టార్గెట్‌... క్లీన్‌ సిటీ | Capping in Jawahar Nagar dumping yard : GHMC | Sakshi
Sakshi News home page

టార్గెట్‌... క్లీన్‌ సిటీ

Published Thu, Mar 30 2017 2:19 AM | Last Updated on Tue, Sep 5 2017 7:25 AM

టార్గెట్‌... క్లీన్‌ సిటీ

టార్గెట్‌... క్లీన్‌ సిటీ

చర్యలు వేగవంతం చేసిన జీహెచ్‌ఎంసీ
జవహర్‌నగర్‌ డంపింగ్‌యార్డులో ‘క్యాపింగ్‌’కు చర్యలు  
2500 స్వచ్ఛ ఆటోలు, 44 లక్షల చెత్త డబ్బాల పంపిణీ
బహిరంగ ప్రదేశాల్లోని చెత్త తొలగింపునకు ప్రాధాన్యం  


గ్రేటర్‌లో అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా... పారిశుధ్యం, స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమాలకు కూడా జీహెచ్‌ఎంసీ అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. విశ్వనగరంగా ఎదగాలంటే వివిధ మౌలిక సదుపాయాలేకాదు...ప్రజల కనీస ఇబ్బందులు తీరాలనే దిశగా కృషి చేస్తోంది. దేశంలోని మరే ఇతర మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లో లేని విధంగా స్వచ్ఛ కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా చెత్త ఉత్పత్తి స్థానం నుంచి సేంద్రియ ఎరువుగా.. విద్యుత్‌గా రూపాంతరం చెందేంత వరకు మధ్యలో అవసరమైన అన్ని సదుపాయాలను అందుబాటులోకి తెస్తోంది. బయటకు వెళ్లిన ప్రజలకు ‘అత్యవసర’ఇబ్బందులు లేకుండా ఉండేందుకు తగినన్ని టాయ్‌లెట్లను నిర్మిస్తోంది. దేశంలోని ఏడువేలకు పైగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఏ స్థానికసంస్థా చేయని విధంగా తగిన ప్రణాళికలతో ముందుకువెళుతోంది. ఈ అంశాల్లో వచ్చే ఉగాదిలోగా నూరు శాతం ఫలితాలు సాధించేందుకు లక్ష్యం నిర్దేశించింది.     – సాక్షి, హైదరాబాద్‌

44 లక్షల చెత్తడబ్బాలు..  2500 స్వచ్ఛ ఆటోలు
నగరంలో తడి, పొడి చెత్తలను వేరుగా చేసేందుకు ఇంటింటికీ రెండు డబ్బాల చొప్పున 44 లక్షల చెత్త డబ్బాలను పంపిణీ చేశారు. ఇళ్లనుంచి చెత్తను సమీప ప్రాంతాల్లోకి తరలించే చెత్త ట్రాన్స్‌ఫర్‌స్టేషన్లను 10 నుంచి 20కి పెంచారు. ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్ల వద్దే కంపోస్టు ఎరువు తయారీకి ప్రైవేటు సంస్థలకు అనుమతులిస్తున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా వచ్చే ఏడాదిలోగా ఎక్కడికక్కడే చెత్తను విడదీసి ఎరువుగా మార్చనున్నారు.

 ఇంటిం టి నుంచి చెత్తను తరలించేందుకు ప్రస్తుతం 2000 ఉన్న స్వచ్ఛ ఆటోలను 2500 కు పెంచుతున్నారు. గతంలో 3300 మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలు మాత్రమే డంపింగ్‌యార్డుకు వెళ్లేవి. స్వచ్ఛ ఆటోలొచ్చాక ప్రస్తుతం 4500 మెట్రిక్‌ టన్నులు తరలిస్తున్నారు. హోటళ్లు, ఫంక్షన్‌ హాళ్లలోనూ ఎక్కడికక్కడే చెత్తను విడదీసి సేంద్రియ ఎరువుల తయారీ చర్యలు చేపడుతున్నారు. తడిపొడి చెత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. తడిపొడి చెత్తలు కలసి ఉంటే ప్రమాదం ఎంత ప్రమాదమో, భార్యభర్తలు విడిగా ఉంటే అంతే సమస్యలు అనే విషయాన్ని వివరిస్తూ వేరుపడ్డ 150కి పైగా జంటల్ని కలిపారు.

డెబ్రిస్‌ రీసైక్లింగ్‌..
నగరంలో చాలా చోట్ల చెత్తతోపాటు నిర్మాణ వ్యర్థాలు కలుస్తుండటంతో పారిశుధ్యం పరిస్థితి క్లిష్టంగా మారుతోంది. ఇకపై ఇందుకు తావులేకుండా నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్‌ యూనిట్లు అందుబాటులోకి తెస్తున్నారు. నెలరోజుల్లో ఫతుల్లాగూడ, జీడిమెట్లలో రెండు ప్రాంతాల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి.

డంపింగ్‌యార్డులో క్యాపింగ్‌..
జవహర్‌నగర్‌ డంపింగ్‌యార్డులో పది మిలియన్‌ టన్నుల మేర వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోయి పరి సరాలు, వాయు, జలకాలుష్యం పెరిగాయి. ఈ సమస్యపరిష్కారానికి ‘స్వచ్ఛ భారత్‌’లో భాగంగా త్వరలోనే ‘క్యాపింగ్‌’ప్రాజెక్టు చేపట్టనున్నారు. రూ. 140 కోట్లు ఖర్చుయ్యే ఈ ప్రాజెక్ట్‌కోసం ఇప్పటికే కేంద్రానికి రాశారు. కేంద్రం మూడోవంతు నిధులిస్తుంది.

వార్డులకు ర్యాంకులు.. ప్రోత్సాహకాలు..
ఎన్ని కార్యక్రమాలు అమలుచేసినా ప్రజల భాగస్వామ్యం లేనిదే విజయవంతం కావనే అంశాన్ని గుర్తించి పారిశుధ్య కార్యక్రమాల అమలులో వార్డులకు, లొకా లిటీలకు ర్యాంకులివ్వనున్నారు. మెరుగైన ర్యాంకుల్లో ఉండేవాటికి ఎన్జీఓలు, తదితర సంస్థల ద్వారా ప్రోత్సాహకాలు అందించనున్నారు.

అవార్డులు.. రివార్డులు..
పారిశుధ్య కార్యక్రమాలు, వ్యర్థాల నిర్వహణను ఇప్పటికే పలు సంస్థలు గుర్తించాయి. ఢిల్లీలోని అసో చాం సంస్థ వ్యర్థాల నిర్వహణలో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు జాతీయ అవార్డును ప్రకటించింది. దీన్ని గురువారం సౌత్‌జోన్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి అందుకుంటున్నారు. ఎన్నో ఏళ్ల క్రితమే ఘనవ్యర్థాలు, పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణలో వినూత్న కార్యక్రమాలు అమలు చేశారు. స్వచ్ఛ భారత్‌ ప్రారంభానికి ముందే గతంలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమీర్‌ఖాన్‌ నిర్వహించిన టీవీ షో ‘సత్యమేవజయతే’కార్యక్రమంలో జనార్దన్‌రెడ్డి చేపట్టిన కార్యక్రమాలు జాతీయస్థాయిలో గుర్తింపుపొందడంతో ఆయనను అభినందించి, సన్మానించారు. జీహెచ్‌ఎంసీకి వచ్చాక స్వల్ప సమయంలోనే దాదాపు నాలుగువేల పాఠశాలల్లో స్వచ్ఛ కార్యక్రమాలపై విద్యార్థులకు అవగాహన కలిగించారు. జీహెచ్‌ఎంసీ పారిశుధ్య కార్మికుడు వెంకటయ్య కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి స్వచ్ఛ అవార్డును అందుకున్నారు.

స్వచ్ఛ సైన్యం..
బహిరంగ ప్రదేశాల్లో చెత్తకుప్పలు తొలగించే కార్యక్రమాన్ని చేపట్టి 1,116 ప్రాంతాల్లో తొలగించి, ముగ్గులు, రంగులతో తీర్చిదిద్దారు. తిరిగి రోడ్లపై చెత్త వేయకుండా స్థానికులతో...స్వచ్ఛ వాలంటీర్లతో స్వచ్ఛ సైన్యాన్ని ఏర్పాటు చేశారు. బహిరంగంగా చెత్త వేసే వారిని వీరు అడ్డుకుంటారు. కాలనీల్లోని పారిశుధ్య కార్మికుల వివరాలు ప్రజలకు తెలిసేలా ‘పరిచయం’పేరిట వారి వివరాలు గోడలపై రాశారు.

అత్యవసర బాధలనుంచి విముక్తి..
పేరు గొప్ప నగరమే కానీ.. యూరినల్స్‌కు వెళ్దామంటే నరకయాతన. కనుచూపు మేరలో అవి కనిపించకపోవడంతో ఎక్కడపడితే అక్కడే పని కానిచ్చేస్తున్నారు. ఈ పరిస్థితిని నివారించేందుకు అవసరమైనన్ని టాయ్‌లెట్ల ఏర్పాటుకు జీహెచ్‌ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మహిళల కోసమే ప్రత్యేకంగా ఆధునికమైన వంద షీ–టాయ్‌లెట్లను మూడు మాసాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద నిధులిచ్చేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. నిర్వహణలోపంతో మూతపడ్డ గత అనుభవం దృష్ట్యా వీటిని ఏర్పాటు చేసే సంస్థలే కనీసం రెండు సంవత్సరాలు నిర్వహించేలా టెండరు నిబంధనలు మార్చారు. ఎన్ని అవసరమైతే అన్ని టాయ్‌లెట్లను వచ్చే ఏడాదిలోగా ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement