Jawahar Nagar dumping yard
-
జవహర్‌నగర్ డంపింగ్‌యార్డు.. త్వరలో క్యాపింగ్ తవ్వకాలు
సాక్షి, హైదరాబాద్: జవహర్‌నగర్‌లో క్యాపింగ్ చేసిన చెత్తగుట్టకు బయో మైనింగ్ అండ్ బయో రెమిడియేషన్ చేయాలంటూ ఎన్జీటీ ఆదేశించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అందుకు ఆర్ఎఫ్పీ టెండర్లు పిలిచింది. జవహర్‌నగర్ డంపింగ్‌యార్డు వల్ల తలెత్తుతున్న సమస్యలపై స్థానికులు ఎన్జీటీని ఆశ్రయించడం.. ఇతరత్రా అంశాల నేపథ్యంలో డంపింగ్ యార్డుకు చేసిన క్యాపింగ్‌ను తొలగించి బయోమైనింగ్ చేయాలని ఎన్జీటీ ఆదేశించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఈ టెండరు పిలిచింది. తాము శాస్త్రీయంగా చేసిన క్యాపింగ్‌ను వివరిస్తూ జీహెచ్ఎంసీ రివ్యూ పిటిషన్ వేసినా ఎన్టీటీ జీహెచ్ఎంసీ విజ్ఞప్తిని తిరస్కరించింది. సుప్రీంకోర్టుకు వెళ్లగా ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఈ టెండరు ఆహ్వానించింది. ► ఒకసారి క్యాపింగ్ చేసిన చెత్తగుట్ట బయో మైనింగ్ అండ్ బయో రెమిడియేషన్‌కు సంబంధించి కేంద్ర కాలుష్యనివారణ మండలి నుంచి జీహెచ్ఎంసీకి మార్గదర్శకాలు సైతం అందలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రక్రియను అమలు చేస్తున్న విధానాలు తెలిసిన లేదా కేంద్ర/రాష్ట్ర కాలుష్య నివారణ మండలి మార్గదర్శకాల కనుగుణంగా, శాస్త్రీయంగా క్యాపింగ్ చేసిన చెత్తగుట్టను బయోమైనింగ్ చేయగల నైపుణ్యం ఉన్న సంస్థల్ని టెండర్లకు అర్హులుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో క్యాపింగ్ చేసిన చెత్తగుట్టను తవ్వడం వల్ల ఎలాంటి కొత్త సమస్యలు ఉత్పన్నం కానున్నాయో అంతుచిక్కడం లేదు. టెండర్ మేరకు ఈ పనులు దక్కించుకునే సంస్థ మూడు సంవత్సరాల్లో పని పూర్తి చేయాల్సి ఉంది. బయోమైనింగ్‌తో వెలువడే వ్యర్థాలను నిల్వ ఉంచే స్థలం కలిగి ఉండాలి. వ్యర్థాలనుంచి వెలువడే కలుషిత ద్రవాలు(లీచెట్)ట్రీట్మెంట్కు ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవాలి. చెత్తనుంచి గ్యాస్ ఉత్పత్తికోసం ఏర్పాటు చేసిన గ్యాస్ వెంట్స్ నుంచి సమస్యలు తలెత్తకుండా గ్యాస్ మేనేజ్మెంట్ ఇతరత్రా పనులు సైతం కాంట్రాక్టు సంస్థే చేయాల్సి ఉంటుంది. ► దాదాపు 120 లక్షల మెట్రిక్ టన్నులమేర క్యాపింగ్ చేసిన చెత్తగుట్టను తిరిగి తవ్వి పనులు చేయాల్సి ఉంటుంది. మునిసిపల్ ఘనవ్యర్థాల నిబంధనల మేరకు పనిచేయాల్సి ఉంది. ► చెత్తగుట్ట క్యాపింగ్ పనులకు రూ. 140 కోట్లు వెచ్చించారు. ఇందులో 35 శాతం స్వచ్ఛభారత్ మెషిన్ ద్వారా కేంద్రప్రభుత్వం అందజేయగా, మిగతా వ్యయాన్ని జీహెచ్ఎంసీ, డంపింగ్‌యార్డు ట్రీట్మెంట్ కాంట్రాక్టు పొందిన రాంకీ సంస్థలు భరించాయి. క్యాపింగ్‌కు సంబంధించిన పనులు పూర్తయ్యాక, తిరిగి ఇప్పుడు దాన్ని తవ్వి బయోరెమిడియేషన్ చేయడం ఎప్పటికి సాధ్యం కానుందో అంతుపట్టడం లేదు. ఈ లోగా కొత్త సమస్యలకు అవకాశముందని ఈ అంశంలో అవగాహన ఉన్నవారు చెబుతున్నారు. అంతేకాదు.. ఇప్పటికే ఖర్చు చేసిన రూ.140 కోట్లు బూడిదలో పోసిన పన్నీరు చందం కానున్నాయి. బయోమైనింగ్ అంటే క్యాపింగ్ చేసిన చెత్తగుట్టను తవ్వడం. బయో రెమిడియేషన్ అంటే వెలువడే చెత్తను మట్టి, కంపోస్టు, ఇతరత్రా సామాగ్రిగా వేరు చేయడం. వీటిల్లో ప్లాస్టిక్, ఇనుము, గాజు, రాళ్లు, కంకర వంటివి ఉంటాయని చెబుతున్నప్పటికీ మట్టి, ఇతరత్రావన్నీ కలిసి రెండు భాగాలుగా మాత్రమే వెలువడనున్నట్లు సమాచారం. ఈ పనులు చేసేందుకు ఎన్జీటీ నిబంధనల మేరకు దాదాపు రూ. 660 కోట్లు ఖర్చు కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. (క్లిక్: మది దోచే మల్కంచెరువు.. మన హైదరాబాద్‌లో..) -
‘వేస్ట్ టు వెల్త్’లో హైదరాబాద్ మరో ముందడుగు
సాక్షి, హైదరాబాద్: ‘వ్యర్థం నుంచి అర్థం’ అంటే ఇదే మరి. ఇప్పటికే చెత్త నుంచి విద్యుదుత్పత్తి చేస్తున్న గ్రేటర్ నగరం మరో ముందడుగు వేసింది. జవహర్‌నగర్ డంపింగ్ యార్డులోని చెత్తనుంచి వాహన ఇంధనంగా ఉపకరించే కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ఉత్పత్తి ప్రారంభమైంది. దీంతో జవహర్‌నగర్ డంపింగ్ యార్డులో చెత్తగుట్ట సమస్య తగ్గడంతో పాటు పర్యావరణపరంగా, ఆర్థికంగా ప్రయోజనం చేకూరనుంది. విష వాయువుల నుంచి వెలువడే వాయు కాలుష్యం తగ్గుతుంది. గ్యాస్ ఉత్పత్తితో ఆ మేరకు డీజిల్ వినియోగం తగ్గుతుంది. జవహర్‌నగర్ డంపింగ్ యార్డులో దాదాపు 130 ఎకరాల మేర ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్త గుట్ట నుంచి వెలువడే దుర్గంధం, పరిసర ప్రాంతాల ప్రజల ఇబ్బందులు తగ్గించేందుకు దాన్ని క్యాపింగ్ చేసి సైంటిఫిక్ ల్యాండ్‌ఫిల్‌గా మార్చారు. ఏం చేశారంటే.. క్యాపింగ్ సమయంలోనే ల్యాండ్‌ఫిల్‌లో దాదాపు 155 గ్యాస్ వెల్స్ వేశారు. వాటి నుంచి పైప్‌లైన్ ద్వారా చెత్తలోని వాయువులు పెద్ద బెలూన్‌లోకి చేరతాయి. వీటిల్లో మిథేన్, కార్బన్డయాక్సైడ్ తదితరమైనవి ఉంటాయి. మిథేన్ దాదాపు 45 శాతంగా ఉంటుంది. అక్కడి నుంచి వివిధ దశల్లో శుద్ధి చేసి మిథేన్ దాదాపు 93 శాతం వరకు వచ్చేలా చేస్తారు. దీన్ని సీఎన్జీ మాదిరిగా వాహనాలకు వినియోగించవచ్చు. శుద్ధి చేశాక మరో బెలూన్‌లోకి పంపుతారు. అక్కడి నుంచి గ్యాస్‌ను బూస్టర్ కంప్రెషర్ ద్వారా పైప్లైన్ల నుంచి సిలిండర్లలో నింపుతారు. (చదవండి: బాబోయ్.. మేం భరించలేం..ఊపిరాడట్లే!) వాటిని సంబంధిత ఫిల్లింగ్ కేంద్రాలకు పంపించి వాహనాలకు ఇంధనంగా వినియోగిస్తారు. జవహర్‌నగర్ డంపింగ్‌యార్డు నిర్వహిస్తున్న రాంకీ సంస్థ రోజుకు 5 టన్నుల గ్యాస్ ఉత్పత్తి చేయగల ప్లాంట్ ఏర్పాటు చేసింది.గ్యాస్ ఉత్పత్తి జరుగుతోంది. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ కంపెనీతో రోజుకు 2 టన్నుల విక్రయానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు రాంకీ ప్రతినిధి తెలిపారు. అది రిటైల్ ఔట్‌లెట్‌ను సైతం ఏర్పాటు చేసిందన్నారు. సైంటిఫిక్ ల్యాండ్‌ఫిల్ నుంచి దాదాపు 8 సంవత్సరాల వరకు గ్యాస్ ఉత్పత్తి చేయవచ్చని చెప్పారు. ఆ తర్వాత కొన్నేళ్ల వరకు తక్కువ పరిమాణంతో గ్యాస్ ఉత్పత్తి చేయవచ్చు. దీంతోపాటు చెత్తగుట్టలోని కాలుష్య ద్రవాలు (లీచెట్) తొలగించే పనులు కూడా చేపట్టినందున చెత్తగుట్ట స్థిరీకరణ జరుగుతుంది. చెత్తనుంచి గ్యాస్ ఉత్పత్తికి దాదాపు రూ. 11 కోట్లు ఖర్చు చేశారు. ఒప్పందం మేరకు కేజీ గ్యాస్‌ను రవాణాతో కలిపి రూ.46 లకు విక్రయిస్తున్నట్లు సమాచారం. వాహనాలకు వినియోగం.. చెత్తగుట్ట నుంచి ఉత్పత్తవుతున్న ఈ గ్యాస్‌ను చెత్త తరలింపు వాహనాలకు వినియోగించే ఆలోచనలో ఉన్నారు. నగరంలోని వివిధ చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్ల నుంచి చెత్తను ట్రక్కుల ద్వారా డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నారు. సదరు ట్రక్కుల డీజిల్ ఇంజిన్లను తొలగించి వాటిస్థానంలో సీఎన్జీ ఇంజిన్లను అమర్చి గ్యాస్‌ను వినియోగించాలని ఆలోచన. వేస్ట్ ల్యాండ్‌ఫిల్ నుంచి బ యోగ్యాస్ ఉత్పత్తి దేశంలో ఇంతవరకు ఎక్కడా లేదని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. -
టార్గెట్... క్లీన్ సిటీ
⇔ చర్యలు వేగవంతం చేసిన జీహెచ్ఎంసీ ⇔జవహర్‌నగర్ డంపింగ్‌యార్డులో ‘క్యాపింగ్’కు చర్యలు ⇔2500 స్వచ్ఛ ఆటోలు, 44 లక్షల చెత్త డబ్బాల పంపిణీ ⇔బహిరంగ ప్రదేశాల్లోని చెత్త తొలగింపునకు ప్రాధాన్యం గ్రేటర్లో అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా... పారిశుధ్యం, స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాలకు కూడా జీహెచ్ఎంసీ అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. విశ్వనగరంగా ఎదగాలంటే వివిధ మౌలిక సదుపాయాలేకాదు...ప్రజల కనీస ఇబ్బందులు తీరాలనే దిశగా కృషి చేస్తోంది. దేశంలోని మరే ఇతర మున్సిపాలిటీ, కార్పొరేషన్లో లేని విధంగా స్వచ్ఛ కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా చెత్త ఉత్పత్తి స్థానం నుంచి సేంద్రియ ఎరువుగా.. విద్యుత్‌గా రూపాంతరం చెందేంత వరకు మధ్యలో అవసరమైన అన్ని సదుపాయాలను అందుబాటులోకి తెస్తోంది. బయటకు వెళ్లిన ప్రజలకు ‘అత్యవసర’ఇబ్బందులు లేకుండా ఉండేందుకు తగినన్ని టాయ్లెట్లను నిర్మిస్తోంది. దేశంలోని ఏడువేలకు పైగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఏ స్థానికసంస్థా చేయని విధంగా తగిన ప్రణాళికలతో ముందుకువెళుతోంది. ఈ అంశాల్లో వచ్చే ఉగాదిలోగా నూరు శాతం ఫలితాలు సాధించేందుకు లక్ష్యం నిర్దేశించింది. – సాక్షి, హైదరాబాద్ 44 లక్షల చెత్తడబ్బాలు.. 2500 స్వచ్ఛ ఆటోలు నగరంలో తడి, పొడి చెత్తలను వేరుగా చేసేందుకు ఇంటింటికీ రెండు డబ్బాల చొప్పున 44 లక్షల చెత్త డబ్బాలను పంపిణీ చేశారు. ఇళ్లనుంచి చెత్తను సమీప ప్రాంతాల్లోకి తరలించే చెత్త ట్రాన్స్‌ఫర్‌స్టేషన్లను 10 నుంచి 20కి పెంచారు. ట్రాన్స్ఫర్ స్టేషన్ల వద్దే కంపోస్టు ఎరువు తయారీకి ప్రైవేటు సంస్థలకు అనుమతులిస్తున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా వచ్చే ఏడాదిలోగా ఎక్కడికక్కడే చెత్తను విడదీసి ఎరువుగా మార్చనున్నారు. ఇంటిం టి నుంచి చెత్తను తరలించేందుకు ప్రస్తుతం 2000 ఉన్న స్వచ్ఛ ఆటోలను 2500 కు పెంచుతున్నారు. గతంలో 3300 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు మాత్రమే డంపింగ్‌యార్డుకు వెళ్లేవి. స్వచ్ఛ ఆటోలొచ్చాక ప్రస్తుతం 4500 మెట్రిక్ టన్నులు తరలిస్తున్నారు. హోటళ్లు, ఫంక్షన్ హాళ్లలోనూ ఎక్కడికక్కడే చెత్తను విడదీసి సేంద్రియ ఎరువుల తయారీ చర్యలు చేపడుతున్నారు. తడిపొడి చెత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. తడిపొడి చెత్తలు కలసి ఉంటే ప్రమాదం ఎంత ప్రమాదమో, భార్యభర్తలు విడిగా ఉంటే అంతే సమస్యలు అనే విషయాన్ని వివరిస్తూ వేరుపడ్డ 150కి పైగా జంటల్ని కలిపారు. డెబ్రిస్ రీసైక్లింగ్.. నగరంలో చాలా చోట్ల చెత్తతోపాటు నిర్మాణ వ్యర్థాలు కలుస్తుండటంతో పారిశుధ్యం పరిస్థితి క్లిష్టంగా మారుతోంది. ఇకపై ఇందుకు తావులేకుండా నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ యూనిట్లు అందుబాటులోకి తెస్తున్నారు. నెలరోజుల్లో ఫతుల్లాగూడ, జీడిమెట్లలో రెండు ప్రాంతాల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. డంపింగ్‌యార్డులో క్యాపింగ్.. జవహర్‌నగర్ డంపింగ్‌యార్డులో పది మిలియన్ టన్నుల మేర వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోయి పరి సరాలు, వాయు, జలకాలుష్యం పెరిగాయి. ఈ సమస్యపరిష్కారానికి ‘స్వచ్ఛ భారత్’లో భాగంగా త్వరలోనే ‘క్యాపింగ్’ప్రాజెక్టు చేపట్టనున్నారు. రూ. 140 కోట్లు ఖర్చుయ్యే ఈ ప్రాజెక్ట్‌కోసం ఇప్పటికే కేంద్రానికి రాశారు. కేంద్రం మూడోవంతు నిధులిస్తుంది. వార్డులకు ర్యాంకులు.. ప్రోత్సాహకాలు.. ఎన్ని కార్యక్రమాలు అమలుచేసినా ప్రజల భాగస్వామ్యం లేనిదే విజయవంతం కావనే అంశాన్ని గుర్తించి పారిశుధ్య కార్యక్రమాల అమలులో వార్డులకు, లొకా లిటీలకు ర్యాంకులివ్వనున్నారు. మెరుగైన ర్యాంకుల్లో ఉండేవాటికి ఎన్జీఓలు, తదితర సంస్థల ద్వారా ప్రోత్సాహకాలు అందించనున్నారు. అవార్డులు.. రివార్డులు.. పారిశుధ్య కార్యక్రమాలు, వ్యర్థాల నిర్వహణను ఇప్పటికే పలు సంస్థలు గుర్తించాయి. ఢిల్లీలోని అసో చాం సంస్థ వ్యర్థాల నిర్వహణలో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు జాతీయ అవార్డును ప్రకటించింది. దీన్ని గురువారం సౌత్‌జోన్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి అందుకుంటున్నారు. ఎన్నో ఏళ్ల క్రితమే ఘనవ్యర్థాలు, పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణలో వినూత్న కార్యక్రమాలు అమలు చేశారు. స్వచ్ఛ భారత్ ప్రారంభానికి ముందే గతంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ నిర్వహించిన టీవీ షో ‘సత్యమేవజయతే’కార్యక్రమంలో జనార్దన్‌రెడ్డి చేపట్టిన కార్యక్రమాలు జాతీయస్థాయిలో గుర్తింపుపొందడంతో ఆయనను అభినందించి, సన్మానించారు. జీహెచ్ఎంసీకి వచ్చాక స్వల్ప సమయంలోనే దాదాపు నాలుగువేల పాఠశాలల్లో స్వచ్ఛ కార్యక్రమాలపై విద్యార్థులకు అవగాహన కలిగించారు. జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికుడు వెంకటయ్య కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి స్వచ్ఛ అవార్డును అందుకున్నారు. స్వచ్ఛ సైన్యం.. బహిరంగ ప్రదేశాల్లో చెత్తకుప్పలు తొలగించే కార్యక్రమాన్ని చేపట్టి 1,116 ప్రాంతాల్లో తొలగించి, ముగ్గులు, రంగులతో తీర్చిదిద్దారు. తిరిగి రోడ్లపై చెత్త వేయకుండా స్థానికులతో...స్వచ్ఛ వాలంటీర్లతో స్వచ్ఛ సైన్యాన్ని ఏర్పాటు చేశారు. బహిరంగంగా చెత్త వేసే వారిని వీరు అడ్డుకుంటారు. కాలనీల్లోని పారిశుధ్య కార్మికుల వివరాలు ప్రజలకు తెలిసేలా ‘పరిచయం’పేరిట వారి వివరాలు గోడలపై రాశారు. అత్యవసర బాధలనుంచి విముక్తి.. పేరు గొప్ప నగరమే కానీ.. యూరినల్స్‌కు వెళ్దామంటే నరకయాతన. కనుచూపు మేరలో అవి కనిపించకపోవడంతో ఎక్కడపడితే అక్కడే పని కానిచ్చేస్తున్నారు. ఈ పరిస్థితిని నివారించేందుకు అవసరమైనన్ని టాయ్లెట్ల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మహిళల కోసమే ప్రత్యేకంగా ఆధునికమైన వంద షీ–టాయ్లెట్లను మూడు మాసాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిధులిచ్చేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. నిర్వహణలోపంతో మూతపడ్డ గత అనుభవం దృష్ట్యా వీటిని ఏర్పాటు చేసే సంస్థలే కనీసం రెండు సంవత్సరాలు నిర్వహించేలా టెండరు నిబంధనలు మార్చారు. ఎన్ని అవసరమైతే అన్ని టాయ్లెట్లను వచ్చే ఏడాదిలోగా ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. -
జవహర్ నగర్ లో ఆగని మంటలు
- సాయంత్రానికి మంటలు పూర్తిగా అదుపులోకి వస్తాయన్న అధికారులు జవహర్‌నగర్ (రంగారెడ్డి) జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌లో మంటలు సోమవారం సాయంత్రానికి పూర్తిగా అదుపులోకి వస్తాయని జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి చెప్పారు. ఆదివారం రాత్రి డంపింగ్ యార్డులో మంటలు ప్రారంభమైన విషయం తెలిసిందే. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం జనార్దన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ప్రభుత్వంతో మాట్లాడి ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. కాగా, రాత్రి నుంచి నాలుగు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు చర్యలు చేపట్టగా... సోమవారం ఉదయానికి అవి అదుపులోకి వచ్చాయి. అయినా మధ్యలో నుంచి పొగలు వస్తూనే ఉన్నాయి.