చెత్త నుంచి గ్యాస్ ఉత్పత్తి చేసే ప్లాంట్
సాక్షి, హైదరాబాద్: ‘వ్యర్థం నుంచి అర్థం’ అంటే ఇదే మరి. ఇప్పటికే చెత్త నుంచి విద్యుదుత్పత్తి చేస్తున్న గ్రేటర్ నగరం మరో ముందడుగు వేసింది. జవహర్‌నగర్ డంపింగ్ యార్డులోని చెత్తనుంచి వాహన ఇంధనంగా ఉపకరించే కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ఉత్పత్తి ప్రారంభమైంది. దీంతో జవహర్‌నగర్ డంపింగ్ యార్డులో చెత్తగుట్ట సమస్య తగ్గడంతో పాటు పర్యావరణపరంగా, ఆర్థికంగా ప్రయోజనం చేకూరనుంది. విష వాయువుల నుంచి వెలువడే వాయు కాలుష్యం తగ్గుతుంది. గ్యాస్ ఉత్పత్తితో ఆ మేరకు డీజిల్ వినియోగం తగ్గుతుంది. జవహర్‌నగర్ డంపింగ్ యార్డులో దాదాపు 130 ఎకరాల మేర ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్త గుట్ట నుంచి వెలువడే దుర్గంధం, పరిసర ప్రాంతాల ప్రజల ఇబ్బందులు తగ్గించేందుకు దాన్ని క్యాపింగ్ చేసి సైంటిఫిక్ ల్యాండ్‌ఫిల్‌గా మార్చారు.
ఏం చేశారంటే..
క్యాపింగ్ సమయంలోనే ల్యాండ్‌ఫిల్‌లో దాదాపు 155 గ్యాస్ వెల్స్ వేశారు. వాటి నుంచి పైప్‌లైన్ ద్వారా చెత్తలోని వాయువులు పెద్ద బెలూన్‌లోకి చేరతాయి. వీటిల్లో మిథేన్, కార్బన్‌డయాక్సైడ్ తదితరమైనవి ఉంటాయి. మిథేన్ దాదాపు 45 శాతంగా ఉంటుంది. అక్కడి నుంచి వివిధ దశల్లో శుద్ధి చేసి మిథేన్ దాదాపు 93 శాతం వరకు వచ్చేలా చేస్తారు. దీన్ని సీఎన్‌జీ మాదిరిగా వాహనాలకు వినియోగించవచ్చు. శుద్ధి చేశాక మరో బెలూన్‌లోకి పంపుతారు. అక్కడి నుంచి గ్యాస్‌ను బూస్టర్ కంప్రెషర్ ద్వారా పైప్‌లైన్ల నుంచి సిలిండర్లలో నింపుతారు. (చదవండి: బాబోయ్.. మేం భరించలేం..ఊపిరాడట్లే!)
వాటిని సంబంధిత ఫిల్లింగ్ కేంద్రాలకు పంపించి వాహనాలకు ఇంధనంగా వినియోగిస్తారు. జవహర్‌నగర్ డంపింగ్‌యార్డు నిర్వహిస్తున్న రాంకీ సంస్థ రోజుకు 5 టన్నుల గ్యాస్ ఉత్పత్తి చేయగల ప్లాంట్ ఏర్పాటు చేసింది.గ్యాస్ ఉత్పత్తి జరుగుతోంది. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ కంపెనీతో రోజుకు 2 టన్నుల విక్రయానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు రాంకీ ప్రతినిధి తెలిపారు. అది రిటైల్ ఔట్‌లెట్‌ను సైతం ఏర్పాటు చేసిందన్నారు.
సైంటిఫిక్ ల్యాండ్‌ఫిల్ నుంచి దాదాపు 8 సంవత్సరాల వరకు గ్యాస్ ఉత్పత్తి చేయవచ్చని చెప్పారు. ఆ తర్వాత కొన్నేళ్ల వరకు తక్కువ పరిమాణంతో గ్యాస్ ఉత్పత్తి చేయవచ్చు. దీంతోపాటు చెత్తగుట్టలోని కాలుష్య ద్రవాలు (లీచెట్) తొలగించే పనులు కూడా చేపట్టినందున చెత్తగుట్ట స్థిరీకరణ జరుగుతుంది. చెత్తనుంచి గ్యాస్ ఉత్పత్తికి దాదాపు రూ. 11 కోట్లు ఖర్చు చేశారు. ఒప్పందం మేరకు కేజీ గ్యాస్‌ను రవాణాతో కలిపి రూ.46 లకు విక్రయిస్తున్నట్లు సమాచారం.
వాహనాలకు వినియోగం..
చెత్తగుట్ట నుంచి ఉత్పత్తవుతున్న ఈ గ్యాస్‌ను చెత్త తరలింపు వాహనాలకు వినియోగించే ఆలోచనలో ఉన్నారు. నగరంలోని వివిధ చెత్త ట్రాన్స్‌ఫర్ స్టేషన్ల నుంచి చెత్తను ట్రక్కుల ద్వారా డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నారు. సదరు ట్రక్కుల డీజిల్ ఇంజిన్లను తొలగించి వాటిస్థానంలో సీఎన్‌జీ ఇంజిన్లను అమర్చి గ్యాస్‌ను వినియోగించాలని ఆలోచన. వేస్ట్ ల్యాండ్‌ఫిల్ నుంచి బ యోగ్యాస్ ఉత్పత్తి దేశంలో ఇంతవరకు ఎక్కడా లేదని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment