మళ్లీ తెగబడిన పాక్ దళాలు.. సరిహద్దు వద్ద కాల్పులు
ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సాక్షిగా భారత్ - పాకిస్థాన్ దేశాల ప్రధాన మంత్రులు సమావేశం కావడానికి ఒక్కరోజు ముందు కూడా పాకిస్థాన్ దళాలు తెగబడ్డాయి. నియంత్రణ రేఖ వెంబడి రెండు ప్రాంతాల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరిపాయి. జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలోని రాజౌరి జిల్లాలో బీమార్ గలీ సెక్టార్ వద్ద నియంత్రణ రేఖ వెంబడి పాక్ దళాలు ఎలాంటి కవ్వింపు లేకుండానే కాల్పులకు పాల్పడినట్లు డిఫెన్స్ ప్రతినిధి కెప్టెన్ ఎస్.ఎన్.ఆచార్య తెలిపారు.
శుక్రవారం సాయంత్రం 4.45 నుంచి రాత్రి 7.30 వరకు కాల్పులు కొనసాగినట్లు ఆయన చెప్పారు. చిన్న ఆయుధాలు, ఆటోమేటిక్ ఆయుధాలతో వారికి భారత బలగాలు సమాధానమిచ్చాయి. ఆ తర్వాత పూంఛ్ సెక్టార్లోకూడా పాక్ దళాలు కాల్పులు జరిపాయి. రాత్రి 10.30 గంటల సమయంలో చిన్న ఆయుధాలు, ఆటోమేటిక్ ఆయుధాలతో కాల్పులు జరిపాయి. అక్కడ ఇరువర్గాల మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈనెలలో పాక్ దళాలు ఒక్క జమ్ము ప్రాంతంలోనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది 30వ సారి!!