సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక జీవవైవిధ్య (బయోడైవర్సిటీ) పార్కు ఏర్పాటు కానుంది. తద్వారా ప్రజల్లో పర్యావరణం పట్ల ఆసక్తిని పెంచడమే కాకుండా ప్రకృతి పరిరక్షణ ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, కడపలో నాలుగు పార్కుల్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర జీవవైవిధ్య మండలి ప్రణాళిక రూపొందించింది.
చదవండి: AP: హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక పర్యవేక్షణ
వీటి ఏర్పాటుకు ఇప్పటికే ఆమోదం లభించింది. విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్‌లో 6 ఎకరాలు, కాకినాడలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ క్యాంపస్‌లో 7.5 ఎకరాలు, తిరుపతిలోని తుడా పరిధిలో ఉన్న వెంకటాపురంలో 6 ఎకరాలు, కడప నగరంలో ఏపీఐఐసీకి చెందిన 6 ఎకరాలను ఇప్పటికే పార్కుల కోసం కేటాయించారు. ఆ భూములను త్వరలో జీవవైవిధ్య మండలికి అప్పగించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
భూమి అప్పగించిన వెంటనే పార్కుతోపాటు మ్యూజియం ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. పార్కుకు రూ.కోటి, మ్యూజియానికి రూ.50 లక్షల చొప్పున జీవవైవిధ్య మండలి మంజూరు చేయనుంది. ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ పర్యవేక్షణలో వీటిని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. మిగిలిన జిల్లాల్లోనూ పార్కులు, మ్యూజియంల ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయించాలని జీవవైవిధ్య మండలి ఇప్పటికే కోరింది. కర్నూలు, అమరావతి, అనంతపురం జిల్లాల్లోనూ త్వరలో భూమిని కేటాయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment