ప్రజారోగ్యంపై పెట్టుబడులు అవసరం
- అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చినా మనం వెనుకబడ్డాం
- దేశంలో 49 శాతం ఫిజీషియన్ల సంఖ్య పెరగాలి
- దీర్ఘకాలిక వ్యాధులతో దేశంలో 60 శాతం మరణాలు
- బయో ఏషియా సదస్సులో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రజారోగ్యంపై తక్షణం పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చినా ఆరోగ్య రంగంలో మనం వెనుకబడి ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్య రంగంపై బుధవారం జరిగిన బయో ఏషియా–2017 సదస్సులో ఆయన మాట్లాడా రు. దేశంలో సగటు ఆయుర్దాయం 1960లో 45 ఏళ్లుంటే.. 2010 నాటికి అది 67 ఏళ్లకు చేరుకుందని.. చైనా, బ్రెజిల్ వంటి దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువని వివరించారు. శ్రీలంక, బంగ్లాదేశ్ కంటే మనం ఆరోగ్య రంగంలో వెనుకబడి ఉన్నామని చెప్పారు. శిశు మరణాల రేటు 1995–2015 మధ్య 25కు తగ్గిందని.. అయితే మిలీనియం డెవలప్‌మెంట్ గోల్‌కు చేరుకోలేక పోయామన్నారు.
దక్షిణ భారతదేశంలో పరిస్థితి మెరుగ్గా ఉన్నా.. ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటికీ వెనుకబడే ఉన్నామన్నారు. ఇమ్యునైజేషన్‌లోనూ మనదేశం వెనుకబడి ఉందన్నారు. టీబీ వ్యాధులు తగ్గినా.. అంతర్జాతీయంగా పోలిస్తే మాత్రం వెనుకబడే ఉన్నామన్నారు. దీర్ఘకాలిక వ్యాధుల (జీవనశైలి)తో దేశంలో 60 శాతం మరణాలు సంభవిస్తున్నాయని, ముఖ్యంగా పనిచేసే దశలో ఉండే 35–65 ఏళ్ల వయసు వారే ఈ వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వ్యాధుల నిర్థారణ, నియంత్రణకు ఎంతో ఉపయోగపడుతోందన్నారు.
ముఖ్యంగా మొబైల్ యాప్స్ కూడా ఆరోగ్య సమాచారాన్ని అందిస్తున్నాయని, యాపిల్ వాచ్‌తో హార్ట్ బీట్, ఫిట్‌నెస్ తదితర వివరాలు తెలుసుకోవచ్చన్నారు. దేశంలో డాక్టర్ల సంఖ్య పెరగాల్సిన అవసరముందని నారాయణ మూర్తి స్పష్టం చేశారు. ఫిజీషియన్లు 49 శాతం, దంత వైద్యులు 109 శాతం, నర్సులు 177 శాతం, మిడ్ వైవ్స్ 185 శాతం, మహిళా వైద్య నిపుణులు 62 శాతం, పిల్లల వైద్యులు 68 శాతం పెరగాల్సిన అవసరముందన్నారు. వ్యాధులపై ముందస్తు హెచ్చరికలు ఇచ్చేందుకు మనకు సరైన ప్రజారోగ్య నిర్వహణ వ్యవస్థ, ఆరోగ్య సమాచార సేకరణ, విశ్లేషణ ఉండాలన్నారు.
రెండంకెల స్థాయిలో ఫార్మా ఎగుమతులు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫార్మా ఎగుమ తుల వృద్ధి రెండంకెల స్థాయిలో ఉందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ సుధాంశు పాండే వెల్లడించారు. బయో ఏషియా సదస్సులో మాట్లాడుతూ.. ఇతర రంగాల కంటే సాపేక్షికంగా ఫార్మా రంగమే మెరుగ్గా ఉందని, గత నెల వృద్ధి 8 శాతంగా ఉందని తెలిపారు.
ముగిసిన సదస్సు
మూడ్రోజుల పాటు నగరంలోని హైటెక్స్‌లో జరిగిన బయో ఏషియా–2017 సదస్సు బుధవారం ముగిసింది. ఈ సదస్సులో 51 దేశాల నుంచి 1,480 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సదస్సు వేదికగా వ్యాపారం, భాగస్వామ్య అం శాలపై వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు కంపెనీల మధ్య 1,200 వరకు సమా వేశాలు జరిగాయి. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు ఈ సదస్సులో ప్రపంచ దిగ్గజ ఔషధ కంపెనీలు జాన్సన్ అండ్ జాన్సన్, జీఎస్‌కే, నోవార్టిస్, గ్లెన్‌మార్క్, వోకార్డ్, ఫిలిప్స్, డెలైట్ తదితర కంపెనీలతో చర్చలు జరిపారు.
జీవ వైజ్ఞానిక శాస్త్రం, ఔషధ పరిశ్రమల రంగాల్లో రాష్ట్ర ఆధిపత్యాన్ని నిలుపుకుంటా మని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ప్రస్తుత బయోటెక్ క్లస్టర్, జినోమ్ వ్యాలీలతో పాటు త్వరతో ఏర్పాటుకానున్న మెడ్‌టెక్ క్లస్టర్, మెడికల్ డివైసెస్ అండ్ ఎలక్రానిక్స్ పార్క్, ఫార్మా క్లస్టర్, హైదరాబాద్ ఫార్మా సిటీల విశేషాలను మంత్రి కేటీఆర్ కంపెనీలకు తెలియజేశారు. హైదరాబాద్‌లో వ్యాపార విస్తరణకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఈ కంపెనీలు సుముఖత వ్యక్తం చేశాయని అధికార వర్గాలు తెలిపాయి. కాగా, నైపుణ్యభివృద్ధి అంశంపై నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మా స్యుటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్)తో నోవార్టిస్ పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.