సాక్షి, హైదరాబాద్: జవహర్‌నగర్‌లో క్యాపింగ్ చేసిన చెత్తగుట్టకు బయో మైనింగ్ అండ్ బయో రెమిడియేషన్ చేయాలంటూ ఎన్జీటీ ఆదేశించిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అందుకు ఆర్‌ఎఫ్‌పీ టెండర్లు పిలిచింది. జవహర్‌నగర్ డంపింగ్‌యార్డు వల్ల తలెత్తుతున్న సమస్యలపై స్థానికులు ఎన్జీటీని ఆశ్రయించడం.. ఇతరత్రా అంశాల నేపథ్యంలో డంపింగ్ యార్డుకు చేసిన క్యాపింగ్‌ను తొలగించి బయోమైనింగ్ చేయాలని ఎన్జీటీ ఆదేశించిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఈ టెండరు పిలిచింది. తాము శాస్త్రీయంగా చేసిన క్యాపింగ్‌ను వివరిస్తూ జీహెచ్‌ఎంసీ రివ్యూ పిటిషన్ వేసినా ఎన్టీటీ జీహెచ్‌ఎంసీ విజ్ఞప్తిని తిరస్కరించింది. సుప్రీంకోర్టుకు వెళ్లగా ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఈ టెండరు ఆహ్వానించింది.
► ఒకసారి క్యాపింగ్ చేసిన చెత్తగుట్ట బయో మైనింగ్ అండ్ బయో రెమిడియేషన్‌కు సంబంధించి కేంద్ర కాలుష్యనివారణ మండలి నుంచి జీహెచ్‌ఎంసీకి మార్గదర్శకాలు సైతం అందలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రక్రియను అమలు చేస్తున్న విధానాలు తెలిసిన లేదా కేంద్ర/రాష్ట్ర కాలుష్య నివారణ మండలి మార్గదర్శకాల కనుగుణంగా, శాస్త్రీయంగా క్యాపింగ్ చేసిన చెత్తగుట్టను బయోమైనింగ్ చేయగల నైపుణ్యం ఉన్న సంస్థల్ని టెండర్లకు అర్హులుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో క్యాపింగ్ చేసిన చెత్తగుట్టను తవ్వడం వల్ల ఎలాంటి కొత్త సమస్యలు ఉత్పన్నం కానున్నాయో అంతుచిక్కడం లేదు. టెండర్ మేరకు ఈ పనులు దక్కించుకునే సంస్థ మూడు సంవత్సరాల్లో పని పూర్తి చేయాల్సి ఉంది. బయోమైనింగ్‌తో వెలువడే వ్యర్థాలను నిల్వ ఉంచే స్థలం కలిగి ఉండాలి. వ్యర్థాలనుంచి వెలువడే కలుషిత ద్రవాలు(లీచెట్)ట్రీట్‌మెంట్‌కు ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవాలి. చెత్తనుంచి గ్యాస్ ఉత్పత్తికోసం ఏర్పాటు చేసిన గ్యాస్ వెంట్స్ నుంచి సమస్యలు తలెత్తకుండా గ్యాస్ మేనేజ్‌మెంట్ ఇతరత్రా పనులు సైతం కాంట్రాక్టు సంస్థే చేయాల్సి ఉంటుంది.
► దాదాపు 120 లక్షల మెట్రిక్ టన్నులమేర క్యాపింగ్ చేసిన చెత్తగుట్టను తిరిగి తవ్వి పనులు చేయాల్సి ఉంటుంది. మునిసిపల్ ఘనవ్యర్థాల నిబంధనల మేరకు పనిచేయాల్సి ఉంది.
► చెత్తగుట్ట క్యాపింగ్ పనులకు రూ. 140 కోట్లు వెచ్చించారు. ఇందులో 35 శాతం స్వచ్ఛభారత్ మెషిన్ ద్వారా కేంద్రప్రభుత్వం అందజేయగా, మిగతా వ్యయాన్ని జీహెచ్‌ఎంసీ, డంపింగ్‌యార్డు ట్రీట్‌మెంట్ కాంట్రాక్టు పొందిన రాంకీ సంస్థలు భరించాయి. క్యాపింగ్‌కు సంబంధించిన పనులు పూర్తయ్యాక, తిరిగి ఇప్పుడు దాన్ని తవ్వి బయోరెమిడియేషన్ చేయడం ఎప్పటికి సాధ్యం కానుందో అంతుపట్టడం లేదు. ఈ లోగా కొత్త సమస్యలకు అవకాశముందని ఈ అంశంలో అవగాహన ఉన్నవారు చెబుతున్నారు. అంతేకాదు.. ఇప్పటికే ఖర్చు చేసిన రూ.140 కోట్లు బూడిదలో పోసిన పన్నీరు చందం కానున్నాయి.
బయోమైనింగ్ అంటే క్యాపింగ్ చేసిన చెత్తగుట్టను తవ్వడం. బయో రెమిడియేషన్ అంటే వెలువడే చెత్తను మట్టి, కంపోస్టు, ఇతరత్రా సామాగ్రిగా వేరు చేయడం. వీటిల్లో ప్లాస్టిక్, ఇనుము, గాజు, రాళ్లు, కంకర వంటివి ఉంటాయని చెబుతున్నప్పటికీ మట్టి, ఇతరత్రావన్నీ కలిసి రెండు భాగాలుగా మాత్రమే వెలువడనున్నట్లు సమాచారం. ఈ పనులు చేసేందుకు ఎన్జీటీ నిబంధనల మేరకు దాదాపు రూ. 660 కోట్లు ఖర్చు కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. (క్లిక్: మది దోచే మల్కంచెరువు.. మన హైదరాబాద్‌లో..)
Comments
Please login to add a commentAdd a comment