అయ్యో.. బయో! | Bio Project Delayed In Krishna | Sakshi
Sakshi News home page

అయ్యో.. బయో!

Published Fri, Jun 1 2018 1:27 PM | Last Updated on Fri, Jun 1 2018 1:27 PM

Bio Project Delayed In Krishna - Sakshi

అజిత్‌సింగ్‌నగర్‌ డంపింగ్‌ యార్డులో చెత్త నిల్వ

విజయవాడ నగరంలో చెత్తను శుద్ధి చేసే బయోమైనింగ్‌ యూనిట్‌  నిర్మాణం బాలారిష్టాలను దాటడం లేదు. ఈ ఏడాది జనవరిలో మంత్రి నారా లోకేష్‌తో ఆర్భాటంగా అజిత్‌సింగ్‌నగర్‌లోని శ్రీరాం ఎనర్జీప్లాంట్‌లో పనులకు శంకుస్థాపన చేశారు. పేరుకుపోయిన చెత్తను శుద్ధి చేయడం, విభజించేందుకు ఏర్పాటుచేసిన బయోమైనింగ్‌ నేటి వరకు అడుగు ముందుకు పడలేదు. వీఎంసీ ముందుగానే నగదు చెల్లించినా నిర్మాణంలో జాప్యం చోటుచేసుకోవడం విమర్శలకు దారితీస్తోంది.

సాక్షి, అమరావతిబ్యూరో:  విజయవాడ అజిత్‌ సింగ్‌నగర్‌లో చెత్త నుంచి ఎరువు, విద్యుత్‌ తయారు చేయటానికి ప్రారంభించిన శ్రీరాం ఎనర్జీ ఎక్సెల్‌ప్లాంట్‌ కొంతకాలంగా పనిచేయటంలేదు. దీంతో రోజూ ఉత్పత్తయ్యే చెత్తంతా అక్కడే డంప్‌ అవుతుంది. నగరంలో సగటున రోజుకు 250 మెట్రిక్‌ టన్నుల చెత్త చేరుతుండగా అక్కడ ప్రస్తుతం సుమారు 15 అడుగుల ఎత్తు వరకు చెత్త పేరుకుపోయింది. రోజురోజుకు  చెత్త పెరగటంవల్ల అక్కడ మీథేన్‌గ్యాస్‌ ఉత్పత్తవ్వటంతో ఆ ప్రాంత వాసులు అల్లాడిపోతున్నారు. 32 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన డంపింగ్‌ యార్డులో తరచూ చెత్తకు నిప్పుపెట్టడం, పొగరావటంతో స్థానికుల ఆందోళన నేపథ్యంలో  వీఎంసీ పాలకవర్గం అక్కడి నుంచి డంపింగ్‌ యార్డును తరలించేందుకు చర్యలు చేపట్టింది.

రూ. 25 కోట్ల అంచనాలతో
ఎక్సెల్‌ప్లాంట్‌ నుంచి విడుదలయ్యే  దుర్వాసన వల్ల స్థానికులు అనారోగ్యబారిన పడిన దాఖలాలు కూడా ఉన్నాయి. దీన్ని నిరోధించటానికి కార్పొరేషన్‌ బయో మైనింగ్‌ ద్వారా సమస్యను పరిష్కరించటంతోపాటు కార్పొరేషన్‌కు విలువైన స్థలం కూడా తిరిగి సమకూరుతుందని అంచనాలతో ప్రణాళికలు రూపొందించారు. టన్నుకు రూ. 842 చొప్పున అక్కడ పేరుకుపోయిన 2.50 మెట్రిక్‌ టన్నుల చెత్తను బయో మైనింగ్‌ చేయటానికి తమిళనాడు రాష్ట్రం ఈరోడ్‌కు చెందిన జిగ్మా గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌ సొల్యూషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు కాంట్రాక్ట్‌ను అప్పగించారు. దీనికి సంబంధించి ఇప్పటికే జిగ్మా సంస్థకు రూ. 1.33 కోట్లు ఈ ఏడాది జనవరిలో ప్రాజెక్టు అగ్రిమెంట్‌ ద్వారా సొమ్ములు చెల్లించారు. సంబంధిత  కాంట్రాక్ట్‌ సంస్థ వీఎంసీ నుంచి ముందస్తు సొమ్ములు తీసుకున్నప్పటికీ ఇంతవరకు పనులు ప్రారంభించకపోవటం, రెండేళ్లలో పనులు పూర్తిచేయాల్సి ఉన్నా , కాంట్రాక్ట్‌ దక్కించుకుని ఆరు నెలలు గడుస్తున్నా ఇంత వరకు పనులు ప్రారంభించకపోవడం గమనార్హం.  బయో మైనింగ్‌లో భాగంగా తడి, పొడిచెత్త, ప్లాస్టిక్‌ కాగితాలు, బాటిళ్లు వేరుచేయటం, ఇతర వస్తువులు ముక్కలుగా చేయటం, గాజు, మట్టిన విడివిడిగా శాస్త్రీయంగా వేరుచేసి భూమిలో కలిసేలా మార్చాలి.

నిధులు కోసం ఎదురుచూపులు
బయో మైనింగ్‌ నిర్వహించటానికి అయ్యే ఖర్చు రూ. 26 కోట్లలో 12వ ఆర్థిక సంఘం నుంచి రూ. 9 కోట్లు, కార్పొరేషన్‌ జనరల్‌ ఫండ్స్‌ నుంచి రూ. 5 కోట్లు వెచ్చిస్తుండగా మిగిలిన రూ.12 కోట్లను స్వచ్చాంధ్ర కార్పొరేషన్‌ నుంచి ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని మార్చిలో నిర్వహించిన కౌన్సిల్‌ సమావేశంలో తీర్మానించి ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ఇంత వరకు ప్రభుత్వం నుంచి దీనిపై స్పష్టత లేకపోవటంతో వీఎంసీ అధికారులు, పాలకులు సచివాలయం, స్వచ్చాంధ్ర కార్పొరేషన్‌ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

కొరియా బృందంట్రయల్‌ వేయాల్సిందే...
త్వరలోనే బయో మైనింగ్‌ పనులు ప్రారంభిస్తాం. ఇప్పటికే యంత్రాలు బిగించే ఏర్పాటు చేస్తున్నాం. యంత్రాలు బిగించాక కొరియా బృందం వచ్చి ట్రయల్‌ వేసిన తర్వాత మైనింగ్‌ ప్రారంభిస్తాం. రోజుకు సగటున 300 టన్నుల చెత్తను మైనింగ్‌ చేయటానికి అవకాశం ఉంది. మాకు ఇచ్చిన గడువులోగా చెత్తనంతా మైనింగ్‌ చేస్తాం. అవసరమైతే అదనపు యంత్రాలను సమకూర్చుకుంటాం. తమిళనాడులో 60 ప్రాంతాల్లో, చెన్నై మున్సిపల్‌ కార్పొరేషన్‌లో నాలుగు ప్రాంతాల్లో  ఈ విధానాన్ని అమలు చేస్తున్నాం.– శ్రీనివాస్, జిగ్మా సంస్థ ప్రతినిధి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement