Bio-Tech Private Limited Industry
-
బయోటెక్ ఫ్యాక్టరీలో ప్రమాదం
దేవరపల్లి: ఓ బయోటెక్ ఫ్యాక్టరీలో ఫిల్టర్ ట్యాంకును శుభ్రం చేసేందుకు దిగిన ఇద్దరు కార్మికులు ఊపిరాడక మృతి చెందారు. మరో కార్మికుడు అస్వస్థతకు గురయ్యాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి–గోపాలపురం రోడ్డులోని పరమేశు బయోటెక్ ఫ్యాక్టరీలో గురువారం జరిగింది. స్థానిక ఎస్సై కె.శ్రీహరి తెలిపిన వివరాలు.. ఒడిశాకు చెందిన డోమా బీరువా(24), కొవ్వూరు మండలం తిరుగుడుమెట్టకు చెందిన గాజుల శ్రీను(25) పరమేశ్ బయోటెక్ ఫ్యాక్టరీలో కార్మికులుగా పనిచేస్తున్నారు. ఫ్యాక్టరీలో చాలాకాలంగా వాడుకలో లేని ట్యాంకును శుభ్రం చేసేందుకు డోమా గురువారం లోపలికి దిగాడు. విషవాయువు వల్ల గాలి ఆడకపోవడంతో కళ్లు తిరిగి పడిపోయాడు. ఇది గమనించిన శ్రీను.. డోమాను రక్షించేందుకు లోపలికి వెళ్లాడు. తను కూడా ఊపిరాడక లోపలే పడిపోయాడు. వారిద్దరినీ కాపాడేందుకు ప్రయత్నించిన మరో కార్మికుడు అనిల్‌సింగ్ కూడా స్పృహ కోల్పోయాడు. ఇది గుర్తించిన కార్మికులంతా ట్యాంకు లోపల పడిపోయిన ముగ్గురినీ తాడు సాయంతో బయటకు తీసుకువచ్చారు. యాజమాన్యం ఆదేశాల మేరకు వారిని చికిత్స కోసం కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాజుల శ్రీను, డోమా మార్గం మధ్యలోనే మృతి చెందగా అనిల్‌ను మెరుగైన చికిత్స కోసం రాజమండ్రికి తరలించారు. అనిల్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు. అధికారులు ఫ్యాక్టరీకి చేరుకొని విచారణ జరుపుతున్నారు. ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని ఆర్డీవో మల్లిబాబు తెలిపారు. ఫ్యాక్టరీలో కార్మికులకు కల్పించిన సదుపాయాలు, రక్షణ పరికరాలను పరిశీలిస్తున్నామన్నారు. మొక్కజొన్న నుంచి పాలు ఫిల్టర్ చేసే ఈ ట్యాంకును చాలా కాలంగా వాడటం లేదని తెలిసింది. -
నేడు తూప్రాన్‌కు సీఎం కేసీఆర్
-
నేడు తూప్రాన్‌కు సీఎం కేసీఆర్
తూప్రాన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మరోసారి జిల్లాలో పర్యటించనున్నారు. తూప్రాన్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో గల పారిశ్రామిక వాడలోని బయో టెక్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో నూతనంగా నిర్మిస్తున్న ఇన్సూమేన్ ఫార్మా (వ్యాక్సిన్)కి కంపెనీకి భూమి పూజ చేయనున్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి నేరుగా హెలీకాఫ్టర్లో ముప్పిరెడ్డిపల్లికి చేరుకోనున్న నేపథ్యంలో బుధవారం కలెక్టర్ రాహుల్ బొజ్జా, ఎస్పీ సుమతి ఏర్పాట్లను పరిశీలించారు. హెలీకాఫ్టర్ ల్యాండింగ్ కోసం పరిశ్రమ సమీపంలోని ఏపీఐఐసీ భూముల్లో ఏర్పాటు చేస్తున్న హెలీప్యాడ్‌ను వారు పరిశీలించారు. అనంతరం ముఖ్యమంత్రి భూమి పూజ చేయనున్న స్థలాన్ని కూడా పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్యక్రమానికి సంబంధించిన వివరాలను పరిశ్రమ ప్రతినిధులను అడిగితెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ సుమతి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా తగిన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే పోలీసులను మోహరించినట్లు వెల్లడించారు. ‘గడా’ అధికారి హన్మంతరావు, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, స్థానిక డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ సంజయ్‌కుమార్, ఎస్ఐ సంతోష్‌కుమార్, తహసీల్దార్ స్వామి, ఎంపీడీఓ కరుణశీల, ఆర్అండ్బి అధికారులు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఎలక్షన్‌రెడ్డి తదితరులు సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన వారిలో ఉన్నారు. రూ.500 కోట్లతో ఫార్మా కంపెనీ ఏర్పాటు ముప్పిరెడ్డిపల్లిలోని ఏపీఐఐసీ భూముల్లో 2007 సంవత్సరంలో శాంతా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అప్పట్లో 40 ఎకరాల భూమిని కేటాయించారు. ఇప్పటికే ఇందులో పరిశ్రమ నెలకొల్పగా, అందులో మరో ఎనిమిది ఎకరాల స్థలంలో నూతన ప్లాంట్‌ను నిర్మిస్తున్నట్లు ఆ పరిశ్రమ ప్రతినిధి తెలిపారు. ఇందుకుగాను రూ.500 కోట్ల పెట్టుబడి అవసరమన్నారు. ఈ పరిశ్రమ ద్వారా సుమారు 500 మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని వివరించారు.