జనామోదమే గీటురాయి | Security democracy | Sakshi
Sakshi News home page

జనామోదమే గీటురాయి

Published Fri, Sep 4 2015 12:10 AM | Last Updated on Fri, Sep 28 2018 4:15 PM

జనామోదమే గీటురాయి - Sakshi

జనామోదమే గీటురాయి

సమకాలీనం
 

ఉద్యమాల ఉనికి, ప్రజాస్పందన చూసి తమ దూకుడు నిర్ణయాల్ని తిరగరాసే ప్రభుత్వాలు, కడదాకా ప్రజాభిప్రాయానికి కట్టుబడాలి. అంతే తప్ప బిహార్ ఎన్నికలయ్యాకో, వర్షాకాల సమావేశాలు ముగిశాకో... దొంగదారులు వెతికి మరో రూపంలో ప్రజావ్యతిరేక విధానాల్ని తెరపైకి తెచ్చే యత్నం వద్దు. ప్రజలు ఏమరుపాటుగా ఉన్నపుడు తమ పాత ఆలోచనలకు పదునుపెట్టి కుక్క తోక వంకర అనిపించకూడదు. అప్పుడే ప్రజాభిప్రాయానికి విలువ ఇచ్చినట్టు లెక్క, ప్రజాస్వామ్యానికి భద్రత!
 
ప్రజాస్వామ్యంలో ప్రజలే సర్వసత్తాక ప్రభువులు... వ్యాసాల్లో వాడినీ, ఉప న్యాసాల్లో వేడినీ పెంచడానికి ఉపయోగపడే అందమైన వాక్యమే తప్ప వాస్తవంలో ప్రతిబింబించడం లేదని దీని గురించి అత్యధికులు అసంతృప్తి వ్యక్తం చేస్తారు. ఎక్కువ సందర్భాల్లో ఇది నిజమేనేమోననిపిస్తుంది. అరుదైన సందర్భాల్లో మాత్రం ప్రజలెంత శక్తిమంతులో పాలకులకు తెలిసివస్తుంది. ప్రభుత్వాలు తమ ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ప్రజాభిప్రాయానికి తలొగ్గి నిర్ణయాలు తీసుకోక తప్పదు. కొన్ని దుందుడుకు నిర్ణయాల్ని మార్చు కోవాల్సి వస్తుంది. ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిరక్షణకు ఇటువంటి సందర్భాలు తరచూ రావాలి.  భూసేకరణ ఆర్డినెన్స్‌ను తిరిగి తీసుకురారాదని  కేంద్రం లోని ఎన్డీయే ప్రభుత్వం వెనక్కి తగ్గడమైనా, చౌక మద్యం (చీప్ లిక్కర్) తేవా లన్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకోవడమైనా ప్రజా విజయాలే. ప్రజాభిమతాన్ని ప్రస్ఫుటించేలా ఆయా ప్రభుత్వాలు విజ్ఞతతో తీసుకున్నవి జనామోద నిర్ణయాలు. ఇదే స్ఫూర్తి అంతటా కొనసాగాలి. అబ్ర హాం లింకన్ ప్రజాస్వామ్యం గురించి చెప్పిన అద్భుతమైన నిర్వచనాన్ని కూడా కాలక్రమంలో మనవాళ్లు పక్కదారి పట్టిచ్చారు. ప్రజల కొరకు, ప్రజల యొక్క, ప్రజల చేత ఏర్పాటయ్యేదే ప్రజాస్వామ్య ప్రభుత్వమని ఆయన చెప్పారు. కానీ, వాటి అర్థాల్నే మార్చి, పూర్తి విరుద్ధ పరిస్థితుల్ని మనవాళ్లు ఆవిష్కరిస్తున్నారు. ప్రజల కొరకు అన్న చోట జౌట కు బదులు జ్చట (వారికి దూరంగా), ప్రజల యొక్క అన్న మాట ౌజ కు బదులుగా ౌజజ (వారికి కాకుం డా), ప్రజల చేత అన్న మాట ఛడ కి బదులుగా ఛఠడ (వారిని కొనుగోలు) చేయడం ద్వారా ఇష్టానుసారంగా వ్యవహరించే అవ్యవస్థలు నేడు నెలకొన్నా యనేది ప్రజాస్వామ్యవాదుల ఆందోళన. మెజారిటీ సిద్ధాంతం ఆధారంగా ఒకసారి ఎన్నికల్లో గెలిచామంటే... అది, ఆపై అయిదేళ్లపాటు ఏం చేయడాని కైనా అనుమతించే గంపగుత్త లెసైన్సు కాదు. ఈ పరిస్థితుల్లో ప్రజాభిప్రాయా న్ని మన్నించి పాలకులు, చట్టసభల్లో తగిన సంఖ్యాబలమున్న ప్రభుత్వాలూ విజ్ఞతతో వెనక్కి తగ్గడం ఆహ్వానించదగ్గ పరిణామం.

 కాలం చెల్లింది ఆర్డినెన్స్‌కా? ఆలోచనకా?
భూసేకరణ 2013 చట్టానికి పలు సవరణలతో వరుసగా మూడుసార్లు ఆర్డినె న్స్‌లు తీసుకువచ్చిన ఎన్డీయే ప్రభుత్వం, తదనంతరం ఆ పంథా కొనసాగిం చలేకపోయింది. మూడో మారు తెచ్చిన ఆర్డినెన్స్‌కు గడువు (ఈ ఆగస్టు 31) తో కాలం చెల్లిపోయేలా పరిస్థితిని అనుమతించిందే తప్ప మరోమారు ఆర్డినె న్స్‌ను జారీ చేయలేదు.‘అలా చేయొద్దని, ఆర్డినెన్స్ కాలం చెల్లిపోనివ్వాల’నే తాము నిర్ణయించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటిం చారు. తాము అధికారంలోకి రాకముందరి భూసేకరణ చట్టం-2013 యథా తథంగా అమల్లో ఉంటుందనీ ఆయన వివరణ ఇచ్చారు. కార్పొరేట్లకు మేలు చేసేందుకూ, రైతాంగపు భూయాజమాన్యపు హక్కుల్ని కాలరాస్తూ లోగడ జరిగిన భూసేకరణలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పశ్చిమ బెంగాల్‌లోని సింగూర్, నందిగ్రామ్ ఉద్యమాల తర్వాత దీనిపై విస్తృత చర్చే జరిగింది. పలు అధ్యయనాలు, సంప్రదింపుల తర్వాత... భూ యజమాను లకు తగు భద్రత కల్పించడంతోపాటు, వారి ప్రయోజనాల్ని, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ భూసేకరణ-2013 చట్టాన్ని అప్పటి యూపీయే ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. విపక్షంగా ఈ చట్టాన్ని డిమాండ్ చేసి, స్వాగతించిన ఎన్డీయే పెద్దన్న బీజేపీ, తాను అధికారంలోకి రాగానే పూర్తి విరుద్ధ వాదాన్ని వినిపించింది. చట్టంలోని కఠిన నిబంధనల వల్ల దేశంలో ఎక్కడా భూసేకరణ సాధ్యపడటం లేదని, సడలిస్తే తప్ప అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలు సాధ్యం కాదంటూ ‘పాలకపక్షం’ కూనిరాగం అందుకుంది.

ఇది నిజం కాదని, కేవలం పెట్టుబడుల్ని ఆకర్షించే మిషతో  కార్పొరేట్లకు మేలు చేసే ఎత్తుగడే తప్ప 2013 భూసేకరణ చట్టానికి సవరణలు అవసరం లేదని పలు అధ్యయన, పరిశోధన సంస్థలు సశాస్త్రీయంగా రుజువు చేశాయి. అయినా, మొండి పట్టుదలతో పార్లమెంటు సమావేశాల్లేని సమయం చూసి సర్కారు ఆర్డినెన్స్ తెచ్చింది. సుదీర్ఘకాలం తర్వాత సంపూర్ణ మెజారిటీతో అధికారంలో కొచ్చిన ఎన్డీయే ప్రభుత్వం, ఈ బిల్లును తేలిగ్గా ఉభయసభల్లో గట్టెక్కించు కొని చట్టం తేగలననుకుంది. కానీ, పరిస్థితి తిరగబడింది. మాతృ సంస్థ ఆరె స్సెస్ రైతు విభాగాలు, పలు సంస్థలు ఈ ఆర్డినెన్స్‌నీ, భూసేకరణ విషయం లో ఎన్డీయే వైఖరినే నిశితంగా తప్పుబట్టాయి. ఈ సంకట పరిస్థి తుల్లోనే, విపక్ష ఆధిపత్యం ఉన్న రాజ్యసభలో ప్రభుత్వం మాట చెల్లుబాటు కాలేదు. ఫలితంగా బిల్లు సెలెక్టు కమిటీకి వెళ్లింది. అక్కడా ఆపసోపాలు పడుతోంది. ఈలోపు వ్యూహాత్మకంగా మరో రెండుమార్లు ఆర్డినెన్స్ జారీచేసిన ప్రభు త్వం, ఇక వల్ల కాదని గ్రహించి చేతులెత్తింది. ఈ మధ్యలోనే బిహార్ ఎన్నికలు కూడా రావడంతో,  రైతు వ్యతిరేక ముద్రకు భయపడి ఎన్డీయే కాస్త మెత్తబ డింది. ఇది రాజకీయ అనివార్యతా? ప్రజాభిప్రాయానికి తలొగ్గడమా? ఏదై తేనేం ప్రభుత్వం సరైన దారిలోకొచ్చింది. అదే దారిలో ఏపీలో తెలుగు దేశం ప్రభుత్వం కూడా రాజధాని భూసేకరణ యత్నాల్ని విరమించుకోవాల్సి వచ్చింది. ఇది ప్రజావిజయమే.

 బంగారు కత్తి అని మెడ కోసుకుంటామా?
 తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చాలా విషయాల్లో దూకుడుగా వెళుతోం దన్న భావన ఉంది. బడుగు, బలహీన వర్గాల వారిని కుంగదీస్తూ వారి ఆర్థిక స్థితిని, చివరకు జీవితాల్ని చిన్నాభిన్నం చేస్తోందని ‘గుడుంబా’ (దొంగ సారా)పై ప్రభుత్వం యుద్ధమే ప్రకటించింది. ఇది మంచిదే! అయితే, గుడుం బాను అరికట్టాలంటే చౌకమద్యం తీసుకురావాల్సిందేనన్న వాదన చాలా మందికి మింగుడు పడలేదు. కొన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పోరాట కార్యక్రమాల్ని రచించి, ప్రకటించాయి. కొన్ని చోట్ల ఉద్యమాలు మొదలయ్యాయి. ఇప్పటికే, రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యాన్ని విచ్చలవిడిగా అందుబాటులోకి తేవడం వల్ల లెక్కలేనన్ని సంసారాలు గుల్ల అవుతున్నాయి. పెన్షన్లు ఇచ్చే క్రమంలో వితంతువుల వివరాలు సేకరించినపుడు కళ్లు చెదిరే వాస్తవాలు ఎదురై రెవెన్యూ, పంచాయతీ అధికారుల్ని గగుర్పాటుకు గురిచే శాయి. వితంతువుల్లో అత్యధికులు యువతులు-మధ్య వయస్కులున్నారని, అందులోనూ ఎక్కువమంది భర్తలు తాగుడు వల్ల మరణించారని వారి వద్ద గణాంకాలున్నాయి. ‘వందేమాతరం ఫౌండేషన్’, ‘జ్ఞానసరస్వతి ఫౌండేషన్’ వంటి సంస్థలు ప్రభుత్వ పాఠశాలల్లోని అనాథ పిల్లలకు చేయూతనిచ్చే క్రమంలో సేకరించిన సమాచారం విస్మయం కలిగించేదే! అత్యధిక సంద ర్భాల్లో అనాథల తండ్రులు తాగుడుకు బానిసలై అర్ధాయుష్కులైన వారే. ప్రభుత్వం విధించే మద్యనిషేధం అమలు కాలేదన్న గత చరిత్ర వాస్తవమే అయినా... విచ్చల విడిగా మద్యం అందుబాటులో ఉంచడం విని యోగాన్ని పెంచిందన్నది మరింత వాస్తవం. ప్రభుత్వపరమైన కట్టడి, తేలిగ్గా అందుబాటులో లేకుండా చూడటం మద్యం వినియోగాన్ని తగ్గించిందన్నది ఇంకా కఠోర సత్యం. ఈ సూత్రం ఆధారంగానే... మద్యం, సిగరెట్లు, గుట్కా వంటి హానికరమైన ఉత్పత్తుల వినియోగాన్ని నియంత్రించే క్రమంలో వాటిపై అసాధారణమైన పన్నులు, సుంకాలు విధిస్తారు. ఇది, హానికరమైన వస్తు వులు తేలికగా, విరివిగా లభించకుండా నియంత్రించే పరోక్ష పద్ధతి. ఇందుకు విరుద్ధంగా, చౌక మద్యాన్ని మరింత చౌకగా, విచ్చలవిడిగా అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వం ప్రకటించడమే ఆశ్చర్యకరం. ‘ఏం చేసినా గుడుంబా వినియోగం తగ్గటం లేదు, అది డబ్బు దండగే కాక ప్రాణహాని, ఆరోగ్యానికి భంగకరం కనుక ఉన్నంతలో మెరుగైన చౌక మద్యం తీసుకువస్తాం’ అని ప్రభుత్వం చెప్పింది. ‘మద్యం హానికరం’ అని నిర్ధారించుకున్న తర్వాత దాన్ని ఏ రూపంలో, ఏ పద్ధతిలోనూ ప్రోత్సహించ కూడదు. చివరకు, గుడుంబాను నియంత్రించడానికైనా కూడా చౌక మద్యాన్ని ప్రోత్సహించరాదు. ముందు మొండికేసినా, ప్రజాభిప్రాయానికి తలొగ్గక తప్పలేదు. ఇదీ ప్రజావిజయమే!

 ఆదమరిచాక... అడ్డదారులు వెతకొద్దు
 ఉద్యమాల ఉనికి, ప్రజాస్పందన చూసి తమ దూకుడు నిర్ణయాల్ని తిరగరాసే ప్రభుత్వాలు, కడదాకా ప్రజాభిప్రాయానికి కట్టుబడాలి. అంతే తప్ప బిహార్ ఎన్నికలయ్యాకో, వర్షాకాల సమావేశాలు ముగిశాకో... దొంగదారులు వెతికి మరో రూపంలో ప్రజావ్యతిరేక విధానాల్ని తెరపైకి తెచ్చే యత్నం వద్దు. ప్రజ లు ఏమరుపాటుగా ఉన్నపుడు తమ పాత ఆలోచనలకు పదునుపెట్టి కుక్క తోక వంకర అనిపించకూడదు. అప్పుడే ప్రజాభిప్రాయానికి విలువిచ్చినట్టు లెక్క, ప్రజాస్వామ్యానికి భద్రత! రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృత ప్రజావళికి సంబంధించి నలుగుతున్న కీలకమైన విషయాల్లోనూ కేంద్ర-రాష్ట్ర ప్రభు త్వాలు సంయమనంతో వ్యవహరించాలి. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా విష యంలో ప్రజాభిప్రాయానికి అనుకూలంగా నిర్ణయం జరగటంలేదు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదించేప్పుడు సాక్షాత్తు ప్రధానమంత్రి, పార్ల మెంటు వేదికగా ప్రకటించిన ప్రత్యేక హోదాకు ఇప్పటికీ దిక్కులేదు.  ఇతరే తర రాజకీయ, చట్టపరమైన అంశాల్లో సానుకూలత కోసం పాకులాటలో రాష్ట్ర పాలకపక్షమైన తెలుగుదేశం కూడా ఈ విషయంపై పట్టుబట్టడం లేదు. అంతిమంగా అది ప్రజాగ్రహానికి దారితీయడం ఖాయం. తెలంగాణలోనూ ప్రభుత్వం కొన్ని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోంది. పది, పదిహేను వేల ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలన్న తలంపునకు వ్యతిరేకంగా పోరా డేందుకు ప్రజా సంఘాలు సమాయత్తమౌతున్నాయి. అక్కడొకటి అక్కడొక టిగా ఉన్న ఫార్మా కంపెనీల వల్ల ఉపరితల కాలుష్యంతోపాటు భూగర్భజ లాలు ఇప్పటికే కలుషితమై ఆయా ప్రాంతాలకు శాపంగా పరిణమించింది. సరైన నియంత్రణ వ్యవస్థలు లేని రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో ఈ ఫార్మాసిటీ కోసం ప్రాథమిక యత్నా లు గుట్టు చప్పుడు కాకుండా జరిపిస్తోంది.

ఈ విషయంలోనూ ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి తగిన ప్రాధాన్యమిచ్చి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవస రం ఉంది. ప్రభుత్వాల నిర్ణయాల్ని ఎప్పటికప్పుడు ప్రభావితం చేసేలా పౌర చైతన్యం మరింత బలపడాల్సిన అవసరం రెండు తెలుగురాష్ట్రాల్లో ఉందని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. జాతిపిత మహాత్ముడన్నట్టు, ‘ఏ కొందరి చేతుల్లోనో అధికారం ఉండటం కాదు ప్రజాస్వామ్యం. ప్రభుత్వాలు దారి తప్పినపుడు, ప్రశ్నించి సరిదిద్దుకొమ్మని చెప్పే సత్తా ప్రతి పౌరుడికి లభించినపుడే అది ప్రజాస్వామ్యం’ అన్నది నూరు పాళ్లు నిజం.
 
ఈమెయిల్: dileepreddy@sakshi.com                                     
దిలీప్ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement