చౌక మద్యం ఉండాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: గుడుంబాను అరికట్టేందుకు చౌకమద్యం ఉండాలన్న నిర్ణయానికే ప్రభుత్వం కట్టుబడింది. రూ.15 కే 90 మిల్లీలీటర్ల మద్యం అందించేందుకు సిద్ధమైంది. ఆదాయం లేకున్నా, ప్రజల ప్రాణాలకు హాని కలగకుండా ఉండేందుకు పల్లెల్లో చౌకమద్యం ఉండాల్సిందేనని ఉన్నతస్థాయి వర్గాలు చెప్పాయి. అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చే నూతన మద్యం పాలసీపై సీఎం ఆమోదముద్ర వేశారు. 26 లోగా ఉత్తర్వులు ఇచ్చేలా, ఆ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
మరో 60 బార్లు
కొత్త మద్యం విధానంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. వైన్‌షాపులు, బార్లకు చెరో గంట సమయాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. వైన్‌షాపుల వేళల్ని ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు, బార్ అండ్ రెస్టారెంట్లు ఉదయం 10 నుంచి రాత్రి 12 వరకు తెరిచి ఉంచనున్నారు. రాష్ట్రంలో అదనంగా 60 బార్ల ఏర్పాటుకు అనుమతి ఇవ్వనున్నారు.
వైన్‌షాపుల పెంపునకు ‘నో’
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 2,216 మద్యం దుకాణాలను కొనసాగించాలని సర్కారు భావిస్తోంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో 1,500 పైచిలుకు ఉన్న మద్యం దుకాణాలకు మండలం యూనిట్‌గా లాటరీ పద్ధతిలో లెసైన్స్‌లు ఇస్తారు. దీంతో వైన్‌షాపులను పెంచాల్సిన అవసరం లేదని భావిస్తోంది. మండలం లెసైన్స్ పొందిన వ్యక్తి దాని పరిధి గ్రామాల్లో కూడా ఇకపై దుకాణాలు ఏర్పాటు చేసుకోవచ్చు.
ఆదాయంపైనా దృష్టి
ఆబ్కారీ శాఖ నుంచి ప్రస్తుతం లభిస్తున్న రూ.10 వేల కోట్లను ఈసారి మరో రెండు వేల కోట్లు అదనంగా రాబట్టాలని సర్కారు చూస్తోంది. మద్యం దుకాణాలకు దరఖాస్తు ఫీజు, మండలానికి ఒకటే ఏర్పాటు కానున్న వైన్‌షాపు లెసైన్స్‌కు భారీగా వడ్డించాలని నిర్ణయించింది. దరఖాస్తు ఫీజు 20 శాతం, లెసైన్స్ ఫీజు 15 శాతం పెంచాలని భావిస్తోంది. మండలంలో వైన్‌షాపుకు రూ.కోటి వరకు నిర్ణయించే అవకాశం ఉంది.