ఒకప్పుడు అసలు తన కన్న కొడుకే కాదంటూ కోర్టులలో సైతం గట్టిగా వాదించిన వ్యక్తి, ఇప్పుడు అదే కొడుకు కోసం బీజేపీలో చేరారు. అవును.. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ నారాయణదత్త తివారీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తన కొడుకు రోహిత్ శేఖర్‌తో కలిసి వెళ్లి అతడికి కూడా పార్టీ సభ్యత్వం ఇప్పించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సమక్షంలోనే ఇద్దరూ పార్టీలో చేరారు. ఉత్తరాఖండ్ నుంచి బీజేపీ తరఫున అసెంబ్లీ టికెట్ రోహిత్‌కు ఇప్పించాలన్నది తివారీ ఆశ. అంతకుముందు ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ టికెట్ ఇప్పించాలని ప్రయత్నించినా కుదరకపోవడంతో ఇప్పుడు బీజేపీ పంచన చేరారు.