చౌక మద్యంపై నో వ్యాట్! | Cheap alcohol is no VAT! | Sakshi
Sakshi News home page

చౌక మద్యంపై నో వ్యాట్!

Published Sun, Aug 2 2015 3:14 AM | Last Updated on Sun, Sep 3 2017 6:35 AM

చౌక మద్యంపై నో వ్యాట్!

చౌక మద్యంపై నో వ్యాట్!

రాష్ట్ర సర్కారు ఆలోచన
సాక్షి, హైదరాబాద్: మార్కెట్‌లో మంచినీళ్ల బాటిల్ ధర రూ. 20 పలుకుతోంది. సీసా కల్లు ధర కూడా రూ. 20కి తక్కువకు దొరకట్లేదు. కానీ అక్టోబర్ నుంచి రాష్ట్రంలో రూ.15కే చౌకమద్యం అందించేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. గిరిజన తండాలు మొదలుకొని గ్రామాలు, నగరాల వరకు ఎక్కడైనా లభిస్తున్న గుడుంబాకు విరుగుడుగా రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకు మద్యాన్ని అందించాలని నిర్ణయించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

తొలుత గుడుంబా ప్యాకెట్లను విక్రయిస్తున్న రూ.10కే 90 ఎంఎల్ మద్యాన్ని (కంట్రీ లిక్కర్) అందించాలని సీఎం కేసీఆర్ సూచించినా ఆ ధరకు మద్యాన్ని అందించేందుకు డిస్టిలరీలు ముందుకు రావని అధికారులు చెప్పడంతో ధరను రూ. 15గా ఖాయం చేశారు. నూతన మద్యం విధానం రూపకల్పనలో రూ. 15 మద్యానికే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన విధివిధానాలను రూపొందించే పనిలో అధికార యంత్రాంగం బిజీగా ఉంది. మద్యం పాలసీపై చర్చించేందుకు ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్ శనివారం ఉన్నతాధికారులు, బేవరేజెస్ కార్పొరేషన్ అధికారులతో సమావేశమయ్యారు. రూ. 15కు మద్యం అందించడం వల్ల ఎక్సైజ్ శాఖకు వచ్చే లాభనష్టాలపై చర్చించారు. పకడ్బందీగా ఎక్సైజ్ పాలసీ ప్రతిపాదనలు రూపొందించాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు.
 
ఆరు డిస్టిలరీలు సిద్ధం
మద్యం దుకాణాల్లో ప్రస్తుతం చీప్ లిక్కర్ 90 ఎంఎల్, 180 ఎంఎల్ బాటిళ్లలో లభ్యమవుతోంది. 90 ఎంఎల్ ధర కనీసంగా రూ. 30 కాగా, 180 ఎంఎల్ రూ. 55గా ఉంది. రాష్ట్రంలో ఉన్న 16 డిస్టిలరీల్లో ఐఎంఎఫ్‌ఎల్‌తోపాటు చీప్ లిక్కర్ కూడా తయారవుతోంది. వివిధ రకాల పేర్లతో బేవరేజెస్ గోడౌన్‌ల ద్వారా మద్యం దుకాణాలకు చేరుతుంది. ఇప్పుడు సర్కార్ తెస్తున్న రూ.15కే కంట్రీ లిక్కర్ కారణంగా అధిక ధరలో లభించే చీప్ లిక్కర్ మీద దెబ్బపడనుంది. సర్కార్‌కు వచ్చే రాబడిలో చీప్ లిక్కర్ ఆదాయమే అధికం.

ఈ నేపథ్యంలో చీప్ లిక్కర్‌కు బదులు కంట్రీ లిక్కర్ తయారు చేసి డిపోలకు అందించేందుకు ఆరు డిస్టిలరీలు ఇప్పటికే ముందుకొచ్చాయి. అధికారికంగా మద్యం పాలసీ ఖరారైతే మరిన్ని డిస్టిలరీలు కూడా ఇదే బాటపట్టే అవకాశం ఉంది. అలాగే మద్యం దుకాణాలపైనా ప్రభావం పడనుంది. గ్రేటర్ సహా పలు నగరాల్లో ఏడాదికి రూ. 90 లక్షల లెసైన్సు ఫీజుతో మద్యం దుకాణాన్ని నిర్వహించే వారికి రూ. 15కే చీప్ లిక్కర్ అమ్మడం వల్ల గిట్టుబాటు కాదన్న వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో వివిధ రకాల ప్రతిపాదనలను అధికార యంత్రాంగం సిద్ధం చేస్తోంది.
 
వ్యాట్ మినహాయింపు ఆలోచన?
గుడుంబాకు ప్రత్యామ్నాయంగా ‘ఆరోగ్యకరమైన’ మద్యాన్ని అతి తక్కువ ధరకు అందించేందుకు దీనికి వ్యాట్ నుం చి మినహాయింపు ఇచ్చే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం మద్యం మీద 60% నుంచి 160% వరకు ప్రభుత్వం వ్యాట్ విధిస్తోంది. చీప్ లిక్కర్‌పై 60% వ్యాట్ వసూలు చేస్తున్నారు. అయితే రూ. 15కే అందించే మద్యం పై వ్యాట్ వడ్డించాలంటే ఒక్కో 90 ఎంఎల్ బాటిల్ రూ. 6 లోపే డిస్టిలరీలో తయారు కావాల్సి ఉంటుంది.

పెట్ బాటిల్, స్పిరిట్ (మద్యం) తయారీకి ఖర్చయ్యే రూ.6తో ఇది సాధ్యం కాదని డిస్టిలరీలు చెబుతున్నాయి. నష్టం జరగకుం డా ఉండాలంటే వ్యాట్ మినహాయింపు ఒక్కటే మార్గమని వాది స్తున్నాయి. అయితే వ్యాట్‌ను మినహాయిస్తే ప్రభుత్వానికి వచ్చే ఆదాయంపై భారీగా కోత పడుతుంది. ఈ నేపథ్యంలో గతేడాది లో చీప్ లిక్కర్ అమ్మకాలు, తద్వారా ప్రభుత్వానికి డిస్టిలరీలు చెల్లించిన వ్యాట్‌కు సంబంధించిన లెక్కలను అధికారులు పరిశీలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement