన దిశను మార్చుకుని పుష్యమాసంలో ఉత్తరదిక్కులో సంచరిస్తుంటాడు. అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తారు. ఈ సూర్యుడి గమనం మారడం వల్ల అప్పటి వరకు ఉన్న వాతావరణంలో పూర్తిగా మార్పులు వస్తాయి. సంక్రాంతి ఎలా పెద్ద పండుగంటే.. సంక్రాంతి పండుగ సమయానికి పొలాల నుంచి వచ్చే ధాన్యం ఇంటికి చేరుకుంటుంది. చేతికి వచ్చిన పంటను చూసి రైతులు ఆనందంతో చిరునవ్వులు చిందిస్తారు. ఇంటికి చేరిన కొత్త ధాన్యంతో అన్నం వండుకుని తినరు. ఎందుకంటే కొత్త బియ్యం తొందరగా అరగదు. అందుకే ఆ బియ్యానికి బెల్లం జోడించి పరమాన్నం, అప్పాలు, అరిసెలు, చక్కిలాలు తయారు చేస్తారు. ఇలా చేస్తే పిండివంటలు చేసుకున్నట్లు కూడా ఉంటుంది. జీర్ణ సమస్యలు కూడా రావు. తమిళనాడులో కొత్త బియ్యంతో పొంగలి చేసి నైవేద్యం పెడతారు. అందుకే అక్కడ పొంగల్ అని పిలుస్తారు. పంట చేతికందించిన దేవుడికి ధన్యవాదాలు తెలిపేందుకు ఇలా నైవేద్యం సమర్పిస్తారు. ఈ పండుగలో ముఖ్యంగా ప్రకృతిని పూజించడంతోపాటు పశువులను కూడా పూజిస్తుంటారు. అలాగే సంక్రాంతి పండుగ అంటే ఖచ్చితంగా ప్రతి పదార్థంలో నువ్వులు ఉంటాయి. సూర్య భగవానుడికి సమర్పించే నీటిలోనూ నువ్వులు వేస్తారు. సంక్రాంతి సమయంలో నువ్వుల వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు అప్పటి వరకు దక్షిణాయనంలో ఉండి ఉత్తరాయణంలో ప్రవేశిస్తాడు. దీని వల్ల వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటాయి. వాటి నుంచి తట్టుకునేలా శరీరాన్ని సిద్ధం చేసుకునేందుకు నువ్వులను కచ్చితంగా తీసుకోవాలని మన పెద్దలు నియమం ఏర్పాటు చేశారు. ఈ రోజునే పెద్దలకు తర్పణాలు.. సంక్రాంతి రోజు పెద్దలకు తర్పణాలు వదలడం తప్పనిసరిగా చేస్తారు. ఉత్తరాయణ కాలం మొదలైన ఆరోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని పితృదేవతలకి స్వర్గ ప్రాప్తి లభించడం కోసం ఇలా చేస్తారు. ఈరోజు పెద్దలని స్మరించుకుంటూ వారిని సంతోష పెట్టే విధంగా వాళ్ళ పేరు మీద దాన ధర్మాలు చేస్తారు. ఇలా చేస్తే వాళ్ళ ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. అందుకే ఇది పెద్దల పండుగ లేదా పెద్దల పండుగ అయ్యింది. కొత్త అల్లుళ్ల సందడి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ సంక్రాంతి పండుగ చాలా ప్రత్యేకం. కొత్తగా పెళ్ళైన కూతురు, అల్లుడిని ఇంటికి పిలిచి తమ ఆతిధ్యంతో ఔరా! అనిపిస్తారు. కొత్త అల్లుళ్ల రాకతో ఇల్లు కళకళాడిపోతాయి. మరదళ్ళు బావలని సరదాగా ఆట పట్టిస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇక మహిళలు ఇళ్ల ముందు పెద్ద పెద్ద రంగవల్లులు వేసి మురిసిపోతారు. గొబ్బెమ్మలు పెట్టి వాటి చుట్టూ పాటలు పాడుకుంటూ డాన్స్ వేస్తారు. పల్లెటూరులో అయితే ఏ వీధిలో చూసినా కన్నె పిల్లలు పరికిణీలు కట్టి పూల జడలు వేసుకుని అందంగా ముస్తాబై తిరుగుతూ సందడి చేస్తారు. కోడి పందేలు, ఎడ్ల పోటీలు.. గోదావరి జిల్లాల్లో కోడిపందేలతో ఫుల్ జోష్‌తో పండుగ జరుగుతుంది. వీటిని చూసేందుకు దూరప్రాంతాల నుంచి కూడా జనాలు వస్తారు. పూర్వకాలంలో దీన్ని యుద్ధనీతిని గెలిపించే పందెంగా భావించేవారు. అంతేగాదు ఇద్దరి మధ్య వైరం ఏర్పడితే దాన్ని కోడిపందెం ద్వారా పరిష్కరించేవారట. ఆ తర్వాత అదే కాలక్రమేణ ఓ సరదా జూదంలా మారింది. ఈ పండుగ రోజు కొన్ని ప్రాంతాల్లో ఈ కోడిపందేలు కచ్చితంగా జరుగుతాయి. మరికొన్ని చోట్ల ఈ రోజు ఎండ్ల పోటీలు నిర్వహిస్తారు. గాలిపటాలు ఎగరువేసేది కూడా. కొన్ని చోట్ల ఈ సంక్రాంతి పండుగను పతంగులు పండుగగా జరుపుకుంటారు. ఆ రోజు చిన్నా పెద్దా అని తేడా లేకుండా గాలి పటాలు ఎగరేస్తూ ఆనందిస్తారు. దీంతో ఆకాశంలో రంగు రంగుల గాలి పటాలు ఎగురుతూ కనువిందు చేస్తాయి. మరీ ఇన్ని విశేషాలు ఉన్న సంక్రాంతి పెద్ద పండగే కదా! -
జన జాతరలు
ఎస్ఎస్ తాడ్వాయి: ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరొందిన సమ్మక్క – సారలమ్మ జాతరకు ములుగు జిల్లా ఎస్ఎస్.తాడ్వాయి మండలంలోని మేడారం ముస్తాబైంది. జాతర జరిగే నాలుగు రోజుల్లో కోట్లాది మంది భక్తులు వన దేవతలను దర్శించుకోనున్నారు. సమ్మక్క – సారలమ్మ జాతర తరహాలోనే బీరప్ప, కోట మైసమ్మ, రేణుకా ఎల్లమ్మ వంటి స్థానిక జాతరలు ఉన్నాయి. మన రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా అనేక జాతరలు ప్రతీ ఏటా జరుగుతుంటాయి. వీటిలో ప్రధానమైన కొన్ని జాతరల విశేషాలు. జంగూబాయి: గోండు తెగకు చెందిన ఆదివాసీలు ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం సమీపానికి సరిహద్దు ప్రాంతంగా కలసి ఉన్న మహారాష్ట్రలో ఈ జాతర జరుపుకుంటారు. ఆదివాసీల ఆరాధ్య దైవమైన జంగూబాయి దేవతకు ప్రతిరూపమైన పెద్దపులిని పూజిస్తారు. గోండులంతా మాఘ శుద్ద పౌర్ణమి మాసం రాగానే నెల రోజుల పాటు జంగూబాయి మాలలు వేస్తారు. జంగూమాతను టెంకాయలు మొక్కులుగా సమర్పిస్తారు. అక్కడి గుట్ట లోని గుహలో ఉండే పెద్దపులికి జంగో లింగో అంటూ జేకొడుతూ దర్శనం చేసుకుంటారు. బీరమయ్య ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బీజీపూర్ జిల్లాలోని బస్తర్, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోని వాజేడు మండల సరిహద్దు ప్రాంతంలో ఉన్న లొటపిట గం డి కొండల్లో ఆదివాసీలు బీరమయ్య జాతర నిర్వహిస్తారు. పూర్వ కాలంలో ప్రజలను దోపిడీ దొంగలు దోచుకుపోతుంటే వారి నుంచి రక్షించేందు కు ముగ్గురు అన్నదమ్ములు పగిడిద్దరాజు, పాంబోయి, బీరమయ్య సిద్ధమవుతారు. ఈ దోపిడీ దొం గలను తరుముకుంటూ పగిడిద్దరాజు మేడారానికి, భూపాలపట్నం వైపు, బీరమయ్య లొటపిట గండికి వెళ్లి స్ధిరపడతారు. అప్పటి నుంచి బీరమయ్యకు లొటపిటగండిలో, పాం బోయికి భూపాలపట్నం లో, పగిడిద్దరాజుకు మేడా రంలో జాతరలు నిర్వహిస్తారని అక్కడి పెద్దలు చెబుతారు. ఈశాన్య రాష్ట్రాల్లో హర్నిబిల్ భారత దేశంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఈశాన్య రాష్ట్రాలు అనేక ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. పూర్తిగా కొండలు, అడవులతో నిండిన ఈ ప్రాంతంలో గిరిజన జనాభా ఎక్కువ. వందల సంఖ్యలో గిరిజన తెగలు ఇక్కడ నివసిస్తున్నాయి. ఇక్కడున్న ఏడు రాష్ట్రాల్లో ప్రతి తెగకు సంబంధించి వేర్వేరుగా జాతరలు ఉన్నాయి. వీటిలో నాగాలాండ్‌లో జరిగే హర్నిబిల్ జాతరకు పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. ఏటా డిసెంబర్ మొదటి వారంలో ఈ జాతర ప్రారంభమవుతుంది. ఈ జాతర ప్రధాన ఉద్దేశం గిరిజన తెగలకు సంబంధించిన ప్రత్యేక సంస్కృతి , సంప్రదాయాలను కాపాడుకోవడం. ఈ పండుగ సందర్భంగా ఇక్కడి గిరిజనులు ఆటపాటలతో ఆడిపాడుతారు. సంస్కృతికి సంబంధించిన వేడుక కావడంతో ఇది కనులపండువగా సాగుతుంది. హర్నిబిల్ జాతర తర్వాత జనవరిలో మణిపూర్‌లో థీసమ్ ఫణిత్ జాతరకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సహ్రుల్ ఆదివాసీల జనాభా ఎక్కువగా ఉన్న జార్ఖండ్ రాష్ట్రంలో సహ్రుల్ జాతర జరుగుతుంది. ఈ జాతరలో భాగంగా ప్రకృతిని పూజిస్తారు. ఇక్కడ ఉండే సాల్ అనే చెట్టుకు ప్రత్యేక పూజలు జరుపుతారు. ధర్తీ మాతగా సీతాదేవి ఇక్కడ కొలుస్తారు. ప్రకృతి విపత్తులు ఇతర కష్టాల నుంచి తమను కాపాడుతారని ఇక్కడి గిరిజనుల విశ్వాసం. మఘేపరాబ్ ఒడిశా రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాల్లో గిరిజనులకు ప్రత్యేక స్థానం ఉంది. ఏడాది పొడవునా అనేక జాతరలు జరుగుతాయి. ఇందులో ఏడు ప్రధానమైన జాతరలు ఉన్నాయి. వీటిలో మఘేపరాబ్ జాతర ఒకటి. ఈ జాతర సందర్భంగా తమ తెగ దేవతకు నల్లని పక్షులు బలిస్తారు. మద్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. నాగోబా ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో నాగోబా జాతర జరుగుతుంది. ఆదివాసీలకు ఇది ప్రధాన జాతర. మూడు రోజుల పాటు (ఇటీవలే జరిగింది) నిర్వ హిస్తారు. నాగోబా జాతరను మెస్రం వంశస్తులు, గోండు ఆదివాసీలు జరుపుతారు. పుష్యమాసంలో నెలవంక చంద్రుడు కనిపించగానే.. మెస్రం వంశస్తులు హస్తిన మడుగు నుంచి కలశంతో నీరు తీసుకొచ్చి నాగులమ్మ దేవతను పూజిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నాగోబా జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది. దంతేశ్వరీ ఉత్సవాలు ఆదివాసీ తెగ ప్రజలు అత్యధికంగా జీవించే ఛత్తీస్‌గఢ్‌లో దసరా పండుగ సమయంలో ఇక్కడ అన్నమదేవ్ రాజవంశీయులు దంతేశ్వరీ మాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. జగదల్పూర్ కేంద్రంగా జరిగే ఈ జాతరకు అత్యధికంగా గిరిజనులు హాజరవుతారు. రాజవంశీయులు కీలక భూమిక పోషించినా ప్రధాన పాత్ర గిరిజనులదే. అదేవిధంగా రాయ్‌పూర్ సమీపంలో ఉన్న భోరమ్‌దేవ్ జాతర ప్రత్యేకతను సంతరించుకుంది. గరియ మాత త్రిపుర రాష్ట్రంలో రీంగ్ తెగకు చెందిన ఆదివాసీలు గరియ పూజ జాతరను జరుపుకుంటారు. చైత్ర సంక్రాంతి రోజున ఒక వెదురు దండాన్ని ప్రత్యేకంగా కాటన్దారం, కాటన్‌తో తయారు చేసిన పూలతో అలంకరిస్తారు. దైవత్వానికి అంకితమైన కొందరు వ్యక్తులు ఈ దండాన్ని పట్టుకుని గ్రామంలో ఇంటింటికీ తిరుగుతారు.ఆ సమయంలో దేవతను స్తుతిస్తూ పాటలు పాడుకుంటూ నృత్యాలను చేస్తూ పంటలు బాగా పండాలని బాధలు నుంచి విముక్తి కలిగించాలని కోరుతారు. నాగోబా జాతరలో భక్తులు (ఫైల్) -
పద్యానవనం: మందులేని జబ్బు జబ్బు లేని వేదన!
పరుల ధనమునకు, విద్యా పరిణతికిని, దేహమునకు, బలమునకు మనం బెరియంగ నసహ్యపడున న్నరుండు దెవులు లేని వేదనంబడు నదిఫా! సృష్టిలో ప్రతిదీ ఒకదానికొకటి కార్యకారణ సంబంధం కలిగి ఉంటుందనేది కాదనలేని సత్యం. ఎందుకంటే, సందేహాలకతీతంగా ఇది పలుమార్లు రుజువైంది గనుక. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యంగా చెప్పుకునే భారతదేశం ఓ పెద్ద పండుగ ముగించుకుంది. ఇక్కడి ఎన్నికల నిర్వహణను చూసి ఈ భూమ్మీది చాలా దేశాల వాళ్లు ఆశ్చర్యపోతుంటారు. భిన్న జాతులు, భాషలు, సంస్కృతుల వారుండి, అరవై శాతం దాటని అక్షరాస్యతతో కూడా సజావుగా ఈ ప్రక్రియ జరిపించడం గొప్పే. అయితే, ఎప్పటికప్పుడు ఒక అవలక్షణాన్ని సరిదిద్దితే మరొకటి పుట్టుకొస్తోంది. ఇప్పుడే పుట్టుకొచ్చినవి కాకపోయినా కొన్ని అవలక్షణాలు ఈ సారి తారాస్థాయికి చేరి సగటు మనషికి వెగటు పుట్టించాయి. నిన్నా, మొన్నటి ఫలితాలతో ముగిసిన ఈ ఎన్నికల్లో ఏరులై పారిన డబ్బు గురించి తలచుకున్నపుడల్లా గుండె గుబేలు మంటుంది. పోలీసులు, మన నిఘా విభాగాలకు పట్టుబడ్డదే మన రాష్ట్రంలో దాదాపు నూటా యాబై కోట్ల రూపాయలకు పైబడి. ఇంకా పట్టుబడకుండా పలువురికి పంచబడ్డ, పంచకుండానే మధ్య దళారీల పంచనపడ్డ, నీళ్ల ప్రాయంగా పంచి ఖర్చు చేసిన డబ్బు సంగతో! దానికి లెక్ఖే లేదు. ఇంత డబ్బు వ్యయం చేసి గెలుస్తున్న వారు నిజంగా నిస్వార్థమైన ప్రజాసేవ చేస్తారని ఎవరూ అనుకోరు. వాళ్లు చేయరు, చేస్తామని కూడా చెప్పరు. అయినా ప్రతి ఎన్నికలప్పుడూ ఇదిలాగే జరుగుతోంది. ‘అంత విచ్ఛలవిడిగా ఖర్చు చేయకు, అది వారిచ్చిన పరిమితిని మించితే ఎన్నికల సంఘంతో ఇబ్బంది’ అన్నపుడు ఓ ఎం.పి. అభ్యర్థి ఇచ్చిన సమాధానం నివ్వెరపరచింది. ‘పో అన్నా, వారికీ, వీరికీ భయపడి ఎన్నికల వ్యవహారం చేస్తే ఇక గెలిచినట్టే! భారతదేశ చరిత్రలో పరిమితి దాటి ఎన్నికల వ్యయం జరిపిన కారణం మీద ఎన్నికల సంఘం అనర్హుడిగా ప్రకటించిన ఒక్కడంటే ఒక్క ప్రజాప్రతినిధి పేరు చె’ప్పమన్నపుడు మతిపోవడం నా వంతయింది. గతంలో జరిగిన పలు ఎన్నికలతో పోల్చి చూస్తే ఈసారి హింస తగ్గిన మాట నిజం. ఎన్నికల సందర్భంగా హింస, విధ్వంసాలు చాలా వరకు తగ్గాయి. రిగ్గింగు, బూతులను స్వాధీన పరచుకోవడం, ఒకరికి బదులు మరొకరు దొంగ ఓటు వేయడం వంటివి చాలా వరకు తగ్గిపోయాయి. ఓటరు చైతన్యం బాగా పెరిగింది. సంస్కరణల పుణ్యమా అని ఇన్ని సానుకూలాంశాలున్నాయని సంబరపడదామంటే, ఇంకో వైపు అవలక్షణాలు పెరిగిపోతున్నాయి. మీడియా గోల మితిమీరింది. పిచ్చి రాతలు, పచ్చి కూతలకు పెద్దపీట వేస్తున్న కొన్ని ప్రసారమాధ్యమాల తీరు అత్యంత జుగుప్సాకరంగా మారింది. ఓపీనియన్ పోల్స్ అని, ఎగ్జిట్‌పోల్స్ అని, సర్వేలని... రకరకాల మార్గాల్లో తోచిందల్లా ప్రజాబాహుళ్యంలోకి పంపి గందరగోళ పరిస్థితుల్ని సృష్టించడం లోగడ ఎప్పుడూ లేనంత అతిగా తయారయిందీసారి. చెల్లింపు వార్తల్ని నిషేధిస్తున్నామని ప్రకటించిన ఎన్నికల సంఘం, ప్రెస్‌కౌన్సిల్, ఎన్బీయేలు అందుకు పాల్పడ్డవారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించినప్పటికీ.... ఏవో దొంగ దారుల్లో కొన్ని వర్గాల మీడియా ఈ విషయంలో బరితెగించింది. నిస్సిగ్గుగా చెల్లింపు వార్తల్ని రా(చూపి)స్తూనే వచ్చింది. తెలుగునాట కొన్ని పత్రికల తీరు, వైఖరి, వ్యవహారశైలి అత్యంత నీతిబాహ్యంగా, హేయంగా తయారయింది. పనిగట్టుకొని ఒక రాజకీయ పక్షంపై కక్ష గట్టిన తీరు, ఒక నాయకుడికి వ్యతిరేకంగా టన్నులకు టన్నులు వార్తలు వండి వార్చిన తీరు, సదరు పత్రిక అభిమానులైన వారికి కూడా జుగుప్స కలిగించేలా తయారైంది. నెలల తరబడి రాసిందానికి- తుది ఫలితానికి పొంతనే లేకపోయినా ఇంకా వారికే గొంతు! మామూలుగా గమనించినా.... ఆయా పత్రికలు, చానళ్లు ఇచ్చేదాంట్లో వాస్తవాల కన్నా, వార్తల కన్నా, సమాచారం కన్నా అందులో ఇంకేదో దాగి ఉంటుందన్నది సుస్పష్టం. దుగ్ద, కక్ష, కార్పణ్యం, ఈర్ష్య, ద్వేషం.... ఇలా అన్నీ కలసిన కలబోతగా ఉంటుంది. ఆ పోకడల్ని చూసినపుడు విదురనీతి గుర్తొస్తుంది. మహాభారతంలోని ఈ పద్యం అదే చెబుతుంది. ఇతరుల సంపదనీ, విద్యలో ఆరితేరిన తనాన్నీ, వర్చస్సునూ, బలాన్నీ... చూసి గుండె పగిలిపోయేలా ఈర్ష్యపడే మనుష్యుడు ఏ రోగమూ లేని దుఃఖం అనుభవిస్తాడని రాజుకు విదురుడు వివరిస్తాడు. దానికి తోడు, ఈ విశ్వంలో ఈర్ష్య అనే జబ్బుకు మందు లేదనే విషయం మనం గ్రహిస్తాం. - దిలీప్‌రెడ్డి