Cheap alcohol
-
చౌక మద్యంపై సరైన నిర్ణయం
ప్రభుత్వాలకు ఆదాయం రావాలి. దీనిని ఎవరూ కాదనలేరు. కానీ ప్రజా సంక్షేమాన్నీ, ఆరోగ్యాన్నీ ఫణంగా పెట్టి ఆదాయం పెంచుకోవడం ప్రజాస్వామ్య యుగానికి సరికాదు. రూపాయికో, రెండు రూపాయలకో బియ్యం పంపిణీ చేస్తూ, ఆబ్కారీ ఆదాయాన్ని పెంచుకోవాలని చూడ టం పెద్ద దగా తప్ప మరొకటి కాదు. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగానే అయినా గుర్తించినందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించవల సిందే. చౌక మద్యం ప్రవేశపెట్టాలన్న నిర్ణయం తీసుకున్నప్పటికీ, తరు వాత ప్రజాభిప్రాయానికి తలొగ్గి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టడం హర్షించదగినదే. గుడుంబా తాకిడిని అరికట్టడానికే చౌకమద్యం తేవాలని భావించినట్టు ముఖ్యమంత్రి చెప్పడం సబబు కాదు. మద్యం, గుడుంబా రెండూ ప్రజలకు హాని చేస్తాయి. గుడుంబా తక్షణం సంసారాలనూ, ఆరోగ్యాన్నీ పతనం చేస్తుంది. చౌకమద్యం కాస్త ఆలస్యంగా చేస్తుంది. ఏమైనా రెండూ కింది వర్గాలను నాశనం చేసేవే. అబ్కారీ విధానం ప్రస్తుతానికి యథాతథంగానే ఉంటుందని ప్రకటిం చిన ముఖ్యమంత్రికి అభినందనలు. పథకాలు పేదలకు ఉపకరించ కున్నా, వారిని గుల్ల చేసే రీతిలో ఉండకపోతే మేలు. ఒక చేత్తో సాయం చేస్తున్నట్లు కనిపిస్తూ, మరో చేత్తో జేబుకు చిల్లు పెట్టే కార్యక్రమాన్ని ప్రజాహిత ప్రభుత్వాలేవి కూడా తీసుకోకూడదు. పేద ప్రజల బలహీ నత మీద ప్రభుత్వాలను బతికించాలని చూడరాదు. తునికి పెద్దగంగారాం మోతే, కరీంగనగర్ జిల్లా -
జనామోదమే గీటురాయి
సమకాలీనం ఉద్యమాల ఉనికి, ప్రజాస్పందన చూసి తమ దూకుడు నిర్ణయాల్ని తిరగరాసే ప్రభుత్వాలు, కడదాకా ప్రజాభిప్రాయానికి కట్టుబడాలి. అంతే తప్ప బిహార్ ఎన్నికలయ్యాకో, వర్షాకాల సమావేశాలు ముగిశాకో... దొంగదారులు వెతికి మరో రూపంలో ప్రజావ్యతిరేక విధానాల్ని తెరపైకి తెచ్చే యత్నం వద్దు. ప్రజలు ఏమరుపాటుగా ఉన్నపుడు తమ పాత ఆలోచనలకు పదునుపెట్టి కుక్క తోక వంకర అనిపించకూడదు. అప్పుడే ప్రజాభిప్రాయానికి విలువ ఇచ్చినట్టు లెక్క, ప్రజాస్వామ్యానికి భద్రత! ప్రజాస్వామ్యంలో ప్రజలే సర్వసత్తాక ప్రభువులు... వ్యాసాల్లో వాడినీ, ఉప న్యాసాల్లో వేడినీ పెంచడానికి ఉపయోగపడే అందమైన వాక్యమే తప్ప వాస్తవంలో ప్రతిబింబించడం లేదని దీని గురించి అత్యధికులు అసంతృప్తి వ్యక్తం చేస్తారు. ఎక్కువ సందర్భాల్లో ఇది నిజమేనేమోననిపిస్తుంది. అరుదైన సందర్భాల్లో మాత్రం ప్రజలెంత శక్తిమంతులో పాలకులకు తెలిసివస్తుంది. ప్రభుత్వాలు తమ ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ప్రజాభిప్రాయానికి తలొగ్గి నిర్ణయాలు తీసుకోక తప్పదు. కొన్ని దుందుడుకు నిర్ణయాల్ని మార్చు కోవాల్సి వస్తుంది. ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిరక్షణకు ఇటువంటి సందర్భాలు తరచూ రావాలి. భూసేకరణ ఆర్డినెన్స్‌ను తిరిగి తీసుకురారాదని కేంద్రం లోని ఎన్డీయే ప్రభుత్వం వెనక్కి తగ్గడమైనా, చౌక మద్యం (చీప్ లిక్కర్) తేవా లన్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకోవడమైనా ప్రజా విజయాలే. ప్రజాభిమతాన్ని ప్రస్ఫుటించేలా ఆయా ప్రభుత్వాలు విజ్ఞతతో తీసుకున్నవి జనామోద నిర్ణయాలు. ఇదే స్ఫూర్తి అంతటా కొనసాగాలి. అబ్ర హాం లింకన్ ప్రజాస్వామ్యం గురించి చెప్పిన అద్భుతమైన నిర్వచనాన్ని కూడా కాలక్రమంలో మనవాళ్లు పక్కదారి పట్టిచ్చారు. ప్రజల కొరకు, ప్రజల యొక్క, ప్రజల చేత ఏర్పాటయ్యేదే ప్రజాస్వామ్య ప్రభుత్వమని ఆయన చెప్పారు. కానీ, వాటి అర్థాల్నే మార్చి, పూర్తి విరుద్ధ పరిస్థితుల్ని మనవాళ్లు ఆవిష్కరిస్తున్నారు. ప్రజల కొరకు అన్న చోట జౌట కు బదులు జ్చట (వారికి దూరంగా), ప్రజల యొక్క అన్న మాట ౌజ కు బదులుగా ౌజజ (వారికి కాకుం డా), ప్రజల చేత అన్న మాట ఛడ కి బదులుగా ఛఠడ (వారిని కొనుగోలు) చేయడం ద్వారా ఇష్టానుసారంగా వ్యవహరించే అవ్యవస్థలు నేడు నెలకొన్నా యనేది ప్రజాస్వామ్యవాదుల ఆందోళన. మెజారిటీ సిద్ధాంతం ఆధారంగా ఒకసారి ఎన్నికల్లో గెలిచామంటే... అది, ఆపై అయిదేళ్లపాటు ఏం చేయడాని కైనా అనుమతించే గంపగుత్త లెసైన్సు కాదు. ఈ పరిస్థితుల్లో ప్రజాభిప్రాయా న్ని మన్నించి పాలకులు, చట్టసభల్లో తగిన సంఖ్యాబలమున్న ప్రభుత్వాలూ విజ్ఞతతో వెనక్కి తగ్గడం ఆహ్వానించదగ్గ పరిణామం. కాలం చెల్లింది ఆర్డినెన్స్కా? ఆలోచనకా? భూసేకరణ 2013 చట్టానికి పలు సవరణలతో వరుసగా మూడుసార్లు ఆర్డినె న్స్‌లు తీసుకువచ్చిన ఎన్డీయే ప్రభుత్వం, తదనంతరం ఆ పంథా కొనసాగిం చలేకపోయింది. మూడో మారు తెచ్చిన ఆర్డినెన్స్‌కు గడువు (ఈ ఆగస్టు 31) తో కాలం చెల్లిపోయేలా పరిస్థితిని అనుమతించిందే తప్ప మరోమారు ఆర్డినె న్స్ను జారీ చేయలేదు.‘అలా చేయొద్దని, ఆర్డినెన్స్ కాలం చెల్లిపోనివ్వాల’నే తాము నిర్ణయించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటిం చారు. తాము అధికారంలోకి రాకముందరి భూసేకరణ చట్టం-2013 యథా తథంగా అమల్లో ఉంటుందనీ ఆయన వివరణ ఇచ్చారు. కార్పొరేట్లకు మేలు చేసేందుకూ, రైతాంగపు భూయాజమాన్యపు హక్కుల్ని కాలరాస్తూ లోగడ జరిగిన భూసేకరణలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పశ్చిమ బెంగాల్‌లోని సింగూర్, నందిగ్రామ్ ఉద్యమాల తర్వాత దీనిపై విస్తృత చర్చే జరిగింది. పలు అధ్యయనాలు, సంప్రదింపుల తర్వాత... భూ యజమాను లకు తగు భద్రత కల్పించడంతోపాటు, వారి ప్రయోజనాల్ని, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ భూసేకరణ-2013 చట్టాన్ని అప్పటి యూపీయే ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. విపక్షంగా ఈ చట్టాన్ని డిమాండ్ చేసి, స్వాగతించిన ఎన్డీయే పెద్దన్న బీజేపీ, తాను అధికారంలోకి రాగానే పూర్తి విరుద్ధ వాదాన్ని వినిపించింది. చట్టంలోని కఠిన నిబంధనల వల్ల దేశంలో ఎక్కడా భూసేకరణ సాధ్యపడటం లేదని, సడలిస్తే తప్ప అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలు సాధ్యం కాదంటూ ‘పాలకపక్షం’ కూనిరాగం అందుకుంది. ఇది నిజం కాదని, కేవలం పెట్టుబడుల్ని ఆకర్షించే మిషతో కార్పొరేట్లకు మేలు చేసే ఎత్తుగడే తప్ప 2013 భూసేకరణ చట్టానికి సవరణలు అవసరం లేదని పలు అధ్యయన, పరిశోధన సంస్థలు సశాస్త్రీయంగా రుజువు చేశాయి. అయినా, మొండి పట్టుదలతో పార్లమెంటు సమావేశాల్లేని సమయం చూసి సర్కారు ఆర్డినెన్స్ తెచ్చింది. సుదీర్ఘకాలం తర్వాత సంపూర్ణ మెజారిటీతో అధికారంలో కొచ్చిన ఎన్డీయే ప్రభుత్వం, ఈ బిల్లును తేలిగ్గా ఉభయసభల్లో గట్టెక్కించు కొని చట్టం తేగలననుకుంది. కానీ, పరిస్థితి తిరగబడింది. మాతృ సంస్థ ఆరె స్సెస్ రైతు విభాగాలు, పలు సంస్థలు ఈ ఆర్డినెన్స్‌నీ, భూసేకరణ విషయం లో ఎన్డీయే వైఖరినే నిశితంగా తప్పుబట్టాయి. ఈ సంకట పరిస్థి తుల్లోనే, విపక్ష ఆధిపత్యం ఉన్న రాజ్యసభలో ప్రభుత్వం మాట చెల్లుబాటు కాలేదు. ఫలితంగా బిల్లు సెలెక్టు కమిటీకి వెళ్లింది. అక్కడా ఆపసోపాలు పడుతోంది. ఈలోపు వ్యూహాత్మకంగా మరో రెండుమార్లు ఆర్డినెన్స్ జారీచేసిన ప్రభు త్వం, ఇక వల్ల కాదని గ్రహించి చేతులెత్తింది. ఈ మధ్యలోనే బిహార్ ఎన్నికలు కూడా రావడంతో, రైతు వ్యతిరేక ముద్రకు భయపడి ఎన్డీయే కాస్త మెత్తబ డింది. ఇది రాజకీయ అనివార్యతా? ప్రజాభిప్రాయానికి తలొగ్గడమా? ఏదై తేనేం ప్రభుత్వం సరైన దారిలోకొచ్చింది. అదే దారిలో ఏపీలో తెలుగు దేశం ప్రభుత్వం కూడా రాజధాని భూసేకరణ యత్నాల్ని విరమించుకోవాల్సి వచ్చింది. ఇది ప్రజావిజయమే. బంగారు కత్తి అని మెడ కోసుకుంటామా? తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా విషయాల్లో దూకుడుగా వెళుతోం దన్న భావన ఉంది. బడుగు, బలహీన వర్గాల వారిని కుంగదీస్తూ వారి ఆర్థిక స్థితిని, చివరకు జీవితాల్ని చిన్నాభిన్నం చేస్తోందని ‘గుడుంబా’ (దొంగ సారా)పై ప్రభుత్వం యుద్ధమే ప్రకటించింది. ఇది మంచిదే! అయితే, గుడుం బాను అరికట్టాలంటే చౌకమద్యం తీసుకురావాల్సిందేనన్న వాదన చాలా మందికి మింగుడు పడలేదు. కొన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పోరాట కార్యక్రమాల్ని రచించి, ప్రకటించాయి. కొన్ని చోట్ల ఉద్యమాలు మొదలయ్యాయి. ఇప్పటికే, రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యాన్ని విచ్చలవిడిగా అందుబాటులోకి తేవడం వల్ల లెక్కలేనన్ని సంసారాలు గుల్ల అవుతున్నాయి. పెన్షన్లు ఇచ్చే క్రమంలో వితంతువుల వివరాలు సేకరించినపుడు కళ్లు చెదిరే వాస్తవాలు ఎదురై రెవెన్యూ, పంచాయతీ అధికారుల్ని గగుర్పాటుకు గురిచే శాయి. వితంతువుల్లో అత్యధికులు యువతులు-మధ్య వయస్కులున్నారని, అందులోనూ ఎక్కువమంది భర్తలు తాగుడు వల్ల మరణించారని వారి వద్ద గణాంకాలున్నాయి. ‘వందేమాతరం ఫౌండేషన్’, ‘జ్ఞానసరస్వతి ఫౌండేషన్’ వంటి సంస్థలు ప్రభుత్వ పాఠశాలల్లోని అనాథ పిల్లలకు చేయూతనిచ్చే క్రమంలో సేకరించిన సమాచారం విస్మయం కలిగించేదే! అత్యధిక సంద ర్భాల్లో అనాథల తండ్రులు తాగుడుకు బానిసలై అర్ధాయుష్కులైన వారే. ప్రభుత్వం విధించే మద్యనిషేధం అమలు కాలేదన్న గత చరిత్ర వాస్తవమే అయినా... విచ్చల విడిగా మద్యం అందుబాటులో ఉంచడం విని యోగాన్ని పెంచిందన్నది మరింత వాస్తవం. ప్రభుత్వపరమైన కట్టడి, తేలిగ్గా అందుబాటులో లేకుండా చూడటం మద్యం వినియోగాన్ని తగ్గించిందన్నది ఇంకా కఠోర సత్యం. ఈ సూత్రం ఆధారంగానే... మద్యం, సిగరెట్లు, గుట్కా వంటి హానికరమైన ఉత్పత్తుల వినియోగాన్ని నియంత్రించే క్రమంలో వాటిపై అసాధారణమైన పన్నులు, సుంకాలు విధిస్తారు. ఇది, హానికరమైన వస్తు వులు తేలికగా, విరివిగా లభించకుండా నియంత్రించే పరోక్ష పద్ధతి. ఇందుకు విరుద్ధంగా, చౌక మద్యాన్ని మరింత చౌకగా, విచ్చలవిడిగా అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వం ప్రకటించడమే ఆశ్చర్యకరం. ‘ఏం చేసినా గుడుంబా వినియోగం తగ్గటం లేదు, అది డబ్బు దండగే కాక ప్రాణహాని, ఆరోగ్యానికి భంగకరం కనుక ఉన్నంతలో మెరుగైన చౌక మద్యం తీసుకువస్తాం’ అని ప్రభుత్వం చెప్పింది. ‘మద్యం హానికరం’ అని నిర్ధారించుకున్న తర్వాత దాన్ని ఏ రూపంలో, ఏ పద్ధతిలోనూ ప్రోత్సహించ కూడదు. చివరకు, గుడుంబాను నియంత్రించడానికైనా కూడా చౌక మద్యాన్ని ప్రోత్సహించరాదు. ముందు మొండికేసినా, ప్రజాభిప్రాయానికి తలొగ్గక తప్పలేదు. ఇదీ ప్రజావిజయమే! ఆదమరిచాక... అడ్డదారులు వెతకొద్దు ఉద్యమాల ఉనికి, ప్రజాస్పందన చూసి తమ దూకుడు నిర్ణయాల్ని తిరగరాసే ప్రభుత్వాలు, కడదాకా ప్రజాభిప్రాయానికి కట్టుబడాలి. అంతే తప్ప బిహార్ ఎన్నికలయ్యాకో, వర్షాకాల సమావేశాలు ముగిశాకో... దొంగదారులు వెతికి మరో రూపంలో ప్రజావ్యతిరేక విధానాల్ని తెరపైకి తెచ్చే యత్నం వద్దు. ప్రజ లు ఏమరుపాటుగా ఉన్నపుడు తమ పాత ఆలోచనలకు పదునుపెట్టి కుక్క తోక వంకర అనిపించకూడదు. అప్పుడే ప్రజాభిప్రాయానికి విలువిచ్చినట్టు లెక్క, ప్రజాస్వామ్యానికి భద్రత! రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృత ప్రజావళికి సంబంధించి నలుగుతున్న కీలకమైన విషయాల్లోనూ కేంద్ర-రాష్ట్ర ప్రభు త్వాలు సంయమనంతో వ్యవహరించాలి. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా విష యంలో ప్రజాభిప్రాయానికి అనుకూలంగా నిర్ణయం జరగటంలేదు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదించేప్పుడు సాక్షాత్తు ప్రధానమంత్రి, పార్ల మెంటు వేదికగా ప్రకటించిన ప్రత్యేక హోదాకు ఇప్పటికీ దిక్కులేదు. ఇతరే తర రాజకీయ, చట్టపరమైన అంశాల్లో సానుకూలత కోసం పాకులాటలో రాష్ట్ర పాలకపక్షమైన తెలుగుదేశం కూడా ఈ విషయంపై పట్టుబట్టడం లేదు. అంతిమంగా అది ప్రజాగ్రహానికి దారితీయడం ఖాయం. తెలంగాణలోనూ ప్రభుత్వం కొన్ని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోంది. పది, పదిహేను వేల ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలన్న తలంపునకు వ్యతిరేకంగా పోరా డేందుకు ప్రజా సంఘాలు సమాయత్తమౌతున్నాయి. అక్కడొకటి అక్కడొక టిగా ఉన్న ఫార్మా కంపెనీల వల్ల ఉపరితల కాలుష్యంతోపాటు భూగర్భజ లాలు ఇప్పటికే కలుషితమై ఆయా ప్రాంతాలకు శాపంగా పరిణమించింది. సరైన నియంత్రణ వ్యవస్థలు లేని రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో ఈ ఫార్మాసిటీ కోసం ప్రాథమిక యత్నా లు గుట్టు చప్పుడు కాకుండా జరిపిస్తోంది. ఈ విషయంలోనూ ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి తగిన ప్రాధాన్యమిచ్చి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవస రం ఉంది. ప్రభుత్వాల నిర్ణయాల్ని ఎప్పటికప్పుడు ప్రభావితం చేసేలా పౌర చైతన్యం మరింత బలపడాల్సిన అవసరం రెండు తెలుగురాష్ట్రాల్లో ఉందని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. జాతిపిత మహాత్ముడన్నట్టు, ‘ఏ కొందరి చేతుల్లోనో అధికారం ఉండటం కాదు ప్రజాస్వామ్యం. ప్రభుత్వాలు దారి తప్పినపుడు, ప్రశ్నించి సరిదిద్దుకొమ్మని చెప్పే సత్తా ప్రతి పౌరుడికి లభించినపుడే అది ప్రజాస్వామ్యం’ అన్నది నూరు పాళ్లు నిజం. ఈమెయిల్: dileepreddy@sakshi.com దిలీప్ రెడ్డి -
చౌక మద్యంపై పిల్లిమొగ్గలు!
గుడుంబా నిర్మూలన కోసం ప్రవేశపెడతామన్న సర్కారు * ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల ఆందోళనతో ‘తాత్కాలిక’ వెనకడుగు * ప్రజల్లో చర్చకు పెట్టి తరువాత అధికారికంగా గ్రామాల్లోకి పంపే యోచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గుడుంబాను అరికట్టేందుకు ‘చౌక మద్యం’ ప్రవేశపెడతామన్న రాష్ట్ర ప్రభుత్వం.. దీనిపై ప్రతిపక్షాలు, సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో పిల్లిమొగ్గలు వేస్తోంది. ఈ సంవత్సరానికి చౌక మద్యం ఉండదని, పాత చీప్ లిక్కర్ విక్రయాలే కొనసాగుతాయని స్పష్టం చేసింది. అయితే ఈ ప్రకటన వెనుక ‘గుడుంబాకు బదులు చౌక మద్యం ప్రవేశపెట్టాలి’ అనే రీతిలో ప్రజలను మానసికంగా సిద్ధం చేసే ఆలోచన సర్కారుకు ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో మంత్రుల అభిప్రాయాల పేరుతో ‘ఈ సంవత్సరం పాత విధానాన్నే కొనసాగిస్తున్నట్లు’ సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రతిపక్షాలకు ఆయుధం ఇవ్వకుండా ప్రజల్లో చర్చకు పెట్టి.. ఆ తరువాత అనుకున్న విధంగా చౌకమద్యాన్ని రిటైల్ దుకాణాలకు సరఫరా చేసే యోచన ప్రభుత్వానికి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం విక్రయిస్తున్న చీప్ లిక్కర్‌నే కొంతకాలం పాటు విక్రయించాలని, క్రమక్రమంగా చౌక మద్యాన్ని ప్రవేశపెట్టాలని సీఎం సహా ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు సమాచారం. అందుకే సీఎం మీడియా సమావేశంలో ఎక్కడా చీప్‌లిక్కర్‌ను తీసుకురావడం లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పలేదు. 2016 జూన్ 30 వరకు అంటే 9 నెలలు మాత్రమే మంత్రివర్గం ఆమోదించిన నూతన మద్యం పాలసీ ఆచరణలో ఉంటుంది. మండలం యూనిట్‌కు కారణమదే! చౌక మద్యం ఆలోచనతోనే మండలాలు యూనిట్‌గా మద్యం పాలసీకి రూపకల్పన జరిగింది. మండలం లెసైన్సు పొందిన వారే గ్రామాల్లో బి-లెసైన్సు దుకాణాలు ఏర్పాటు చేసుకొని విక్రయించుకునే వెసులుబాటు కొత్త విధానంలో లభించనుంది. తద్వారా గుడుంబా విక్రయాలను నిలువరించే పనిని లెసైన్సుదారులకు అప్పగించాలని భావించారు. తాజాగా చౌకమద్యంపై సర్కారు వెనక్కి తగ్గినప్పటికీ మండలం యూనిట్‌గా లెసైన్సు, బి-లెసైన్సు దుకాణాల్లో పాత పద్ధతిలోనే రూ.60, రూ.35 ధరలకే చీప్ లిక్కర్ విక్రయిస్తారు. వెనకడుగు తాత్కాలికమే! రాష్ట్రంలో గుడుంబాకు విరుగుడుగా చౌకమద్యం ప్రవేశపెడతామని సీఎం 6 నెలలుగా చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో 20 ఏళ్ల క్రితం రద్దు చేసిన సారాను తెరపైకి తేవాలని తొలుత భావించారు. కానీ దీనిపై వ్యతిరేకత వ్యక్తమవుతుందేమోనన్న భావనతో కొం దరు అధికారులను ఇతర రాష్ట్రాలకు పంపి చౌక మద్యంపై అధ్యయనం చేయించారు. మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లో రూ.20 లోపు ధరలో 90ఎంఎల్ మద్యం అందుబాటులో ఉందని తేలడంతో గుడుంబా విక్రయించే ధర(రూ.10)కే మద్యం విక్రయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అయితే అది వీలుకాదని అధికారులు చెప్పడంతో రూ.15కు 90ఎంఎల్ మద్యం అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా, ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ పలుమార్లు సీఎం, సీఎస్‌లతో చర్చలు జరిపారు. ఆరు డిస్టిలరీలతో మాట్లాడి అక్టోబర్ ఒకటి కల్లా చీప్‌లిక్కర్‌ను సరఫరా చేసేలా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే చౌక మద్యంపై కల్లుగీత కార్మిక సంఘాలు, మహిళా సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో... ఉన్నతస్థాయిలో చర్చలు జరిపి, చౌక మద్యం అంశాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టాలనే నిర్ణయానికి వచ్చారు. -
చౌక మద్యం ఉండాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: గుడుంబాను అరికట్టేందుకు చౌకమద్యం ఉండాలన్న నిర్ణయానికే ప్రభుత్వం కట్టుబడింది. రూ.15 కే 90 మిల్లీలీటర్ల మద్యం అందించేందుకు సిద్ధమైంది. ఆదాయం లేకున్నా, ప్రజల ప్రాణాలకు హాని కలగకుండా ఉండేందుకు పల్లెల్లో చౌకమద్యం ఉండాల్సిందేనని ఉన్నతస్థాయి వర్గాలు చెప్పాయి. అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చే నూతన మద్యం పాలసీపై సీఎం ఆమోదముద్ర వేశారు. 26 లోగా ఉత్తర్వులు ఇచ్చేలా, ఆ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరో 60 బార్లు కొత్త మద్యం విధానంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. వైన్‌షాపులు, బార్లకు చెరో గంట సమయాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. వైన్‌షాపుల వేళల్ని ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు, బార్ అండ్ రెస్టారెంట్లు ఉదయం 10 నుంచి రాత్రి 12 వరకు తెరిచి ఉంచనున్నారు. రాష్ట్రంలో అదనంగా 60 బార్ల ఏర్పాటుకు అనుమతి ఇవ్వనున్నారు. వైన్‌షాపుల పెంపునకు ‘నో’ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 2,216 మద్యం దుకాణాలను కొనసాగించాలని సర్కారు భావిస్తోంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో 1,500 పైచిలుకు ఉన్న మద్యం దుకాణాలకు మండలం యూనిట్‌గా లాటరీ పద్ధతిలో లెసైన్స్‌లు ఇస్తారు. దీంతో వైన్‌షాపులను పెంచాల్సిన అవసరం లేదని భావిస్తోంది. మండలం లెసైన్స్ పొందిన వ్యక్తి దాని పరిధి గ్రామాల్లో కూడా ఇకపై దుకాణాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఆదాయంపైనా దృష్టి ఆబ్కారీ శాఖ నుంచి ప్రస్తుతం లభిస్తున్న రూ.10 వేల కోట్లను ఈసారి మరో రెండు వేల కోట్లు అదనంగా రాబట్టాలని సర్కారు చూస్తోంది. మద్యం దుకాణాలకు దరఖాస్తు ఫీజు, మండలానికి ఒకటే ఏర్పాటు కానున్న వైన్‌షాపు లెసైన్స్‌కు భారీగా వడ్డించాలని నిర్ణయించింది. దరఖాస్తు ఫీజు 20 శాతం, లెసైన్స్ ఫీజు 15 శాతం పెంచాలని భావిస్తోంది. మండలంలో వైన్‌షాపుకు రూ.కోటి వరకు నిర్ణయించే అవకాశం ఉంది. -
చౌక మద్యంపై నో వ్యాట్!
రాష్ట్ర సర్కారు ఆలోచన సాక్షి, హైదరాబాద్: మార్కెట్లో మంచినీళ్ల బాటిల్ ధర రూ. 20 పలుకుతోంది. సీసా కల్లు ధర కూడా రూ. 20కి తక్కువకు దొరకట్లేదు. కానీ అక్టోబర్ నుంచి రాష్ట్రంలో రూ.15కే చౌకమద్యం అందించేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. గిరిజన తండాలు మొదలుకొని గ్రామాలు, నగరాల వరకు ఎక్కడైనా లభిస్తున్న గుడుంబాకు విరుగుడుగా రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకు మద్యాన్ని అందించాలని నిర్ణయించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తొలుత గుడుంబా ప్యాకెట్లను విక్రయిస్తున్న రూ.10కే 90 ఎంఎల్ మద్యాన్ని (కంట్రీ లిక్కర్) అందించాలని సీఎం కేసీఆర్ సూచించినా ఆ ధరకు మద్యాన్ని అందించేందుకు డిస్టిలరీలు ముందుకు రావని అధికారులు చెప్పడంతో ధరను రూ. 15గా ఖాయం చేశారు. నూతన మద్యం విధానం రూపకల్పనలో రూ. 15 మద్యానికే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన విధివిధానాలను రూపొందించే పనిలో అధికార యంత్రాంగం బిజీగా ఉంది. మద్యం పాలసీపై చర్చించేందుకు ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్ శనివారం ఉన్నతాధికారులు, బేవరేజెస్ కార్పొరేషన్ అధికారులతో సమావేశమయ్యారు. రూ. 15కు మద్యం అందించడం వల్ల ఎక్సైజ్ శాఖకు వచ్చే లాభనష్టాలపై చర్చించారు. పకడ్బందీగా ఎక్సైజ్ పాలసీ ప్రతిపాదనలు రూపొందించాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఆరు డిస్టిలరీలు సిద్ధం మద్యం దుకాణాల్లో ప్రస్తుతం చీప్ లిక్కర్ 90 ఎంఎల్, 180 ఎంఎల్ బాటిళ్లలో లభ్యమవుతోంది. 90 ఎంఎల్ ధర కనీసంగా రూ. 30 కాగా, 180 ఎంఎల్ రూ. 55గా ఉంది. రాష్ట్రంలో ఉన్న 16 డిస్టిలరీల్లో ఐఎంఎఫ్ఎల్తోపాటు చీప్ లిక్కర్ కూడా తయారవుతోంది. వివిధ రకాల పేర్లతో బేవరేజెస్ గోడౌన్ల ద్వారా మద్యం దుకాణాలకు చేరుతుంది. ఇప్పుడు సర్కార్ తెస్తున్న రూ.15కే కంట్రీ లిక్కర్ కారణంగా అధిక ధరలో లభించే చీప్ లిక్కర్ మీద దెబ్బపడనుంది. సర్కార్‌కు వచ్చే రాబడిలో చీప్ లిక్కర్ ఆదాయమే అధికం. ఈ నేపథ్యంలో చీప్ లిక్కర్‌కు బదులు కంట్రీ లిక్కర్ తయారు చేసి డిపోలకు అందించేందుకు ఆరు డిస్టిలరీలు ఇప్పటికే ముందుకొచ్చాయి. అధికారికంగా మద్యం పాలసీ ఖరారైతే మరిన్ని డిస్టిలరీలు కూడా ఇదే బాటపట్టే అవకాశం ఉంది. అలాగే మద్యం దుకాణాలపైనా ప్రభావం పడనుంది. గ్రేటర్ సహా పలు నగరాల్లో ఏడాదికి రూ. 90 లక్షల లెసైన్సు ఫీజుతో మద్యం దుకాణాన్ని నిర్వహించే వారికి రూ. 15కే చీప్ లిక్కర్ అమ్మడం వల్ల గిట్టుబాటు కాదన్న వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో వివిధ రకాల ప్రతిపాదనలను అధికార యంత్రాంగం సిద్ధం చేస్తోంది. వ్యాట్ మినహాయింపు ఆలోచన? గుడుంబాకు ప్రత్యామ్నాయంగా ‘ఆరోగ్యకరమైన’ మద్యాన్ని అతి తక్కువ ధరకు అందించేందుకు దీనికి వ్యాట్ నుం చి మినహాయింపు ఇచ్చే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం మద్యం మీద 60% నుంచి 160% వరకు ప్రభుత్వం వ్యాట్ విధిస్తోంది. చీప్ లిక్కర్‌పై 60% వ్యాట్ వసూలు చేస్తున్నారు. అయితే రూ. 15కే అందించే మద్యం పై వ్యాట్ వడ్డించాలంటే ఒక్కో 90 ఎంఎల్ బాటిల్ రూ. 6 లోపే డిస్టిలరీలో తయారు కావాల్సి ఉంటుంది. పెట్ బాటిల్, స్పిరిట్ (మద్యం) తయారీకి ఖర్చయ్యే రూ.6తో ఇది సాధ్యం కాదని డిస్టిలరీలు చెబుతున్నాయి. నష్టం జరగకుం డా ఉండాలంటే వ్యాట్ మినహాయింపు ఒక్కటే మార్గమని వాది స్తున్నాయి. అయితే వ్యాట్‌ను మినహాయిస్తే ప్రభుత్వానికి వచ్చే ఆదాయంపై భారీగా కోత పడుతుంది. ఈ నేపథ్యంలో గతేడాది లో చీప్ లిక్కర్ అమ్మకాలు, తద్వారా ప్రభుత్వానికి డిస్టిలరీలు చెల్లించిన వ్యాట్‌కు సంబంధించిన లెక్కలను అధికారులు పరిశీలిస్తున్నారు. -
రాష్ట్రంలో పారనున్న చీప్ లిక్కర్
వారంలోగా కర్ణాటక నుంచి రాష్ట్రానికి చవక మద్యం సాక్షి, హైదరాబాద్: నూతన మద్యం విధానం నేపథ్యంలో కొత్తగా రాష్ట్రంలో చీప్ లిక్కర్ పారనుంది. అయితే చీప్ లిక్కర్ కల్తీకి ఆస్కారం లేకుండా టెట్రా ప్యాకెట్లలో విక్రయించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు టెట్రా ప్యాకెట్లు తయారుచేసే యంత్ర పరికరం లేదు. రాష్ట్రంలోనే టెట్రా ప్యాకెట్లు తయారుచేయాలంటే కనీసం మూడు నెలలు పడుతుంది. ఈలోగా కర్ణాటకలో తయారుచేస్తున్న కంపెనీ.. టెట్రా ప్యాకెట్లలో చౌకమద్యం సరఫరాకు అంగీకరించిందని అధికారవర్గాలు తెలిపాయి. రాష్ట్రప్రభుత్వం కర్ణాటక నుంచి దిగుమతి చేసుకోవడానికి అనుమతిస్తే సరిపోతుందన్నాయి. ఈ నేపథ్యంలో వారం రోజుల్లోగా టెట్రా ప్యాకెట్లలో చౌకమద్యం రాష్ట్రంలో అందుబాటులోకి రానుంది. ఒక్కో టెట్రా ప్యాకెట్ రూ.45 నుంచి రూ.50 వరకు ధర ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. తెలంగాణ ప్రభుత్వమూ చౌకమద్యాన్ని అమల్లోకి తేనున్నందున ఆంధ్రప్రదేశ్‌లోనూ చౌకమద్యం తేవాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పాయి. టెట్రా ప్యాకెట్లలో చౌకమద్యాన్ని అమల్లోకి తెస్తే కల్తీ మద్యం, నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం విక్రయాలను నిరోధించవచ్చనేది అధికారుల భావనగా ఉంది. ఇదిలాఉండగా ఒక్కో మద్యం దుకాణం తీసుకునే సరుకులో 25 శాతం మేరకు టెట్రా ప్యాకెట్లు ఉండాలనే నిబంధనను ప్రభుత్వం విధించింది. టెట్రా ప్యాకెట్లలో కల్తీకి అవకాశం లేనందున.. వాటిని తీసుకునేందుకు మద్యం దుకాణదారులు విముఖత వ్యక్తం చేస్తారనే భావనతోనే తప్పనిసరిగా 25 శాతం మేరకు తీసుకోవాలనే నిబంధన విధించినట్లు అధికారులు తెలిపారు. కాగా రాష్ట్రప్రభుత్వమే స్వయంగా మద్యం దుకాణాలను ఏర్పాటుచేసి.. ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా విక్రయాలు జరపనున్నందున ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. బేవరెజెస్ కార్పొరేషన్‌ద్వారా 436 మద్యం దుకాణాలు ఏర్పాటు చేయనున్న విషయం తెలి సిందే. వీటిద్వారా వచ్చే ఆదాయంపై ఆదాయపు పన్ను భారం పడకుండా చర్యలకు ప్రభుత్వం నిర్ణయించింది. కాగా మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఆబ్కారీ కార్యాలయాలముందు దరఖాస్తుదారులు బారులు తీరారు. దరఖాస్తుల స్వీకరణ శనివారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. అయితే భారీసంఖ్యలో దరఖాస్తుదారులు క్యూలో ఉండటంతో రాత్రి పొద్దుపోయే వరకు దరఖాస్తులు స్వీకరించారు.