నేడు తూప్రాన్‌కు సీఎం కేసీఆర్
తూప్రాన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మరోసారి జిల్లాలో పర్యటించనున్నారు. తూప్రాన్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో గల పారిశ్రామిక వాడలోని బయో టెక్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో నూతనంగా నిర్మిస్తున్న ఇన్‌సూమేన్ ఫార్మా (వ్యాక్సిన్)కి కంపెనీకి భూమి పూజ చేయనున్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి నేరుగా హెలీకాఫ్టర్‌లో ముప్పిరెడ్డిపల్లికి చేరుకోనున్న నేపథ్యంలో బుధవారం కలెక్టర్ రాహుల్ బొజ్జా, ఎస్పీ సుమతి ఏర్పాట్లను పరిశీలించారు.
హెలీకాఫ్టర్ ల్యాండింగ్ కోసం పరిశ్రమ సమీపంలోని ఏపీఐఐసీ భూముల్లో ఏర్పాటు చేస్తున్న హెలీప్యాడ్‌ను వారు పరిశీలించారు. అనంతరం ముఖ్యమంత్రి భూమి పూజ చేయనున్న స్థలాన్ని కూడా పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్యక్రమానికి సంబంధించిన వివరాలను పరిశ్రమ ప్రతినిధులను అడిగితెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ సుమతి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా తగిన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
ఇప్పటికే పోలీసులను మోహరించినట్లు వెల్లడించారు. ‘గడా’ అధికారి హన్మంతరావు, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, స్థానిక డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ సంజయ్‌కుమార్, ఎస్‌ఐ సంతోష్‌కుమార్, తహసీల్దార్ స్వామి, ఎంపీడీఓ కరుణశీల, ఆర్‌అండ్‌బి అధికారులు, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఎలక్షన్‌రెడ్డి తదితరులు సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన వారిలో ఉన్నారు.
రూ.500 కోట్లతో ఫార్మా కంపెనీ ఏర్పాటు
ముప్పిరెడ్డిపల్లిలోని ఏపీఐఐసీ భూముల్లో 2007 సంవత్సరంలో శాంతా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అప్పట్లో 40 ఎకరాల భూమిని కేటాయించారు. ఇప్పటికే ఇందులో పరిశ్రమ నెలకొల్పగా, అందులో మరో ఎనిమిది ఎకరాల స్థలంలో నూతన ప్లాంట్‌ను నిర్మిస్తున్నట్లు ఆ పరిశ్రమ ప్రతినిధి తెలిపారు. ఇందుకుగాను రూ.500 కోట్ల పెట్టుబడి అవసరమన్నారు. ఈ పరిశ్రమ ద్వారా సుమారు 500 మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని వివరించారు.