రాష్ట్రంలో పారనున్న చీప్ లిక్కర్
వారంలోగా కర్ణాటక నుంచి రాష్ట్రానికి చవక మద్యం
సాక్షి, హైదరాబాద్: నూతన మద్యం విధానం నేపథ్యంలో కొత్తగా రాష్ట్రంలో చీప్ లిక్కర్ పారనుంది. అయితే చీప్ లిక్కర్ కల్తీకి ఆస్కారం లేకుండా టెట్రా ప్యాకెట్లలో విక్రయించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు టెట్రా ప్యాకెట్లు తయారుచేసే యంత్ర పరికరం లేదు. రాష్ట్రంలోనే టెట్రా ప్యాకెట్లు తయారుచేయాలంటే కనీసం మూడు నెలలు పడుతుంది. ఈలోగా కర్ణాటకలో తయారుచేస్తున్న కంపెనీ.. టెట్రా ప్యాకెట్లలో చౌకమద్యం సరఫరాకు అంగీకరించిందని అధికారవర్గాలు తెలిపాయి.
రాష్ట్రప్రభుత్వం కర్ణాటక నుంచి దిగుమతి చేసుకోవడానికి అనుమతిస్తే సరిపోతుందన్నాయి. ఈ నేపథ్యంలో వారం రోజుల్లోగా టెట్రా ప్యాకెట్లలో చౌకమద్యం రాష్ట్రంలో అందుబాటులోకి రానుంది. ఒక్కో టెట్రా ప్యాకెట్ రూ.45 నుంచి రూ.50 వరకు ధర ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. తెలంగాణ ప్రభుత్వమూ చౌకమద్యాన్ని అమల్లోకి తేనున్నందున ఆంధ్రప్రదేశ్‌లోనూ చౌకమద్యం తేవాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పాయి. టెట్రా ప్యాకెట్లలో చౌకమద్యాన్ని అమల్లోకి తెస్తే కల్తీ మద్యం, నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం విక్రయాలను నిరోధించవచ్చనేది అధికారుల భావనగా ఉంది.
ఇదిలాఉండగా ఒక్కో మద్యం దుకాణం తీసుకునే సరుకులో 25 శాతం మేరకు టెట్రా ప్యాకెట్లు ఉండాలనే నిబంధనను ప్రభుత్వం విధించింది. టెట్రా ప్యాకెట్లలో కల్తీకి అవకాశం లేనందున.. వాటిని తీసుకునేందుకు మద్యం దుకాణదారులు విముఖత వ్యక్తం చేస్తారనే భావనతోనే తప్పనిసరిగా 25 శాతం మేరకు తీసుకోవాలనే నిబంధన విధించినట్లు అధికారులు తెలిపారు. కాగా రాష్ట్రప్రభుత్వమే స్వయంగా మద్యం దుకాణాలను ఏర్పాటుచేసి.. ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా విక్రయాలు జరపనున్నందున ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
బేవరెజెస్ కార్పొరేషన్‌ద్వారా 436 మద్యం దుకాణాలు ఏర్పాటు చేయనున్న విషయం తెలి సిందే. వీటిద్వారా వచ్చే ఆదాయంపై ఆదాయపు పన్ను భారం పడకుండా చర్యలకు ప్రభుత్వం నిర్ణయించింది. కాగా మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఆబ్కారీ కార్యాలయాలముందు దరఖాస్తుదారులు బారులు తీరారు. దరఖాస్తుల స్వీకరణ శనివారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. అయితే భారీసంఖ్యలో దరఖాస్తుదారులు క్యూలో ఉండటంతో రాత్రి పొద్దుపోయే వరకు దరఖాస్తులు స్వీకరించారు.