‘క్రికెట్ నన్ను ఉన్నతమైన మనిషిని చేసింది’
పనాజీ: ’క్రికెట్ నన్ను ఉన్నతమైన మనిషిని చేయడమే కాకుండా, మానవతా విలువలను నేర్పిందని ' భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ఆదివారం గోవాలో బిట్స్ పిలానీ స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరైన ద్రవిడ్ తన క్రికెట్ జీవితాన్ని నెమరవేసుకున్నాడు. తన క్రీడా జీవితం ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిందన్నాడు.
ఈ సభలో ప్రసంగించిన ద్రావిడ్ తన చిన్ననాటి అనుభూతుల్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. చిన్నతనంలోనే స్కూల్ పిన్సిపాల్ తనలోని ప్రతిభని గుర్తించడం వల్లే క్రికెట్ జీవితం ఆరంభమైందని తెలిపాడు. తనది మధ్యతరగతి కుటుంబమని, తనకు తానకు చాలా విషయాలను నేర్చుకున్నానన్నాడు. ఈ సందర్భంగా యువతకు ఒక సందేశాన్ని కూడా ఇచ్చాడు. ‘ప్రపంచంలో నంబర్ వన్‌గా ఉండేందుకు ప్రయత్నించవద్దు, నీకు నువ్వు నంబర్ వన్ వ్యక్తిగా ఉండటానికి ప్రయత్నించు' అని రాహుల్ తెలిపాడు.