biological son
-
అయ్యా... నీతులు ధనుష్‌కి చెప్పండి
సాక్షి, చెన్నై : తన ఫ్యాన్స్‌తో భేటీ అయి బిజీగా ఉన్న తలైవాకు ఊహించని ప్రశ్న ఎదురైంది. రెండు రోజుల క్రితం సమావేశంలో మాట్లాడుతూ... ఏ మనిషికైనా కుటుంబమే ముఖ్యమంటూ తన అభిమానులకు రజనీ సూచించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ధనుష్ తండ్రినంటూ ఆ మధ్య కేసు వేసిన వ్యక్తి మళ్లీ మీడియా ముందుకు వచ్చాడు. తన కొడుకును తన దగ్గరికి పంపిచేయాలంటూ రజనీని అతను విజ్ఞప్తి చేస్తున్నాడు. ‘‘ధనుష్ మా కుమారుడే అనే విషయం రజనీకాంత్ కు కూడా తెలుసు. అయినా స్పందించకపోవటం దారుణం’’ అని కదిరేషన్ సంచలన వ్యాఖ్య చేశాడు. వేలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడిన కదిరేశన్ ఈ మేరకు రజనీకి ఓ లేఖ పంపుతున్నట్టు చెబుతూ.. మీడియాకు కూడా చూపించారు. తన భార్య మీనాక్షి తీవ్ర అనారోగ్యంతో ఉందని, తమ కుమారుడు తమకు అండగా లేడన్న దిగులుతో తాము కుంగిపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు ధనుష్ నుంచి పైసా అక్కర్లేదని.. తమకు తల్లిదండ్రులుగా అంగీకరిస్తే అంతే చాలని ఆయన అంటున్నాడు. తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవాలని చెప్పిన రజనీ... ఇదే విషయాన్ని తమ కుమారుడు అయిన ధనుష్ కు కూడా చెప్పాలని కదిరేషన్ హితవు పలికాడు. ఎలాగైనా తమ వద్దకు వచ్చేలా రజనీ చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ధనుష్ తన కుమారుడేనంటూ మేలూరు కోర్టులో కదిరేశన్ కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ విచారణకు సంబంధించి ధనుష్ స్టే తెచ్చుకుని, ఆ తర్వాత కేసు నుంచి పూర్తిగా బయటపడ్డాడు. -
కొడుకే కాదన్నాడు.. ఇప్పుడు టికెట్ కోరాడు!
-
కొడుకే కాదన్నాడు.. ఇప్పుడు టికెట్ కోరాడు!
ఒకప్పుడు అసలు తన కన్న కొడుకే కాదంటూ కోర్టులలో సైతం గట్టిగా వాదించిన వ్యక్తి, ఇప్పుడు అదే కొడుకు కోసం బీజేపీలో చేరారు. అవును.. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ నారాయణదత్త తివారీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తన కొడుకు రోహిత్ శేఖర్‌తో కలిసి వెళ్లి అతడికి కూడా పార్టీ సభ్యత్వం ఇప్పించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సమక్షంలోనే ఇద్దరూ పార్టీలో చేరారు. ఉత్తరాఖండ్ నుంచి బీజేపీ తరఫున అసెంబ్లీ టికెట్ రోహిత్‌కు ఇప్పించాలన్నది తివారీ ఆశ. అంతకుముందు ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ టికెట్ ఇప్పించాలని ప్రయత్నించినా కుదరకపోవడంతో ఇప్పుడు బీజేపీ పంచన చేరారు. ఎవరీ రోహిత్ రోహిత్ శేఖర్.. నిన్న మొన్నటి వరకు ఈ పేరు తెలుగు మీడియాతో పాటు జాతీయ మీడియాలో కూడా గట్టిగా వినిపించేది. ఎన్డీ తివారీ తన కన్న తండ్రి అంటూ న్యాయపోరాటం చేసి విజయం సాధించిన వ్యక్తే ఈ రోహిత్ శేఖర్. ఒకప్పుడు తన కొడుకు కాదని, డీఎన్ఏ పరీక్షలకు సైతం ఒప్పుకోని తివారీ ఆ తర్వాత మారిపోయారు. అప్పట్లో కోర్టు విచారణలో.. రోహిత్ శేఖర్‌కు తాను జన్మనివ్వలేదని ఆయన నొక్కి చెప్పారు. ఉజ్వల శర్మ(రోహిత్ తల్లి)తో తనకు ఎలాంటి భౌతిక, శారీరక సంబంధమూ లేదని పేర్కొన్నారు. తనపై నమోదైన పితృత్వపు కేసు వెనుక రాజకీయ ప్రత్యర్థుల కుట్ర ఉందని ఆరోపించారు. (రోహిత్‌కు నేను జన్మనివ్వలేదు..: ఎన్డీ తివారీ) ఇన్ని చేసిన తివారీ.. ఆ తర్వాతి కాలంలో మాత్రం ఆయన దిగివచ్చారు. 2014 మే 4వ తేదీన మీడియా సమావేశం పెట్టి మరీ రోహిత్ తన కన్న కొడుకుని ప్రకటించారు. ‘నేను అతడి(రోహిత్)ని నా కుమారునిగా అంగీకరిస్తున్నా. అతని డీఎన్ఏ నా డీఎన్ఏ సరిపోలడంతో రెండేళ్ల క్రితమే ఈ విషయం నిర్ధారణ అయ్యింది. దీనిపై ఇక ఏ వివాదమూ ఉండదని భావిస్తున్నా’ అని అప్పట్లో తివారీ చెప్పారు. (రోహిత్ నా కుమారుడే.. : ఎన్డీ తివారీ)