కీలక బ్యాట్స్ మన్ పై వేటు
సెయింట్ జాన్స్: కీలక బ్యాట్స్ మన్ డారెన్ బ్రావోకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు(డబ్ల్యూఐసీబీ) షాక్ ఇచ్చింది. ‘బిగ్ ఇడియట్’ కాంట్రాక్టు వివాదంతో అతడిపై వేటు వేసింది. జింబాబ్వేలో జరగనున్న ముక్కోణపు వన్డే సిరీస్ కు ఎంపిక చేసిన జట్టులో 27 ఏళ్ల బ్రావోకు చోటు కల్పించలేదు. డబ్ల్యూఐసీబీ ఇవ్వచూసిన సీ-కేటగిరి కాంట్రాక్టుపై అతడు బహిరంగంగా విమర్శలు గుప్పించాడు. స్టార్ ఆటగాళ్లకు తక్కువ స్థాయి కాంట్రాక్టులు కట్టబెడతారా అని ట్విట్టర్ లో ప్రశ్నించాడు. అంతేకాదు డబ్ల్యూఐసీబీ అధ్యక్షుడు డేవ్ కెమరాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాడు. డేవ్ బిగ్ ఇడియట్ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు.
ఫలితంగా బ్రావోపై వేటు పడింది. అతడి స్థానంలో ఆల్ రౌండర్ జాసన్ మహ్మద్ ను జట్టులోకి తీసుకున్నారు. అనుచిత ప్రవర్తన కారణంగా బ్రావోను ఎంపిక చేయలేదని డబ్ల్యూఐసీబీ వెల్లడించింది. 95 వన్డేలు ఆడిన బ్రావో 2,955 పరుగులు చేశాడు. వ్యక్తిగత కారణాలతో వైదొలగిన సునీల్ నరైన్ స్థానంలో బిషూను తీసుకున్నారు.