సాక్షి, అమరావతి: పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను 13 నుంచి 26కు పెంచడంతో సరికొత్త చరిత్ర నమోదవుతోంది. నూతన జిల్లాల భౌగోళిక స్వరూపాన్ని పరిశీలిస్తే పలు అంశాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఆ వివరాలివీ..
కరువు సీమకు కడలి
ఇప్పటివరకు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తొమ్మిది కోస్తా జిల్లాలకే తీర ప్రాంతం పరిమితం కాగా కొత్త జిల్లాల ఏర్పాటుతో రాయలసీమకు కూడా ఆ అవకాశం దక్కింది. తాజాగా రాయలసీమలోని నాలుగు జిల్లాలు ఎనిమిది అవుతున్నాయి. ఇందులో తిరుపతి జిల్లాకు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో తీరప్రాంతం ఉన్న సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని కలిపారు. సూళ్లూరుపేటతో పాటు సముద్రతీరంలో ఉన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం కూడా తిరుపతి జిల్లాలో కలుస్తోంది. మరోవైపు ఇప్పటి వరకు సముద్ర తీర ప్రాంతాన్ని కలిగివున్న గుంటూరు జిల్లా ప్రస్తుతం తీర ప్రాంతం లేని జిల్లాగా నిలుస్తోంది.
రెండు గిరిజన జిల్లాలు
ఇప్పటిదాకా రాష్ట్రంలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా జిల్లాలు లేవు. జిల్లాల పునర్ విభజన తర్వాత గిరిజనుల కోసం రెండు జిల్లాలు ఏర్పాటయ్యాయి. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలను గిరిజనుల కోసం ఏర్పాటు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా పేరును తొలి నోటిఫికేషన్‌లో మన్యం జిల్లాగా ప్రకటించగా స్థానికుల వినతిమేరకు పార్వతీపురం మన్యం జిల్లాగా మార్చారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు, ఉభయ గోదావరి జిల్లాల్లో గిరిజన ప్రాంతాలుండగా వీటికోసం సమీకృత గిరిజన అభివృద్ధి ఏజెన్సీలు (ఐటీడీఏ) ఏర్పాటయ్యాయి.
ఆంధ్ర కేసరితో ఆరంభం..
ప్రస్తుతం ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు, వైఎస్సార్ కడప జిల్లాలు ప్రముఖుల పేర్లతో ఉండగా జిల్లాల విభజనతో ఇది ఏడుకు పెరిగింది. స్వాతంత్ర సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు సేవలను గుర్తిస్తూ 1972లో తొలిసారిగా ఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు. ఆమరణ నిరాహార దీక్షతో ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన పొట్టి శ్రీరాములు పేరును 2008లో నెల్లూరు జిల్లాకు పెట్టారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును 2010లో కడప జిల్లాకు పెట్టారు. బ్రిటీషు వారిని ఎదిరించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో పాడేరు కేంద్రంగా గిరిజన జిల్లా ఏర్పాటైంది. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు పేరుతో విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటైంది. ప్రఖ్యాత వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమయ్య పేరుతో రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా, పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లాలు ఏర్పాటయ్యాయి.
ఐదు అత్యధిక వర్షపాత జిల్లాలు..
కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అత్యధికంగా 1,400 మి.మీ సగటు వర్షపాతంతో అల్లూరి సీతారామరాజు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. తర్వాత స్థానాల్లో తిరుపతి జిల్లా 1,300 మి.మీ, కోనసీమ జిల్లా 1,200 మి.మీ, పార్వతీపురం మన్యం 1150 మి.మీ, విశాఖపట్నం 1,100 మి.మీ వరకు ఉన్నట్లు అంచనా.
(చదవండి: కోవిడ్ తర్వాత ఊపందుకున్న స్థిరాస్తి వ్యాపారం... రాష్ట్ర ప్రభుత్వం రికార్డు)
Comments
Please login to add a commentAdd a comment