Bio gas plant
-
‘వేస్ట్ టు వెల్త్’లో హైదరాబాద్ మరో ముందడుగు
సాక్షి, హైదరాబాద్: ‘వ్యర్థం నుంచి అర్థం’ అంటే ఇదే మరి. ఇప్పటికే చెత్త నుంచి విద్యుదుత్పత్తి చేస్తున్న గ్రేటర్ నగరం మరో ముందడుగు వేసింది. జవహర్‌నగర్ డంపింగ్ యార్డులోని చెత్తనుంచి వాహన ఇంధనంగా ఉపకరించే కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ఉత్పత్తి ప్రారంభమైంది. దీంతో జవహర్‌నగర్ డంపింగ్ యార్డులో చెత్తగుట్ట సమస్య తగ్గడంతో పాటు పర్యావరణపరంగా, ఆర్థికంగా ప్రయోజనం చేకూరనుంది. విష వాయువుల నుంచి వెలువడే వాయు కాలుష్యం తగ్గుతుంది. గ్యాస్ ఉత్పత్తితో ఆ మేరకు డీజిల్ వినియోగం తగ్గుతుంది. జవహర్‌నగర్ డంపింగ్ యార్డులో దాదాపు 130 ఎకరాల మేర ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్త గుట్ట నుంచి వెలువడే దుర్గంధం, పరిసర ప్రాంతాల ప్రజల ఇబ్బందులు తగ్గించేందుకు దాన్ని క్యాపింగ్ చేసి సైంటిఫిక్ ల్యాండ్‌ఫిల్‌గా మార్చారు. ఏం చేశారంటే.. క్యాపింగ్ సమయంలోనే ల్యాండ్‌ఫిల్‌లో దాదాపు 155 గ్యాస్ వెల్స్ వేశారు. వాటి నుంచి పైప్‌లైన్ ద్వారా చెత్తలోని వాయువులు పెద్ద బెలూన్‌లోకి చేరతాయి. వీటిల్లో మిథేన్, కార్బన్డయాక్సైడ్ తదితరమైనవి ఉంటాయి. మిథేన్ దాదాపు 45 శాతంగా ఉంటుంది. అక్కడి నుంచి వివిధ దశల్లో శుద్ధి చేసి మిథేన్ దాదాపు 93 శాతం వరకు వచ్చేలా చేస్తారు. దీన్ని సీఎన్జీ మాదిరిగా వాహనాలకు వినియోగించవచ్చు. శుద్ధి చేశాక మరో బెలూన్‌లోకి పంపుతారు. అక్కడి నుంచి గ్యాస్‌ను బూస్టర్ కంప్రెషర్ ద్వారా పైప్లైన్ల నుంచి సిలిండర్లలో నింపుతారు. (చదవండి: బాబోయ్.. మేం భరించలేం..ఊపిరాడట్లే!) వాటిని సంబంధిత ఫిల్లింగ్ కేంద్రాలకు పంపించి వాహనాలకు ఇంధనంగా వినియోగిస్తారు. జవహర్‌నగర్ డంపింగ్‌యార్డు నిర్వహిస్తున్న రాంకీ సంస్థ రోజుకు 5 టన్నుల గ్యాస్ ఉత్పత్తి చేయగల ప్లాంట్ ఏర్పాటు చేసింది.గ్యాస్ ఉత్పత్తి జరుగుతోంది. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ కంపెనీతో రోజుకు 2 టన్నుల విక్రయానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు రాంకీ ప్రతినిధి తెలిపారు. అది రిటైల్ ఔట్‌లెట్‌ను సైతం ఏర్పాటు చేసిందన్నారు. సైంటిఫిక్ ల్యాండ్‌ఫిల్ నుంచి దాదాపు 8 సంవత్సరాల వరకు గ్యాస్ ఉత్పత్తి చేయవచ్చని చెప్పారు. ఆ తర్వాత కొన్నేళ్ల వరకు తక్కువ పరిమాణంతో గ్యాస్ ఉత్పత్తి చేయవచ్చు. దీంతోపాటు చెత్తగుట్టలోని కాలుష్య ద్రవాలు (లీచెట్) తొలగించే పనులు కూడా చేపట్టినందున చెత్తగుట్ట స్థిరీకరణ జరుగుతుంది. చెత్తనుంచి గ్యాస్ ఉత్పత్తికి దాదాపు రూ. 11 కోట్లు ఖర్చు చేశారు. ఒప్పందం మేరకు కేజీ గ్యాస్‌ను రవాణాతో కలిపి రూ.46 లకు విక్రయిస్తున్నట్లు సమాచారం. వాహనాలకు వినియోగం.. చెత్తగుట్ట నుంచి ఉత్పత్తవుతున్న ఈ గ్యాస్‌ను చెత్త తరలింపు వాహనాలకు వినియోగించే ఆలోచనలో ఉన్నారు. నగరంలోని వివిధ చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్ల నుంచి చెత్తను ట్రక్కుల ద్వారా డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నారు. సదరు ట్రక్కుల డీజిల్ ఇంజిన్లను తొలగించి వాటిస్థానంలో సీఎన్జీ ఇంజిన్లను అమర్చి గ్యాస్‌ను వినియోగించాలని ఆలోచన. వేస్ట్ ల్యాండ్‌ఫిల్ నుంచి బ యోగ్యాస్ ఉత్పత్తి దేశంలో ఇంతవరకు ఎక్కడా లేదని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. -
వంటింటి వ్యర్ధాలతో బయోగ్యాస్
గచ్చిబౌలి: కిచెన్ నుంచి నిత్యం వచ్చే వేస్ట్‌ను వృథాగా పడేయకండి. ఆ వ్యర్థాలతో ఎంచక్కా గ్యాస్ ఉత్పత్తి చేసుకోండి. పోర్టబుల్ బయోగ్యాస్ మిషన్‌తో ఇట్టే వండుకోండి. మిషన్ నుంచి వెలువడే ద్రవ పదార్థాన్ని మొక్కల ఎరువుగా వాడుకోండి. కిచెన్ వ్యర్థాలు బయట పడేసేందుకు ఇక స్వస్తి పలకండి. జీహెచ్ఎంసీ వెస్ట్ జోనల్ అధికారులు బయోగ్యాస్ మిషన్‌లో కిచెన్ వ్యర్థాలు వేసి గ్యాస్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చని చెబుతున్నారు. ఎవరికి వారు కిచెన్‌లో ఫోర్టబుల్ బయోగ్యాస్ మిషన్‌ను అమర్చుకోవచ్చు. ఇప్పటికే చందానగర్ సర్కిల్లో పోర్టబుల్ బయోగ్యాస్‌పై డెమో నిర్వహించారు. ప్రయోజనాలెన్నో.. బహుళ ప్రయోజనాలు కల్గిన పోర్టబుల్ బయో గ్యాస్‌ను జీహెచ్ఎంసీలో అమలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కొద్ది రోజుల క్రితం సన్‌గ్రీన్ ఆర్గానిక్ వ్యవస్థాపకురాలు అరుణ శేఖర్ చందానగర్ సర్కిల్–20లో పోర్టబుల్ బయో గ్యాస్‌పై అవగాహన కల్పించారు. దీనిపై వేస్ట్ 500 గ్రాముల తడి చెత్త నుంచి 100 కిలోల తడి చెత్త వెలువడే మిషన్లను అమర్చుకోచ్చు. ఇలా పని చేస్తుంది.. పోర్టబుల్ బయోగ్యాస్ మిషన్‌ను కిచెన్ బాల్కనీలో పెట్టి పైపును కిచెన్‌లో ఉంచుతారు. మిషన్‌తో పాటు స్టౌ కూడా ఉంటుంది. మిషన్ వెంట వచ్చిన బయో కల్చర్‌తో పాటు ఆవు పేడను గుజ్జుగా కలిపి డబ్బాలో వేస్తారు. ఆ తర్వాత మిగిలిపోయిన అన్నం, పండ్లు, కూరగాయల తొక్కలు, సాంబారు, బియ్యం కడిగిన నీళ్లు, మిగిలిపోయిన బోన్ లెస్ మాంసం ముక్కలను అందులో వేయాలి. 24 గంటల అనంతరం గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. మిషన్‌కు మూత ఉండటంతో ఎలాంటి దుర్వాసన రాదు. నిత్యం వాడితే కొద్దిమొత్తంలో వేస్టేజ్ బయటకు వస్తుంది. దానిని పూలు, కూరగాయలు, చెట్లకు ఎరువుగా వాడవచ్చు. 2 కిలోల తడి చెత్త సామర్థ్యం కలిగిన ఫోర్టబుల్ బయో గ్యాస్ మిషన్ విలువ రూ.40,000 ఉంటుంది. రెండు కిలోల చెత్తతో రోజు అర గంట నుంచి గంట సేపు గ్యాస్‌ను ఉపయోగించుకోవచ్చు. కాఫీ, టీతో పాటు ఇతర వంటలు చేసుకునే వీలుంది. -
అయ్యో.. బయో!
విజయవాడ నగరంలో చెత్తను శుద్ధి చేసే బయోమైనింగ్ యూనిట్ నిర్మాణం బాలారిష్టాలను దాటడం లేదు. ఈ ఏడాది జనవరిలో మంత్రి నారా లోకేష్‌తో ఆర్భాటంగా అజిత్‌సింగ్‌నగర్‌లోని శ్రీరాం ఎనర్జీప్లాంట్లో పనులకు శంకుస్థాపన చేశారు. పేరుకుపోయిన చెత్తను శుద్ధి చేయడం, విభజించేందుకు ఏర్పాటుచేసిన బయోమైనింగ్ నేటి వరకు అడుగు ముందుకు పడలేదు. వీఎంసీ ముందుగానే నగదు చెల్లించినా నిర్మాణంలో జాప్యం చోటుచేసుకోవడం విమర్శలకు దారితీస్తోంది. సాక్షి, అమరావతిబ్యూరో: విజయవాడ అజిత్ సింగ్‌నగర్‌లో చెత్త నుంచి ఎరువు, విద్యుత్ తయారు చేయటానికి ప్రారంభించిన శ్రీరాం ఎనర్జీ ఎక్సెల్‌ప్లాంట్ కొంతకాలంగా పనిచేయటంలేదు. దీంతో రోజూ ఉత్పత్తయ్యే చెత్తంతా అక్కడే డంప్ అవుతుంది. నగరంలో సగటున రోజుకు 250 మెట్రిక్ టన్నుల చెత్త చేరుతుండగా అక్కడ ప్రస్తుతం సుమారు 15 అడుగుల ఎత్తు వరకు చెత్త పేరుకుపోయింది. రోజురోజుకు చెత్త పెరగటంవల్ల అక్కడ మీథేన్‌గ్యాస్ ఉత్పత్తవ్వటంతో ఆ ప్రాంత వాసులు అల్లాడిపోతున్నారు. 32 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన డంపింగ్ యార్డులో తరచూ చెత్తకు నిప్పుపెట్టడం, పొగరావటంతో స్థానికుల ఆందోళన నేపథ్యంలో వీఎంసీ పాలకవర్గం అక్కడి నుంచి డంపింగ్ యార్డును తరలించేందుకు చర్యలు చేపట్టింది. రూ. 25 కోట్ల అంచనాలతో ఎక్సెల్‌ప్లాంట్ నుంచి విడుదలయ్యే దుర్వాసన వల్ల స్థానికులు అనారోగ్యబారిన పడిన దాఖలాలు కూడా ఉన్నాయి. దీన్ని నిరోధించటానికి కార్పొరేషన్ బయో మైనింగ్ ద్వారా సమస్యను పరిష్కరించటంతోపాటు కార్పొరేషన్‌కు విలువైన స్థలం కూడా తిరిగి సమకూరుతుందని అంచనాలతో ప్రణాళికలు రూపొందించారు. టన్నుకు రూ. 842 చొప్పున అక్కడ పేరుకుపోయిన 2.50 మెట్రిక్ టన్నుల చెత్తను బయో మైనింగ్ చేయటానికి తమిళనాడు రాష్ట్రం ఈరోడ్‌కు చెందిన జిగ్మా గ్లోబల్ ఎన్విరాన్మెంట్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కాంట్రాక్ట్‌ను అప్పగించారు. దీనికి సంబంధించి ఇప్పటికే జిగ్మా సంస్థకు రూ. 1.33 కోట్లు ఈ ఏడాది జనవరిలో ప్రాజెక్టు అగ్రిమెంట్ ద్వారా సొమ్ములు చెల్లించారు. సంబంధిత కాంట్రాక్ట్ సంస్థ వీఎంసీ నుంచి ముందస్తు సొమ్ములు తీసుకున్నప్పటికీ ఇంతవరకు పనులు ప్రారంభించకపోవటం, రెండేళ్లలో పనులు పూర్తిచేయాల్సి ఉన్నా , కాంట్రాక్ట్ దక్కించుకుని ఆరు నెలలు గడుస్తున్నా ఇంత వరకు పనులు ప్రారంభించకపోవడం గమనార్హం. బయో మైనింగ్‌లో భాగంగా తడి, పొడిచెత్త, ప్లాస్టిక్ కాగితాలు, బాటిళ్లు వేరుచేయటం, ఇతర వస్తువులు ముక్కలుగా చేయటం, గాజు, మట్టిన విడివిడిగా శాస్త్రీయంగా వేరుచేసి భూమిలో కలిసేలా మార్చాలి. నిధులు కోసం ఎదురుచూపులు బయో మైనింగ్ నిర్వహించటానికి అయ్యే ఖర్చు రూ. 26 కోట్లలో 12వ ఆర్థిక సంఘం నుంచి రూ. 9 కోట్లు, కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ నుంచి రూ. 5 కోట్లు వెచ్చిస్తుండగా మిగిలిన రూ.12 కోట్లను స్వచ్చాంధ్ర కార్పొరేషన్ నుంచి ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని మార్చిలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో తీర్మానించి ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ఇంత వరకు ప్రభుత్వం నుంచి దీనిపై స్పష్టత లేకపోవటంతో వీఎంసీ అధికారులు, పాలకులు సచివాలయం, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొరియా బృందంట్రయల్ వేయాల్సిందే... త్వరలోనే బయో మైనింగ్ పనులు ప్రారంభిస్తాం. ఇప్పటికే యంత్రాలు బిగించే ఏర్పాటు చేస్తున్నాం. యంత్రాలు బిగించాక కొరియా బృందం వచ్చి ట్రయల్ వేసిన తర్వాత మైనింగ్ ప్రారంభిస్తాం. రోజుకు సగటున 300 టన్నుల చెత్తను మైనింగ్ చేయటానికి అవకాశం ఉంది. మాకు ఇచ్చిన గడువులోగా చెత్తనంతా మైనింగ్ చేస్తాం. అవసరమైతే అదనపు యంత్రాలను సమకూర్చుకుంటాం. తమిళనాడులో 60 ప్రాంతాల్లో, చెన్నై మున్సిపల్ కార్పొరేషన్లో నాలుగు ప్రాంతాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నాం.– శ్రీనివాస్, జిగ్మా సంస్థ ప్రతినిధి -
'టెక్నాలజీలకు ప్రాధాన్యం'
పర్యావరణ అనుకూల టెక్నాలజీలకు ప్రాధాన్యం: జోగు రామన్న సాక్షి, హైదరాబాద్: పర్యావరణ అనుకూల టెక్నాలజీలను అన్ని రంగాల్లో చేపట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీలో ఏర్పాటు చేసిన బయోగ్యాస్ ప్లాంట్‌ను మంత్రి గురువారం ప్రారంభించారు. ఈ బయోప్లాంటును స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్వీకరించింది. వంటింటి వ్యర్థాలు, రాలిన ఆకులు, సేంద్రీయ పదార్థాలను ఇంధనంగా మార్చడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు డబ్బును కూడా ఆదా చేస్తుందన్నారు. సీసీఎంబీ లాంటి పరిశోధన సంస్థలు ఇలాంటి టెక్నాలజీలను వాడేందుకు ముందుకు రావడం హర్షణీయమన్నారు. సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా, టీఎస్ కాస్ట్ మెంబర్ సెక్రటరీ వై.నగేశ్ కుమార్, సీసీఎంబీ మాజీ డైరెక్టర్ సీహెచ్ మోహన్‌రావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.