Bio-Asia Conference
-
ప్రజారోగ్యంపై పెట్టుబడులు అవసరం
అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చినా మనం వెనుకబడ్డాం దేశంలో 49 శాతం ఫిజీషియన్ల సంఖ్య పెరగాలి దీర్ఘకాలిక వ్యాధులతో దేశంలో 60 శాతం మరణాలు బయో ఏషియా సదస్సులో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రజారోగ్యంపై తక్షణం పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చినా ఆరోగ్య రంగంలో మనం వెనుకబడి ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్య రంగంపై బుధవారం జరిగిన బయో ఏషియా–2017 సదస్సులో ఆయన మాట్లాడా రు. దేశంలో సగటు ఆయుర్దాయం 1960లో 45 ఏళ్లుంటే.. 2010 నాటికి అది 67 ఏళ్లకు చేరుకుందని.. చైనా, బ్రెజిల్ వంటి దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువని వివరించారు. శ్రీలంక, బంగ్లాదేశ్ కంటే మనం ఆరోగ్య రంగంలో వెనుకబడి ఉన్నామని చెప్పారు. శిశు మరణాల రేటు 1995–2015 మధ్య 25కు తగ్గిందని.. అయితే మిలీనియం డెవలప్మెంట్ గోల్‌కు చేరుకోలేక పోయామన్నారు. దక్షిణ భారతదేశంలో పరిస్థితి మెరుగ్గా ఉన్నా.. ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటికీ వెనుకబడే ఉన్నామన్నారు. ఇమ్యునైజేషన్లోనూ మనదేశం వెనుకబడి ఉందన్నారు. టీబీ వ్యాధులు తగ్గినా.. అంతర్జాతీయంగా పోలిస్తే మాత్రం వెనుకబడే ఉన్నామన్నారు. దీర్ఘకాలిక వ్యాధుల (జీవనశైలి)తో దేశంలో 60 శాతం మరణాలు సంభవిస్తున్నాయని, ముఖ్యంగా పనిచేసే దశలో ఉండే 35–65 ఏళ్ల వయసు వారే ఈ వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వ్యాధుల నిర్థారణ, నియంత్రణకు ఎంతో ఉపయోగపడుతోందన్నారు. ముఖ్యంగా మొబైల్ యాప్స్ కూడా ఆరోగ్య సమాచారాన్ని అందిస్తున్నాయని, యాపిల్ వాచ్‌తో హార్ట్ బీట్, ఫిట్నెస్ తదితర వివరాలు తెలుసుకోవచ్చన్నారు. దేశంలో డాక్టర్ల సంఖ్య పెరగాల్సిన అవసరముందని నారాయణ మూర్తి స్పష్టం చేశారు. ఫిజీషియన్లు 49 శాతం, దంత వైద్యులు 109 శాతం, నర్సులు 177 శాతం, మిడ్ వైవ్స్ 185 శాతం, మహిళా వైద్య నిపుణులు 62 శాతం, పిల్లల వైద్యులు 68 శాతం పెరగాల్సిన అవసరముందన్నారు. వ్యాధులపై ముందస్తు హెచ్చరికలు ఇచ్చేందుకు మనకు సరైన ప్రజారోగ్య నిర్వహణ వ్యవస్థ, ఆరోగ్య సమాచార సేకరణ, విశ్లేషణ ఉండాలన్నారు. రెండంకెల స్థాయిలో ఫార్మా ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫార్మా ఎగుమ తుల వృద్ధి రెండంకెల స్థాయిలో ఉందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ సుధాంశు పాండే వెల్లడించారు. బయో ఏషియా సదస్సులో మాట్లాడుతూ.. ఇతర రంగాల కంటే సాపేక్షికంగా ఫార్మా రంగమే మెరుగ్గా ఉందని, గత నెల వృద్ధి 8 శాతంగా ఉందని తెలిపారు. ముగిసిన సదస్సు మూడ్రోజుల పాటు నగరంలోని హైటెక్స్‌లో జరిగిన బయో ఏషియా–2017 సదస్సు బుధవారం ముగిసింది. ఈ సదస్సులో 51 దేశాల నుంచి 1,480 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సదస్సు వేదికగా వ్యాపారం, భాగస్వామ్య అం శాలపై వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు కంపెనీల మధ్య 1,200 వరకు సమా వేశాలు జరిగాయి. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు ఈ సదస్సులో ప్రపంచ దిగ్గజ ఔషధ కంపెనీలు జాన్సన్ అండ్ జాన్సన్, జీఎస్కే, నోవార్టిస్, గ్లెన్‌మార్క్, వోకార్డ్, ఫిలిప్స్, డెలైట్ తదితర కంపెనీలతో చర్చలు జరిపారు. జీవ వైజ్ఞానిక శాస్త్రం, ఔషధ పరిశ్రమల రంగాల్లో రాష్ట్ర ఆధిపత్యాన్ని నిలుపుకుంటా మని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ప్రస్తుత బయోటెక్ క్లస్టర్, జినోమ్ వ్యాలీలతో పాటు త్వరతో ఏర్పాటుకానున్న మెడ్‌టెక్ క్లస్టర్, మెడికల్ డివైసెస్ అండ్ ఎలక్రానిక్స్ పార్క్, ఫార్మా క్లస్టర్, హైదరాబాద్ ఫార్మా సిటీల విశేషాలను మంత్రి కేటీఆర్ కంపెనీలకు తెలియజేశారు. హైదరాబాద్‌లో వ్యాపార విస్తరణకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఈ కంపెనీలు సుముఖత వ్యక్తం చేశాయని అధికార వర్గాలు తెలిపాయి. కాగా, నైపుణ్యభివృద్ధి అంశంపై నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మా స్యుటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్)తో నోవార్టిస్ పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. -
మూడేళ్లలో హెచ్ఐవీ వ్యాక్సిన్?
జాన్సన్ అండ్ జాన్సన్ శాస్త్రవేత్త పాల్ స్టౌఫెల్స్ వెల్లడి జీవశాస్త్ర రంగంలో భారత్‌కు ఉజ్వల భవిష్యత్తు సమన్వయంతో పనిచేయడం కీలకమని వ్యాఖ్య బయో ఆసియా సదస్సులో పాల్గొన్న శాస్త్రవేత్త సాక్షి నాలెడ్జ్ సెంటర్ హెచ్ఐవీ సోకితే రోజులు లెక్కబెట్టుకో వాల్సిందే అన్నది కొన్నేళ్ల కిందటి మాట.. క్రమం తప్పకుండా మందులు వాడితే జీవితాన్ని దశా బ్దాల పాటు పొడిగించుకోవచ్చన్నది నేటి పరి స్థితి. మరి భవిష్యత్తు మాటేమిటి? హెచ్ఐవీయే కాదు కేన్సర్ వంటి అనేక ప్రాణాంతక వ్యాధు లకూ మెరుగైన చికిత్సలు అందుబాటులోకి వస్తా యని డాక్టర్ పాల్ స్టౌఫెల్స్ చెబుతున్నారు. హెచ్ఐవీకి మూడేళ్లలో వ్యాక్సిన్ సిద్ధం కానుందని అంటున్నారు. బహుళజాతి కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ ప్రధాన శాస్త్రవేత్త అయిన ఆయన హైదరాబాద్‌లో జరుగుతున్న బయో ఆసియా సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ఆయనను పలకరించగా... ఫార్మా రంగం లో వినూత్న పోకడలు, పరిశోధన అంశాలను వెల్లడించారు. జీవశాస్త్ర రంగంలో అపార నైపుణ్య మున్న భారత్ త్వరలోనే ప్రపంచంలోనే అగ్రగామిగా మారగలదని పేర్కొన్నారు. హెచ్ఐవీ వ్యాక్సిన్ ఎప్పటిలోగా సాధ్యం? సుమారు 30 ఏళ్ల క్రితం ఆఫ్రికాలో హెచ్ఐవీ సోకిన వారు 3 నుంచి 6 నెలలకు మించి బతికేవారు కాదు. అప్పుడే ఈ వ్యాధికి వినూత్న రీతిలో పరిష్కారాన్ని కనుక్కోవాలని తీర్మానం చేసుకున్నాం. ఇప్పటివరకు దాదాపు ఆరువేల హెచ్ఐవీ వైరస్‌లను నిశితంగా పరిశీలించి దాని బలహీనతలను గుర్తించాం. యాంటీ రిట్రోవైరల్ మందుల ద్వారా ఆయుః ప్రమాణాలను గణ నీయంగా పెంచగలిగాం. ఈ విషయంలో భారత దేశంలోని జెనరిక్ మందుల రంగాన్ని కచ్చితంగా ప్రశంసించాలి. మేం టెక్నాలజీని అభివృద్ధి చేసి ఇస్తే జెనరిక్ ఫార్మా కంపెనీలు వాటికి మందుల రూపమిచ్చి.. అతి చౌక ధరలతో ప్రపంచానికి అందించగలిగాయి. ఫలితంగా కొన్ని లక్షల ప్రాణాలు నిలబెట్టగలిగాం. ఇదే స్ఫూర్తితో జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ ఇప్పుడు హెచ్ఐవీకి వ్యాక్సిన్‌ను కనుగొనే ప్రయత్నాలు మొదలెట్టింది. 2020కి వ్యాక్సిన్ తయారీపై స్పష్టత వస్తుంది. మందులుండగా వ్యాక్సిన్ ప్రత్యేకత ఏమిటి? ఒకసారి హెచ్ఐవీ బారిన పడితే జీవితాంతం మందులు వాడాలి. ఒక్కమాత్ర కూడా తప్ప కుండా దాదాపు 30 – 40 ఏళ్లు మందులు వాడట మన్నది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. మాత్రలకు బదులుగా వ్యాక్సిన్ అందుబాటు లోకి వస్తే వ్యాధి ఇతరులకు సోకకుండా నివా రించే అవకాశాలు ఎక్కువవుతాయి. కేన్సర్‌కు కొత్త చికిత్సలు అందుబాటులోకి వస్తున్నాయి. వాటిల్లో ఏది మెరుగైంది? శరీర రోగ నిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేయడం ద్వారా అది కేన్సర్ కణాలను నాశనం చేసే ఇమ్యునోథెరపీ మొదలుకొని ఎన్నో కొత్త విధానాలు సిద్ధమవుతున్నది వాస్తవమే. సాంక్ర మిక వ్యాధులపై విజయం సాధించిన విధంగానే కొన్ని మందులను కలపడం, వ్యక్తులకు తగి నట్టుగా చికిత్స పద్ధతులను అభివృద్ధి చేయడం ద్వారా కేన్సర్‌ను జయించడం కష్టమేమీ కాదు. మొండి క్షయకు సరికొత్త మందు తయారీపై..! ప్రస్తుతం క్షయ చికిత్సకు ఉపయోగిస్తున్న మందులకు నిరోధకత ఏర్పడింది. దాంతో ‘బెడాక్విలిన్’కు ప్రాధాన్యమేర్పడింది. దాదాపు 4 దశాబ్దాల తరువాత మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ క్షయ వ్యాధికి ఈ కొత్త మందు అందుబాటులోకి వచ్చింది. దీన్ని సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నాం. జీవశాస్త్రంలో భారత్ అవకాశాలేంటి? భారత్ జీవశాస్త్ర రంగంలో అంతర్జాతీయ ఖ్యాతి గడిస్తుందన్నది నా బలమైన నమ్మకం. -
‘ఫార్మా’లో ప్రపంచంతో పోటీ
బయో ఏసియా సదస్సులో మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: ఫార్మాసిటీ ఏర్పాటుతో దేశ ఫార్మా రాజధానిగా హైదరాబాద్ స్థానం సుస్థిరమవుతుందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. వ్యాక్సిన్ తయారీలో ఇప్పటికే అగ్రగామిగా ఉన్న హైదరాబాద్.. జినోమ్ వ్యాలీ రూపంలో ఆసియాలోనే అతిపెద్ద, వ్యవస్థీకృత పరిశోధనాభివృద్ధి సమూహంగా అవతరిస్తోందన్నారు. హైదరాబాద్‌లో సోమవారం ప్రారంభమైన 14వ బయో ఏసియా సదస్సులో కేటీఆర్ మాట్లాడుతూ.. తాజాగా రూ.3,000 కోట్ల పెట్టుబడుల రాకతో జినోమ్ వ్యాలీలో రెండో తరం విప్లవం మొదలైనట్లేనని చెప్పారు. ఫార్మాసిటీతోపాటు వైద్య పరికరాల తయారీ పార్క్‌ల ఏర్పాటుతో జినోమ్ వ్యాలీ వైద్య రంగానికి సంబంధించిన అన్ని అంశాల్లోనూ తనదైన పాత్ర పోషించే అవకాశం ఏర్పడుతుందన్నారు. స్వయంగా బయోటెక్నాలజిస్ట్నైన తాను లైఫ్‌సైన్సెస్ రంగంలో కీలకంగా ఎదుగుతున్న జినోమ్ వ్యాలీ క్లస్టర్‌ను అంతర్జాతీయ స్థాయికి చేర్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తానని చెప్పారు. అత్యున్నత ప్రమాణాలు, అతి తక్కువ ధరలతో మందులు లభించేందుకు జినోమ్ వ్యాలీలో జరిగే పరిశోధనలు ఉపయోగపడతాయని మంత్రి అన్నారు. వ్యాలీలోని కంపెనీలన్నింటికీ నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. నగర శివార్లలో దాదాపు 14 వేల ఎకరాల విస్తీర్ణంలో రానున్న ఫార్మా సిటీ అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధమవుతుం దని.. ఇందులో బల్క్‌డ్రగ్స్, ఫార్ములేషన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని వివరిం చారు. జినోమ్ వ్యాలీలో మరింత మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ‘ఇండస్ట్రి యల్ ఏరియా లోకల్ అథారిటీ’సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. ఎన్నో సవాళ్లు: నరసింహన్ మధుమేహం, రక్తపోటు, కంటి జబ్బులను నివారించేందుకు, ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టాలని, కార్పొరేట్ ఆస్పత్రులు ఇందులో చురుకైన పాత్ర పోషించాలని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈ.ఎస్.ఎల్. నరసింహన్ కోరారు. ఆరోగ్య రంగం ప్రస్తుతం ఎన్నో సవాళ్లు ఎదుర్కుంటోందని.. పరిశోధనల ద్వారా చౌకైన, మెరుగైన పరిష్కారాలను శాస్త్రవేత్తలు కనుక్కోవాలని సూచించారు. మాతా శిశు సంక్షేమం మొదలుకొని మధ్య వయస్సు వారిలో ఒత్తిడి వరకూ అనేక సమస్యలు ఉన్నాయని బయో ఆసియా సదస్సు ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ గవర్నర్ గుర్తు చేశారు. ఇప్పటివరకూ జరిగిన పరిశోధనలతో మనిషి ఆయుః ప్రమాణాలు పెరిగినా వయోవృద్ధులు సౌకర్యంగా జీవించేందుకు ఇవి చాలవన్నారు. వైద్య సదుపాయాలు ఎక్కువగా పట్టణ, నగర ప్రాంతాలకే పరిమితం కావడంపై ఆందోళన వ్యక్తం చేసిన గవర్నర్.. వాటిని గ్రామీణ ప్రాంతాలకు చేర్చడంపై దృష్టిపెట్టాలన్నారు. మందుల ప్యాకెట్లపై ఉండే లేబుల్స్‌ను వయో వృద్ధులు కూడా సులువుగా చదివేలా పెద్ద అక్షరాలతో ముద్రించాలని సూచించారు. కార్యక్రమంలో నోబెల్ అవార్డు గ్రహీత, స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్త కర్ట్ వుట్రిచ్, (2002, రసాయన శాస్త్రం), జాన్సన్ అండ్ జాన్సన్ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ పాల్ స్టౌఫెల్స్‌లను జినోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డులతో గవర్నర్ నరసింహన్ సత్కరించారు. ఫార్మా రంగంలో విశేష కృషి చేసిన వారికి బయో ఆసియా ఎక్సలెన్సీ అవార్డులతో సత్కరిస్తున్న విషయం తెలిసిందే. కార్యక్రమంలో మలేసియా ప్రతినిధి చెంగ్ ఛాన్ ఖిమ్, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ సౌమ్యా స్వామినాథన్, ప్రొఫెసర్ విజయరాఘవన్, బాలసుబ్రమణ్యన్, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శులు జయేశ్ రంజన్, తివారీ తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి బయో ఏషియా సదస్సు
ప్రారంభించనున్న గవర్నర్ నరసింహన్ సాక్షి, హైదరాబాద్: బయో ఏషియా సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. హెచ్ఐసీసీలో 6 నుంచి 8 వరకు జరిగే ఈ సదస్సుకు 50 దేశాలకు చెందిన 1,500 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. ఆరోగ్యం, ఫార్మా తదితర రంగాల్లో జరుగుతున్న అభివృద్ధిపై ఈ సదస్సులో చర్చిస్తారు. సదస్సును గవర్నర్ నరసింహన్ ప్రారంభిస్తారని నిర్వాహకులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జీనోమ్‌వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డును నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ కుర్త్ ఉత్రిచంద్, ఫార్మా సూటికల్స్ అంతర్జాతీయ చైర్మన్ డాక్టర్ పాల్ స్టోఫెల్స్‌లకు గవర్నర్ అందజేస్తారు. -
ఫిబ్రవరిలో బయో ఆసియా సదస్సు
హైదరాబాద్: వచ్చే ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు హైదరాబాద్‌లో 12వ బయో ఆసియా సదస్సును నిర్వహించనున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ బయోటెక్ అసోసియేషన్ ప్రకటించింది. లైఫ్ సైన్స్ విభాగంలో పరిశోధనలు, అభివృద్ధి ప్రధాన అంశాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు దీనిలో పాలు పంచుకోనున్నాయి. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఈ కార్యక్రమం నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐఐసీటీ మాజీ డెరైక్టర్, శాస్త్రవేత్త కె.వి.రాఘవన్ చైర్మన్‌గా, రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ప్రదీప్‌చంద్ర, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల సంస్థ ఎండీ జయేశ్ రంజన్, పరిశ్రమల విభాగం కమిషనర్‌ను ఎక్స్అఫీషియో సభ్యులుగా కమిటీని నియమించింది.