Biodiversity Council
-
ఆలోచనలు భేష్... ఆచరణ?
అవును. నాలుగేళ్ళ చర్చోపచర్చల తర్వాత ప్రపంచ జీవవైవిధ్య పరిరక్షణ ఒప్పందం (సీబీడీ)పై ఆలోచన ముందుకు కదిలింది. ఏకంగా 190కి పైగా దేశాలు ఈ ఒప్పందం చేసుకోవడం, ఘనంగా 23 భారీ లక్ష్యాలు అందులో ప్రస్తావించడం కచ్చితంగా చరిత్రాత్మకం. ఈ భారీ ఆలోచనకు కీలక మైన ఆచరణే ఇక మిగిలింది. కెనడాలోని మాంట్రియల్లో ఐక్యరాజ్య సమితి సారథ్యంలో జరిగిన జీవవైవిధ్యంపై భాగస్వామ్యపక్షాల 15వ సదస్సు (కాప్15) అక్షరాలా ఒక మైలురాయి. అయితే, ఐరాస పెద్దలే అన్నట్టు అన్నీ సత్వరం అమలుచేసి, పురోగతి సాధిస్తేనే విజయం సాధ్యం. అందుకే, ఈ చరిత్రాత్మక పరిణామంపై ఏకకాలంలో ఇటు ఆశలూ, అటు అనుమానాలూ తలెత్తుతున్నాయి. డిసెంబర్ 7 నుంచి 19 వరకు జరిగిన ‘కాప్15’లో 196 దేశాల అధికారిక ప్రతినిధులు, 10 వేల మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. మొన్న నవంబర్ 20న ఈజిప్ట్‌లో 27వ ఐరాస పర్యావరణ సదస్సు (కాప్ 27) ముగిసిందో లేదో, ఈ జీవవైవిధ్య సదస్సు జరిగింది. ప్రకృతిని కాపాడకుండా, పునరుద్ధరించకుండా భూతాపోన్నతిని 1.5 డిగ్రీలకే పరిమితం చేయడం కుదిరేపని కాదు. అలా జీవవైవిధ్య సదస్సులు కీలకం. అయితే తుపానులు, కరిగిపోతున్న హిమానీనదాలతో పర్యావరణ సంక్షోభం కళ్ళకు కట్టినట్టు, జీవవైవిధ్య నష్టం తెలియదు. అందుకే, తీవ్రంగా పరిగణించక తప్పు చేస్తుంటారు. ఈ సదస్సులకు దేశాధినేతలెవరూ హాజరు కారు. సీబీడీ నిబంధనలు, లక్ష్యాలపై పర్యవేక్షణా తక్కువే. వెరసి పర్యావరణ సదస్సులంత ప్రచారం, రాజకీయ పటాటోపం కనిపించవు. నిజానికి, మూడు దశాబ్దాల క్రితమే 1992లో రియో డిజెనీరోలో జరిగిన ధరిత్రి సదస్సులోనే 150 మంది ప్రభుత్వ నేతలు సీబీడీపై తొలిసారి సంతకాలు చేశారు. జీవవైవిధ్య పరిరక్షణ దాని ప్రధాన ఉద్దేశం. ఆపైన ఆ ఒప్పందానికి మొత్తం 196 దేశాలు ఆమోదముద్ర వేశాయి. అమెరికా మాత్రం ఆమోదించలేదు. అలాగని సంక్షోభం లేదని కాదు. రానున్న రోజుల్లో 34 వేల వృక్ష జాతులు, 5200 జంతు జాతులు అంతరించిపోతాయని ఐరాస అంచనా. ప్రపంచంలోని పక్షిజాతుల్లో ప్రతి ఎనిమిదింటిలో ఒకటి కనుమరుగవుతుందట. అలాగే, భౌగోళిక జీవవైవిధ్యానికి ఆలవాలమైన సహజ అరణ్యాల్లో దాదాపు 45 శాతం ఇప్పుడు లేవు. ఇందులో అధికభాగం గత శతాబ్దిలో సాగిన విధ్వంసమే. తలసరి కర్బన ఉద్గారాల పెరుగుదల, ఉష్ణోగ్రతల్లో మార్పులకు ఇది కారణమని గుర్తించట్లేదు. అదే సమస్య. ఈ నేపథ్యంలో జీవవైవిధ్య నష్టాన్ని నివారించి, 2030 నాటి కల్లా ప్రకృతిని మళ్ళీ దోవలో పెట్టడమే లక్ష్యంగా తాజా ‘కాప్15’ జరిగింది. పర్యావరణ మార్పులపై 2015లో జరిగిన ప్యారిస్ ఒప్పందం ఎలాంటిదో, జీవవైవిధ్య పరిరక్షణకు ఈ ‘కాప్15’ మాంట్రియల్ ఒప్పందం అలాంటిదని విశ్లేషకుల మాట. పారిశ్రామికీక రణకు ముందు నాటి ఉష్ణోగ్రతలతో పోలిస్తే భూతాపోన్నతి 2 డిగ్రీల సెల్సియస్ మించరాదనీ, అసలు 1.5 డిగ్రీల లోపలే ఉండేలా ప్రయత్నించాలనీ దేశాలన్నీ అప్పట్లో ప్యారిస్ ఒప్పందంలో ఏకగ్రీవంగా అంగీకరించాయి. ఇప్పుడీ మాంట్రియల్ ఒప్పందంలో భాగంగా ‘30కి 30’ అంటూ, 2030 నాటికి 30 శాతం భూ, సముద్ర ప్రాంతాలను పరిరక్షించాలని నిర్దేశించుకున్నాయి. జీవ వైవిధ్య పరిరక్షణకు 2030కల్లా 20 వేల కోట్ల డాలర్లు సమీకరించాలని తీర్మానించాయి. పేదదేశాలకు చేరే మొత్తాన్ని 2025 కల్లా ఏటా కనీసం 2 వేల కోట్ల డాలర్లకు పెంచాలని యోచిస్తున్నాయి. విఫలమైన 2010 నాటి జీవవైవిధ్య లక్ష్యాల స్థానంలో మొత్తం 23 లక్ష్యాలను ఈ సదస్సు నిర్ణయించింది. అయితే, వివిధ దేశాలు తమ పరిస్థితులు, ప్రాధాన్యాలు, సామర్థ్యాలకు తగ్గట్టుగా వాటిని మలుచుకొనే స్వేచ్ఛనిచ్చారు. ఇది భారత్ చేసిన సూచనే. ఇక, వర్ధమాన దేశాల్లో వ్యవ సాయ, మత్స్యసబ్సిడీలు, పురుగుమందుల వినియోగంపై వేటు పడకుండా భారత్, జపాన్ తది తర దేశాలు కాచుకున్నాయి. అయితే, లోటుపాట్లూ లేకపోలేదు. ప్రపంచంలోనే పెద్ద వర్షారణ్యా లున్న కాంగో లాంటి ఆఫ్రికన్ దేశాలు చమురు, సహజవాయు అన్వేషణ ప్రమాదంలో పడ్డాయి. అవి కొన్ని అంశాల్లో అసమ్మతి స్వరం వినిపించినా ఈ కొత్త ఒప్పందాన్ని ఖరారు చేశారు. వచ్చే 2030కి సహజ జీవ్యావరణ వ్యవస్థలు 5 శాతం వృద్ధి చెందేలా చూడాలన్న లక్ష్యాన్ని చివరలో తీసేయడమూ నష్టమే. నిర్దిష్ట లక్ష్యాలు లేకుంటే ఆశయాలు మంచివైనా ఆచరణలో విఫలమవుతాం. ‘కాప్–15’ జీవవైవిధ్య ఒప్పందపు సంకల్పంతోనే సరిపోదు. ఒప్పందానికి ఊ కొట్టిన దేశాలు తీరా దాన్ని పాటించకున్నా చర్యలు తీసుకొనే అవకాశం లేదు. అందుకే, 23 లక్ష్యాల సాధనపై అను మానం, ఆందోళన. గతంలో జీవవైవిధ్య ప్రణాళికల అమలులో ప్రపంచ దేశాలు ఘోరంగా విఫల మయ్యాయి. 2010లో జపాన్‌లోని ఐచీలోనూ ఇలాగే 20 లక్ష్యాలను 2020 నాటికల్లా అందుకోవా లని పెట్టుకున్నాం. కానీ, వాటిలో ఒక్కటీ సాధించలేదు. మరోసారి అలాంటి అప్రతిష్ఠ రాకూడదు. తక్షణం కార్యరంగంలోకి దూకాలి. పరిమితవనరుల్ని యథేచ్ఛగా వాడుతూ, కర్బన ఉద్గారా లకు కారణమవుతున్న ధనిక పాశ్చాత్య ప్రపంచానికి ముకుతాడు వేయాలి. జంతుజాలాన్నీ, పశు పోషణతో అడవుల నరికివేత సాగుతున్న అమెజాన్ వర్షారణ్యాల్నీ కాపాడుకోవాలంటే ఆ దేశాల ఆహారపుటలవాట్లు మారాలి. మూలవాసుల హక్కుల్ని గౌరవించాలన్న మాటా ఆహ్వానించదగ్గదే. దశాబ్దాల క్రితమే చేయాల్సిన పనికి ఇప్పటికైనా నడుం కట్టడం మంచిదే. ప్రపంచం కలసికట్టుగా నడవాల్సిన వేళ కెనడా, చైనాల సహ ఆతిథ్యంలో ఈ సదస్సు, ఒప్పందం శుభపరిణామాలే! -
AP: జీవవైవిధ్యం ఉట్టిపడేలా.. ప్రతి ఉమ్మడి జిల్లాలో బయోడైవర్సిటీ పార్కు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక జీవవైవిధ్య (బయోడైవర్సిటీ) పార్కు ఏర్పాటు కానుంది. తద్వారా ప్రజల్లో పర్యావరణం పట్ల ఆసక్తిని పెంచడమే కాకుండా ప్రకృతి పరిరక్షణ ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, కడపలో నాలుగు పార్కుల్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర జీవవైవిధ్య మండలి ప్రణాళిక రూపొందించింది. చదవండి: AP: హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక పర్యవేక్షణ వీటి ఏర్పాటుకు ఇప్పటికే ఆమోదం లభించింది. విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్‌లో 6 ఎకరాలు, కాకినాడలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ క్యాంపస్‌లో 7.5 ఎకరాలు, తిరుపతిలోని తుడా పరిధిలో ఉన్న వెంకటాపురంలో 6 ఎకరాలు, కడప నగరంలో ఏపీఐఐసీకి చెందిన 6 ఎకరాలను ఇప్పటికే పార్కుల కోసం కేటాయించారు. ఆ భూములను త్వరలో జీవవైవిధ్య మండలికి అప్పగించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. భూమి అప్పగించిన వెంటనే పార్కుతోపాటు మ్యూజియం ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. పార్కుకు రూ.కోటి, మ్యూజియానికి రూ.50 లక్షల చొప్పున జీవవైవిధ్య మండలి మంజూరు చేయనుంది. ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ పర్యవేక్షణలో వీటిని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. మిగిలిన జిల్లాల్లోనూ పార్కులు, మ్యూజియంల ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయించాలని జీవవైవిధ్య మండలి ఇప్పటికే కోరింది. కర్నూలు, అమరావతి, అనంతపురం జిల్లాల్లోనూ త్వరలో భూమిని కేటాయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
జీవవైవిద్య మండలికి నిపుణుల కమిటీ
హైదరాబాద్ సిటీ: జీవ వైవిద్య మండలికి నిపుణుల కమిటీలను ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. జీవి వైవిధ్య మండలి పరిరక్షణకు 8 నిపుణుల కమిటీలను ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులను రాష్ట్రప్రభుత్వం వెల్లడించింది. వన్యమృగ సంరక్షణకు, జంతు, చేపల, ఆగ్రో, సంస్కృతి, ఆస్తుల పరిరక్షణ, వైద్య సంబంధ మొక్కల పరిరక్షణ, చైతన్య పరిచే కమిటీలను ఏర్పాటుచేసింది. ఈ కమిటీల్లో వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నది. -
నడ్డి విరిచే గొడ్డు చాకిరీకి స్వస్తి!
పత్తి సాగులో బండ చాకిరీకి ‘బ్రష్ ఈజీ’ పరికరంతో చెక్ రూ. 100-150 ఖర్చుతో రైతులే తయారు చేసుకోవచ్చు పురుగుమందు పూత చాలా సులభం.. భారీగా కూలి ఖర్చు ఆదా బీటీ పత్తి విత్తనాలతో శనగపచ్చ పురుగు బెడద నుంచి ఉపశమనం లభించినప్పటికీ.. రసంపీల్చే పురుగులు పత్తి రైతును పీల్చి పిప్పి చేస్తున్నాయి. పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ పురుగుల నివారణకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. పురుగుమందులను పిచికారీ చేయడం వల్ల వాతావరణంకలుషితమవ్వడమే కాకుండా, పంటకు మేలుచేసే మిత్రపురుగులు కూడా నాశనమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పిచికారీకి ప్రత్యామ్నాయంగా లేత దశలో పత్తి మొక్క కాండానికి పురుగుమందును పూయడం మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పత్తి విత్తిన తర్వాత 20 రోజులకు, 40 రోజులకు, 60 రోజులకోసారి మొక్కల కాండానికి పురుగుమందును పూస్తే రసం పీల్చే పురుగుల బెడద నుంచి పంటను రక్షించుకోవచ్చని చెబుతున్నారు. ఈ మూడు దఫాల్లో పిచికారీకి ఎకరానికి 1.5 నుంచి 2 లీటర్ల వరకు మోనోక్రోటోఫాస్‌ను వాడుతుంటారు. మొక్కల కాండానికి మందు పూసే పద్ధతిలో అయితే మూడు దఫాలకు కలిపి పావు లీటరు మందు సరిపోతుంది. పిచికారీ కన్నా ఈ పద్ధతి సత్ఫలితాలిచ్చినప్పటికీ, మొక్క మొక్కకూ వంగి మందు పూయాల్సి రావడం పెద్ద సమస్యగా మారింది. పని మందకొడిగా నడవడం వల్ల ఎకరంలో పంటకు ఒకసారి మందు పూతకు నలుగురు కూలీల అవసరముంటుంది. వంగి మందు పూయడం కష్టం కాబట్టి ఈ పనంటేనే కూలీలు రాని పరిస్థితి నెలకొంది. 2 గంటల్లోనే ఎకరం మొక్కలకు మందు పూత ఈ నేపథ్యంలో ఆదిలాబాద్‌కు చెందిన కీటకశాస్త్ర నిపుణుడు, రాష్ట్ర జీవవైవిధ్య మండలి ప్రాంతీయ సమన్వయకర్త డాక్టర్ పుల్లూరి రమేష్ సులువుగా పని జరిగేందుకు ఉపయోగపడే ‘బ్రష్ ఈజీ’ అనే పరికరాన్ని రూపొందించారు. దీన్ని చేతబట్టుకొని, వంగనవసరం లేకుండానే, సులువుగా మొక్కకాండానికి రసాయనాన్ని పూయవచ్చు. ఈ పరికరంతో ఒకే ఒక్క మనిషి గంటన్నర- రెండు గంటల్లోనే ఒక ఎకరంలో పత్తి మొక్కలకు సులభంగా మందు పూయవచ్చు. తద్వారా మందు పూత కూలి ఖర్చు భారీగా తగ్గుతుంది. పరికరం తయారీ సులభం! ‘బ్రష్ ఈజీ’ పరికరాన్ని రూ. 100-150ల ఖర్చుతోనే సులువుగా తయారు చేసుకోవచ్చు. 1.9 సెం.మీ. వెడల్పు, 90 సెం.మీ. పొడవు ఉన్న పీవీసీ పైపును తీసుకోవాలి. పైపునకు ఒక వైపు చివరన చిన్న బెజ్జం ఉన్న మూతను బిగించాలి. దాని లోనికి దూదితో చేసిన వొత్తిని పెట్టాలి. రెండో వైపు నుంచి పైపులోనికి రసం పీల్చే పురుగులను నివారించే మోనోక్రొటోఫాస్ రసాయనిక పురుగుమందును 1:4 నిష్పత్తిలో నీటిలో కలిపి పోయాలి. తర్వాత పైపునకు మూతను బిగించాలి. దీన్ని చేతబట్టుకొని పత్తి పొలంలో సాళ్ల మధ్య నడుచుకుంటూ వెళ్తూ.. మొక్కల కాండానికి పైపు చివరన ఉన్న దూదివొత్తి ద్వారా స్రవించే పురుగులమందును పూస్తే సరిపోతుంది. కాండానికి ఒక చుక్క మందును పూసినా సరిపోతుందని డా. రమేష్ చెప్పారు. ఈ పరికరం వల్ల కూలీల ఖర్చు చాలా వరకు తగ్గడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. - పాత బాలప్రసాద్, సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ రైతులే తయారు చేసుకోవచ్చు! బ్రష్ ఈజీ పరికరం వాడితే కూలీల కొరత సమస్య తీరుతుంది. పురుగుమందుల వృథా జరగదు. సాగు వ్యయం తగ్గుతుంది. పంటకు మేలు చేసే మిత్రపురుగులకు ఎలాంటి హానీ జరగదు. పురుగుల మందును మొక్కలకు పూసే పరికరాన్ని స్వల్ప ఖర్చుతో రైతులే స్వయంగా తయారు చేసుకోవచ్చు. ఈ పరికరాలు దుకాణాల్లోనూ అందుబాటులో ఉన్నాయి. - డాక్టర్ పుల్లూరి రమేష్ (98497 54309), ప్రాంతీయ సమన్వయకర్త, రాష్ర్ట జీవవైవిధ్య మండలి నడుము నొప్పి పీడ విరగడ! నాకున్న ఐదెకరాల్లో పత్తిని సాగు చేస్తున్న. బ్రష్ ఈజీ పరికరంతో మొక్కల మొదళ్లకు పురుగుమందును పూస్తున్నం. కూలీలకు నడుము నొప్పి పీడ పోయింది. పురుగుమందుల ఖర్చూ తగ్గింది. తక్కువ సమయం లోనే పని పూర్తవుతున్నది. - కుర్మ లక్ష్మణ్ (99498 84642), పత్తి రైతు, పొన్నారి, ఆదిలాబాద్ జిల్లా