పద్యానవనం: మందులేని జబ్బు జబ్బు లేని వేదన!
పరుల ధనమునకు, విద్యా పరిణతికిని, దేహమునకు, బలమునకు మనం
బెరియంగ నసహ్యపడున న్నరుండు దెవులు లేని వేదనంబడు నదిఫా!
సృష్టిలో ప్రతిదీ ఒకదానికొకటి కార్యకారణ సంబంధం కలిగి ఉంటుందనేది కాదనలేని సత్యం. ఎందుకంటే, సందేహాలకతీతంగా ఇది పలుమార్లు రుజువైంది గనుక. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యంగా చెప్పుకునే భారతదేశం ఓ పెద్ద పండుగ ముగించుకుంది. ఇక్కడి ఎన్నికల నిర్వహణను చూసి ఈ భూమ్మీది చాలా దేశాల వాళ్లు ఆశ్చర్యపోతుంటారు. భిన్న జాతులు, భాషలు, సంస్కృతుల వారుండి, అరవై శాతం దాటని అక్షరాస్యతతో కూడా సజావుగా ఈ ప్రక్రియ జరిపించడం గొప్పే. అయితే, ఎప్పటికప్పుడు ఒక అవలక్షణాన్ని సరిదిద్దితే మరొకటి పుట్టుకొస్తోంది. ఇప్పుడే పుట్టుకొచ్చినవి కాకపోయినా కొన్ని అవలక్షణాలు ఈ సారి తారాస్థాయికి చేరి సగటు మనషికి వెగటు పుట్టించాయి. నిన్నా, మొన్నటి ఫలితాలతో ముగిసిన ఈ ఎన్నికల్లో ఏరులై పారిన డబ్బు గురించి తలచుకున్నపుడల్లా గుండె గుబేలు మంటుంది. పోలీసులు, మన నిఘా విభాగాలకు పట్టుబడ్డదే మన రాష్ట్రంలో దాదాపు నూటా యాబై కోట్ల రూపాయలకు పైబడి.
ఇంకా పట్టుబడకుండా పలువురికి పంచబడ్డ, పంచకుండానే మధ్య దళారీల పంచనపడ్డ, నీళ్ల ప్రాయంగా పంచి ఖర్చు చేసిన డబ్బు సంగతో! దానికి లెక్ఖే లేదు. ఇంత డబ్బు వ్యయం చేసి గెలుస్తున్న వారు నిజంగా నిస్వార్థమైన ప్రజాసేవ చేస్తారని ఎవరూ అనుకోరు. వాళ్లు చేయరు, చేస్తామని కూడా చెప్పరు. అయినా ప్రతి ఎన్నికలప్పుడూ ఇదిలాగే జరుగుతోంది. ‘అంత విచ్ఛలవిడిగా ఖర్చు చేయకు, అది వారిచ్చిన పరిమితిని మించితే ఎన్నికల సంఘంతో ఇబ్బంది’ అన్నపుడు ఓ ఎం.పి. అభ్యర్థి ఇచ్చిన సమాధానం నివ్వెరపరచింది. ‘పో అన్నా, వారికీ, వీరికీ భయపడి ఎన్నికల వ్యవహారం చేస్తే ఇక గెలిచినట్టే! భారతదేశ చరిత్రలో పరిమితి దాటి ఎన్నికల వ్యయం జరిపిన కారణం మీద ఎన్నికల సంఘం అనర్హుడిగా ప్రకటించిన ఒక్కడంటే ఒక్క ప్రజాప్రతినిధి పేరు చె’ప్పమన్నపుడు మతిపోవడం నా వంతయింది.
గతంలో జరిగిన పలు ఎన్నికలతో పోల్చి చూస్తే ఈసారి హింస తగ్గిన మాట నిజం. ఎన్నికల సందర్భంగా హింస, విధ్వంసాలు చాలా వరకు తగ్గాయి. రిగ్గింగు, బూతులను స్వాధీన పరచుకోవడం, ఒకరికి బదులు మరొకరు దొంగ ఓటు వేయడం వంటివి చాలా వరకు తగ్గిపోయాయి. ఓటరు చైతన్యం బాగా పెరిగింది. సంస్కరణల పుణ్యమా అని ఇన్ని సానుకూలాంశాలున్నాయని సంబరపడదామంటే, ఇంకో వైపు అవలక్షణాలు పెరిగిపోతున్నాయి. మీడియా గోల మితిమీరింది.
పిచ్చి రాతలు, పచ్చి కూతలకు పెద్దపీట వేస్తున్న కొన్ని ప్రసారమాధ్యమాల తీరు అత్యంత జుగుప్సాకరంగా మారింది. ఓపీనియన్ పోల్స్ అని, ఎగ్జిట్‌పోల్స్ అని, సర్వేలని... రకరకాల మార్గాల్లో తోచిందల్లా ప్రజాబాహుళ్యంలోకి పంపి గందరగోళ పరిస్థితుల్ని సృష్టించడం లోగడ ఎప్పుడూ లేనంత అతిగా తయారయిందీసారి. చెల్లింపు వార్తల్ని నిషేధిస్తున్నామని ప్రకటించిన ఎన్నికల సంఘం, ప్రెస్‌కౌన్సిల్, ఎన్బీయేలు అందుకు పాల్పడ్డవారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించినప్పటికీ.... ఏవో దొంగ దారుల్లో కొన్ని వర్గాల మీడియా ఈ విషయంలో బరితెగించింది.
నిస్సిగ్గుగా చెల్లింపు వార్తల్ని రా(చూపి)స్తూనే వచ్చింది. తెలుగునాట కొన్ని పత్రికల తీరు, వైఖరి, వ్యవహారశైలి అత్యంత నీతిబాహ్యంగా, హేయంగా తయారయింది. పనిగట్టుకొని ఒక రాజకీయ పక్షంపై కక్ష గట్టిన తీరు, ఒక నాయకుడికి వ్యతిరేకంగా టన్నులకు టన్నులు వార్తలు వండి వార్చిన తీరు, సదరు పత్రిక అభిమానులైన వారికి కూడా జుగుప్స కలిగించేలా తయారైంది. నెలల తరబడి రాసిందానికి- తుది ఫలితానికి పొంతనే లేకపోయినా ఇంకా వారికే గొంతు! మామూలుగా గమనించినా.... ఆయా పత్రికలు, చానళ్లు ఇచ్చేదాంట్లో వాస్తవాల కన్నా, వార్తల కన్నా, సమాచారం కన్నా అందులో ఇంకేదో దాగి ఉంటుందన్నది సుస్పష్టం. దుగ్ద, కక్ష, కార్పణ్యం, ఈర్ష్య, ద్వేషం.... ఇలా అన్నీ కలసిన కలబోతగా ఉంటుంది.
ఆ పోకడల్ని చూసినపుడు విదురనీతి గుర్తొస్తుంది. మహాభారతంలోని ఈ పద్యం అదే చెబుతుంది. ఇతరుల సంపదనీ, విద్యలో ఆరితేరిన తనాన్నీ, వర్చస్సునూ, బలాన్నీ... చూసి గుండె పగిలిపోయేలా ఈర్ష్యపడే మనుష్యుడు ఏ రోగమూ లేని దుఃఖం అనుభవిస్తాడని రాజుకు విదురుడు వివరిస్తాడు. దానికి తోడు, ఈ విశ్వంలో ఈర్ష్య అనే జబ్బుకు మందు లేదనే విషయం మనం గ్రహిస్తాం.
- దిలీప్‌రెడ్డి