ఎల్లో సిండికేట్ ఎన్ని అడిగితే.. అన్ని ఇచ్చేలా నిర్ణయం
అందుకే స్టోర్స్ సంఖ్యను స్పష్టం చేయని ప్రభుత్వం
ప్రీమియం మద్యం స్టోర్స్‌కు అనుమతిస్తూ ఉత్తర్వులు
చంద్రబాబు సర్కారు కొత్త సంవత్సరం కానుక
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో మద్యం దందాకు పూర్తిస్థాయిలో తెగించింది. ఇప్పటికే టీడీపీ నేతల సిండికేట్‌కు 3,396 ప్రైవేట్ మద్యం దుకాణాలను కట్టబెట్టిన ప్రభుత్వం తాజాగా కొత్త సంవత్సరం కానుకగా రాష్ట్రంలో ప్రీమియం మద్యం స్టోర్స్‌కు షట్టర్స్ తెరవాలని నిర్ణయించింది. రాష్ట్రంలో నగర, పట్టణ ప్రాంతాల్లో ప్రీమియం మద్యం స్టోర్స్ విధానాన్ని మంగళవారం ప్రకటించింది.
ఆ మేరకు ఎక్సైజ్ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. టీడీపీ ప్రభుత్వం సెప్టెంబర్ లో ప్రకటించిన మద్యం విధానానికి తానే తూట్లు పొడుస్తూ మరింతగా ప్రీమియం మద్యం దందాకు తలుపులు బార్లా తెరవడం గమనార్హం. నగర, పట్టణ ప్రాంతాల్లో 12 ప్రీమియం మద్యం స్టోర్స్‌ను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తన మద్యం విధానంలో తెలిపింది.
కానీ.. మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో మాత్రం ప్రీమియం మద్యం స్టోర్స్ సంఖ్యను ప్రకటించక పోవడం గమనార్హం. పైగా ఎక్సైజ్ కమిషనర్ అన్ని అంశాలను పరిశీలించి ఎప్పుడు.. ఎన్ని ప్రీమియం మద్యం స్టోర్స్ అవసరమని భావిస్తే అన్ని స్టోర్స్ ఏర్పాటు చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే పరిమితి లేకుండా ప్రీమియం మద్యం స్టోర్స్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది.
టీడీపీ కూటమి పెద్దలు రాష్ట్రంలో ఎప్పడు.. ఏ ప్రాంతంలో ప్రీమియం మద్యం స్టోర్స్ ఏర్పాటు చేయాలని భావిస్తే.. తదనుగుణంగా ఎక్సైజ్ శాఖ అనుమతి జారీ చేసేందుకు సదా సిద్ధంగా ఉంటుందన్నది అసలు లోగుట్టు. ఐదేళ్ల కాల పరిమితితో ప్రీమియం మద్యం స్టోర్స్‌కు ప్రభుత్వం లైసెన్సులు కేటాయిస్తుంది. వేలం ప్రక్రియ ద్వారా లైసెన్సులు కేటాయిస్తామని ప్రభుత్వం పేర్కొంది. అందుకు ఒక్కో స్టోర్‌కు రూ.15 లక్షలు నాన్ రిఫండబుల్ దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
దరఖాస్తులు ఆన్‌లైన్, హైబ్రీడ్, ఆఫ్‌లైన్ విధానంలో స్వీకరిస్తారు. ప్రీమియం మద్యం స్టోర్ లైసెన్స్ దక్కించుకున్న వారు ఏడాదికి ఎక్సైజ్ శాఖకు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఆర్‌ఈటీ)గా రూ.కోటి చెల్లించాల్సి ఉంటుంది. ఆర్‌ఈటీ ఏటా 20 శాతం పెరుగుతుందని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఒకట్రెండు రోజుల్లో వీటికి విడిగా నోటిఫికేషన్ జారీ చేయనుంది. జనవరి ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో ప్రీమియం మద్యం స్టోర్స్ ప్రారంభం కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment