బయోనిక్ 'హీరో ఆర్మ్'ని పొందిన అతిపిన్న వయస్కురాలు!
ఏ తల్లిదండ్రులైన పిల్లకు ది బెస్ట్ గిఫ్ట్‌లు ఇవ్వాలనే చూస్తారు. తమ పిల్లలు వాటిని చూసి ఎంతో సంతోపడటమే గాక ఎప్పటికీ మర్చిపోకూడదని కోరుకుంటారు. ఓ తల్లిగా లేదా తండ్రిగా వారి మనుసులను గెలుచుకోవాలనే ఆరాట పడతారు. ఇక్కడ కూడా అలానే ఓ తల్లి పుట్టుకతో ఒక చేయి లేకుండా జన్మించిన తన కూతురుకి అత్యంత విలువైన కానుక ఇవ్వాలనుకుంది. ఆమె పెదాలపై ఎప్పటికీ చిరునవ్వు తొణికిసలాడే విలువనే బహుమతి ఇవ్వాలనుకుంది. అందుకోసం ఎంతలా తప్పించిందో వింటే ఆ తల్లికి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేరు.
యూకేలో థాలియా కౌల్టాస్ అనే ఎనిమిదేళ్ల చిన్నారి పుట్టుకతో ఒక చేయితో జన్మించింది. తన కూతురు అలా ఉండటం చూసి కెర్రీ కౌల్టాస్ చాలా బాధపడేది. ఆమె తన పనులు చేసుకోవడం ఎంత ఇబ్బంది పడుతుందో గమనించి తల్లడిల్లింది. ఎలా తనకు సాయం చేయాలని ఆరాటపడింది. సాంకేతికతో కూడిన చేతిని అమరిస్తే తన సమస్యలకు కాస్త ఉపశమనం దొరుకుతుందేమో అన్ని ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ ఏ ఒక్క రోబిటిక్ చేయి ఆమెకు సూటవ్వలేదు. అప్పుడే ఈ ఓపెన్ బయోనిక్స్ అవయాల గురించి తెలుసుకుని అన్వేషించింది.
సాంకేతికతో కూడిన ఈ బయోనిక్ అవయవాలను ఎనిమిదేళ్ల పిల్లలకు అమర్చరు. సదరు కంపెనీలకు అందుకు అనుమతించవు. అయితే థాలియా తల్లి శతవిధాల చేసిన ప్రయత్నాల ఫలితంగా ఆ కంపెనీ దిగొచ్చి ఆ చిన్నారికి మినహాయింపు ఇచ్చి మరీ ఈ బయోనిక్ చేతిని అందించింది. దీంతో సాంకేతికతో కూడిన బయోనిక్ 'హీరో ఆర్మ్'ని పొందిన అతి పిన్నవయస్కురాలిగా థాలియా నిలిచింది. ఈ క్రిస్మస్కి తన కూతురుకి తాను ఇచ్చే అతి విలువైన కానుక అని ఆ తల్లి ఎంతో సంబరపడిపోయింది.
ఆ తల్లి దాదాపు రూ. 13 లక్షలు ఖర్చుపెట్టి మరీ ఈ క్రిస్మస్కి కూతురుకి అపురూపమైన కానుకను ఇచ్చింది. ఇప్పుడూ తన కూతురు కత్తి, ఫోర్క్ పట్టుకుని కేక్‌ని సులభంగా కట్ చేయగలదు, తన గదిని చక్కబెట్టుగోగలదు అని సంతోషంగా చెబుతోంది. ఏ తల్లి అయినా అంతేకదా! పిల్లలకు ఎదురైన కష్టాన్ని తొలగించి వారి మోములు సంతోషంతో వెలిగిపోవాలని కోరుకుంటారు. నిజానికి అలాంటి చిన్నారులకు అన్ని విధాల వెన్నుదన్నుగా ఉండే తల్లిదండ్రులు ఉండటమే అతిపెద్ద గిఫ్ట్ కదా!. దెబ్బకి ఏ కష్టమైన పరార్ అవ్వాల్సిందే.
(చదవండి: రొయ్యలకు నిలయం ఆ సరస్సు! చేపలు పీతలు అస్సలు ఉండవ్!)