BJP - TDP alliance
-
పురందేశ్వరి బరితెగింపు!
సాక్షి, అమరావతి: ఎన్నికల వేళ... తన మరిది చంద్రబాబు నాయుడి కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి బరితెగించేశారు. ఒకేసారి ఏకంగా 22 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాయటమే కాక... ఆ 22 మంది స్థానంలో ఎవరెవరిని నియమించాలో పేర్లతో సహా సూచించారు. ఒకరకంగా అనధికారిక సిఫారసు చేశారు. నిజానికిలా ఎవరెవరిని నియమించాలో కూడా సూచిస్తూ లేఖ రాయటమనేది అనూహ్యం. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం... తాను ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా కొనసాగుతుండటం వల్లే ఆమె ఇంతకు బరితెగించారని..ఒకరకంగా రాజ్యాగం వ్యవస్థలను బ్లాక్మెయిల్ చెయ్యటానికి దిగారని బీజేపీ వర్గాలే పేర్కొంటున్నాయి. ‘‘బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని అడ్డం పెట్టుకొని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని రాజకీయంగా ప్రభావితం చేయటం... రాష్ట్రంలో ఇతర అధికారులందరినీ బెదిరించడం అనే ధోరణి ఈ లేఖలో కనిపిస్తోంది’’ అని బీజేపీలో మొదటి నుంచీ ఉంటున్న సీనియర్ నాయకుడొకరు అభిప్రాయపడ్డారు. తన మరిది, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి ప్రయోజనాలే పరమావధిగా ఆమె పనిచేస్తున్నారని, ఈ క్రమంలో తన పదవిని దుర్వినియోగం చేస్తున్నారని మరో సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు. నిజానికి ఈ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఆరు లోక్‌సభ, పది అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోంది. కానీ తాము అసలు పోటీలోనే లేని అనంతపురం, ðనెల్లూరు, చిత్తూరు, నంద్యాల , పల్నాడు, ప్రకాశం జిల్లాల ఎస్పీలను కూడా బదిలీ చేయాలంటూ పురంధేశ్వరి లేఖ రాయటంతో... ఇది బీజేపీ ప్రయోజనాల కోసం కాదనేది స్పష్టంగా తేలిపోయింది. బీజేపీకున్న అధికార బలాన్ని తాకట్టు పెట్టయినా తెలుగుదేశానికి మేలు చేయాలనే దృఢ చిత్తంతో ఆమె పనిచేస్తున్నారని, చంద్రబాబు ప్రయోజనాల కోసం పూర్తిగా దిగజారిపోయారనేది కూడా స్పష్టమవుతోంది. 2019 ఎన్నికల సమయంలో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)తో పాటు డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసినందున... ఇప్పుడు కూడా అలా చేయాలని ఒత్తిడి తెచ్చేందుకే చంద్రబాబు పురందేశ్వరితో ఈ లేఖ రాయించారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోలీసు అధికారులను బదిలీ చేయించటం ద్వారా మిగిలిన వారిని భయపెట్టి తన చెప్పుచేతల్లో ఉంచుకోవాలన్నది వీరి ఎత్తుగడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బెదిరింపు ధోరణి సాధారణంగా ఎవరిపైనైనా ఫిర్యాదు చేస్తే.. వారివల్ల తామెదుర్కొంటున్న ఇబ్బందులు తెలుపుతూ వినతిపత్రాలు ఇస్తూ ఉంటారు. కానీ దగ్గుబాటి పురందేశ్వరి 22 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ కోరుతూ.. ఆయా స్థానాల్లో ఎవరిని నియమించాలో కూడా సూచిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాశారంటే... బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని అడ్డం పెట్టుకొని పురందేశ్వరి– చంద్రబాబులు అధికారులను ఎలా బెదిరించాలని ఆలోచన చేస్తున్నారో అర్ధమైపోతుందని అటు రాజకీయ, ఇటు అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. సాధారణ ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి సంబంధం ఉండని డిజాస్టర్ మేనేజ్మెంట్ (విపత్తుల నివారణ ) డీజీ, సీఐడీ ఏడీజీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఐజీ అధికారులను సైతం బదిలీ చేయాలని ఈ లేఖలో పేర్కొన్నారంటే... తమకు నచ్చని, తాము బెదిరించాలని అనుకున్న అ«ధికారులకు వ్యతిరేకంగా ఈ ఫిర్యాదు చేసినట్టు స్పష్టంగా తెలిసిపోతోంది. చంద్రబాబు అవినీతి కేసులపై విచారణ జరుపుతున్న సీఐడీ ఏడీజీకి, ఎన్నికల ప్రక్రియకు సంబంధం లేకపోయినా పురందేశ్వరి అతనిపైనా ఫిర్యాదు చేయడం... ఎన్నికలు సజావుగా జరగాలన్న ఆలోచన కన్నా ఇతర దురుద్దేశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తొలి నుంచీ సొంత రాజకీయ అజెండాతోనే పది నెలల కిత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పురందేశ్వరి తన కుటుంబ, బంధువుల ప్రయోజనాల కోసమే సొంత అజెండాతో పనిచేస్తున్నారని బీజేపీ నాయకులే విమర్శిస్తున్నారు. రాష్ట్రంలోనూ, దేశ వ్యాప్తంగా చాలా మంది ఆయా కేసుల్లో బెయిల్‌పై కొనసాగుతుండగా.. పురందేశ్వరి మాత్రం బాధ్యతలు చేపట్టిన మూడు నెలలకే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు సీజేకి లేఖ రాయడాన్ని ఇప్పుడు పలువురు గుర్తు చేస్తున్నారు. బీజేపీ– టీడీపీ పొత్తు లేని సమయంలో కూడా ఏళ్ల తరబడి చంద్రబాబు చేస్తున్న రాజకీయ డిమాండ్‌కు అనుగుణంగా ఆమె అప్పట్లో సీజేకి లేఖ రాశారని కమలం పార్టీలో అంతర్గతంగా పెద్ద చర్చ సాగింది. అంతకు ముందు నాలుగేళ్ల పాటు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై టీడీపీ చేస్తున్న ఆరోపణలనే పురందేశ్వరి వల్లె వేస్తూ కేంద్ర దర్యాపు సంస్థలతో విచారణలు జరపాలంటూ కేంద్ర హోంమంత్రికి సైతం లేఖలు రాసిన రాశారంటే... మొదట నుంచీ చంద్రబాబు– పురందేశ్వరిల రాజకీయ సంబంధాలు ఎలా ఉండేవో అర్ధమవుతుందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
అది అసత్య ప్రచారం.. బీజేపీ పోటీపై ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ, అధికార టీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. రెండు పార్టీల నేతలు పరస్పర ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జాతీయ రాజకీయాలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్.. ఆదివారం బీహార్ సీఎం నితీష్ కుమార్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. కాగా, కేసీఆర్ బీహార్ పర్యటనపై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్.. సీఎం బీహార్ పర్యటనపై స్పందించారు. ఎంపీ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. బీహార్ పర్యటనతో కేసీఆర్ అభాసుపాలయ్యారు. కేసీఆర్ ఉచ్చులో నితీష్ కుమార్ చిక్కుకున్నారు. కేసీఆర్ వ్యాఖ్యల ద్వారా మరోసారి టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య బంధం బహిర్గతమైంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ విధిస్తే.. నేడు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్బంధాలు, ఆంక్షలు, అరెస్టులతో ఎమర్జెన్సీ తలపిస్తోంది. తెలంగాణలో ధాన్యం కుప్పల మీద రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబాలను ఆదుకోని సీఎం కేసీఆర్.. బీహార్ వెళ్లి అక్కడి వారికి చెక్కులు ఇవ్వమేంటి?. కన్న తండ్రికి బువ్వపెట్టని కొడుకు.. మేనమామకు మంగళ హారతి పట్టిన చందంగా కేసీఆర్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. ఇక, టీడీపీతో పొత్తు అనేది ఊహాజనిత, అసత్య ప్రచారం మాత్రమే.. ఏపీలో పవన్‌తో కలిసి బీజేపీ ముందుకెళ్తోంది. తెలంగాణలో మాత్రం ఒంటిరిగా పోటీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇది కూడా చదవండి: మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై క్లారిటీ వచ్చేసిందా..? ప్రకటన అప్పుడేనా? -
వేస్ట్ కాదు....మేమే బెస్ట్
♦ మోదీపై రాజకీయ లబ్ది కోసమే టీఆర్ఎస్ ఆరోపణలు ♦ కేసీఆర్ మెచ్చుకుంటే.. కేటీఆర్ విమర్శించడమేంటి? ♦ గ్రేటర్ ఎన్నికల్లో సాధారణ ఎన్నికల ఫలితాలే పునరావృతం ♦ రోహిత్ వేముల వివాదంపై విచారణ ముగిసే వరకు మాట్లాడను ♦ కేసీఆర్ ప్రభుత్వం ఇంకా ప్రకటనలతోనే సరిపెడుతోంది.. ♦ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ బండారు దత్తాత్రేయ.. నగర రాజకీయాల్లో అత్యంత సుపరిచితమైన పేరు. అంతకంటే ఎక్కువగా ఇటీవలి హెచ్‌సీయూ వివాదంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన వ్యక్తి. సికింద్రాబాద్ లోక్‌సభ నుండి అత్యధికంగా నాలుగుమార్లు విజయం సాధించిన రికార్డు సొంతం చేసుకుని ప్రస్తుతం కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేస్తున్న దత్తాత్రేయ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో క్షణం తీరిక లేకుండా ప్రచారసభల్లో పాల్గొంటున్నారు. టీఆర్ఎస్ -ఎంఐఎం పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. మోదీని గొప్ప నాయకుడంటూ కేసీఆర్ ఆకాశానికెత్తితే.. ఆయన కుమారుడు కేటీఆర్ మోదీ వృథా నాయకుడంటూ విమర్శలు చేస్తుండటాన్ని తప్పుబడుతున్నారు. బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపిస్తే హైదరాబాద్‌ను అన్నింటా అగ్రస్థానంలో నిలబెడతామంటున్న దత్తాత్రేయతో...ఇంటర్వ్యూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం ఎవరిది..? ఫిబ్రవరి 2న జరిగే ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో బీజేపీ- టీడీపీ కూటమి అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు. అన్ని సామాజిక వర్గాలతో కూడిన కూటమి అభ్యర్థులు రంగంలో ఉన్నారు. హైదరాబాద్‌కు వాజ్‌పేయ్ హయాంలో అనేక పథకాలు తెచ్చాం. మూసీ ఆధునీకరణ, ఔటర్ రింగు రోడ్డు, మెట్రోరైలు తదితర పథకాలకు వాజ్‌పేయ్ హయాంలోనే బీజం పడింది. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం సైతం హైదరాబాద్‌ను అన్నింటా అగ్రగామిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెళుతుంది. అభివృద్ధిని, మోదీ విధానాలను మెచ్చే నగరవాసులంతా గత సాధారణ ఎన్నికల్లో ఇచ్చిన తీర్పునే మళ్లీ రిపీట్ చేయబోతున్నారు.. ప్రధాని నగరాన్ని పట్టించుకోవటం లేదన్న కేటీఆర్ ఆరోపణలపై ఏమంటారు... మొన్నటి కి మొన్న సీఎం కేసీఆర్ మోదీ ఆదర్శవంతమైన(బెస్ట్) ప్రధాని అంటూ ఆకాశానికి ఎత్తారు. ఇప్పుడు ఆయన కుమారుడు కేటీఆర్ మోదీని వృథా(వేస్ట్) నాయకుడంటూ విమర్శలు చేస్తున్నారు. మోదీ నగరానికి ఏం చేయలేదంటున్నారు. శుద్ధ అబద్దం..స్వచ్ఛ హైదరాబాద్ కోసం రూ.100 కోట్లను కేటాయించారు. 58 వేల ఇళ్ల నిర్మాణం కోసం రూ.480 కోట్లను, రామగుండం విద్యుత్ ప్లాంట్ కోసం రూ.9954 కోట్లు, స్మార్ట్ సిటీ పథకం కోసంర రూ.488 కోట్లు కేటాయించారు. మెట్రో రైలు ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ త్వరలో ప్రారంభోత్సవానికి హాజరు కాబోతున్నారు. హైదరాబాద్‌లో నిరంతర విద్యుత్ కోసం ఉత్తర-దక్షిణ గ్రిడ్ల అనుసంధానం, మల్లేపల్లి ఐటీఐని ఆదర్శవంతమైన కేంద్రంగా మార్చడం, ఆటో కార్మికులందరికీ ఈఎస్ఐ సౌకర్యం, భవననిర్మాణ కార్మికులను ఈపీఎఫ్ పరిధిలోకి తెచ్చిన ఘనత మోదీకే దక్కింది. మీ హయాంలో హైదరాబాద్‌కు ఏం చేశారు.. ఇంకా ఏం చేయబోతున్నారు? హైదరాబాద్‌ను అన్నింటా అగ్రస్థానంలో నిలబెట్టే కృషి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వసేవలను ఉపయోగించుకోవటంలో రాష్ట్రం పూర్తిగా విఫలం అవుతోంది. తెలంగాణలో ప్రధాన రహదారుల విస్తరణ, ఎంఎంటీఎస్ పొడిగింపు, గడువులోగా మెట్రో పనుల పూర్తి, మూసీ ఆధునీకరణ, ఇంటింటికీ పైప్‌లైన్ గ్యాస్, హైదరాబాద్-వరంగల్ రహదారి విస్తరణ పనులు గడువులోగా పూర్తి చేసే దిశగా ముందుకు వెళతాం. టీడీపీ-బీజేపీలు పరస్పరం తిరుగుబాటు అభ్యర్థులను రంగంలో దింపారు.. ఎందుకిలా? అవును, నిజమే..బీజేపీకి కేటాయించిన 63 సీట్ల కంటే 7 సీట్లలో, టీడీపీకి కేటాయించిన 93 సీట్ల కేంటే 7 సీట్లలో అధికంగా బీ ఫారాలు ఇచ్చారు.. ఇరుపక్షాల కార్యకర్తల ఒత్తిడి ఉండటం వల్లే అలా జరిగింది. అభ్యర్థుల నుంచి మీరు, కిషన్‌రెడ్డి డబ్బులు తీసుకున్నా రన్న మీ ఎమ్మెల్యే ఆరోపణలపై ఏం చెబుతారు.. దురదృష్టకరం. బీజేపీ అనేది వ్యక్తి కేంద్రంగా నడిచే పార్టీ కాదు. ఎన్నికల కమిటీయే ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేది నిర్ణయిస్తుంది. రాజాసింగ్ నిరాధార ఆరోపణలు చేశారు. బీజేపీలో డబ్బులకు ప్రాధాన్యం ఇస్తే..అసలు రాజాసింగ్ నేడు ఎమ్మెల్యే అయ్యేవాడే కాదు. రాజాసింగ్ వద్ద ఏం డబ్బులుఉన్నాయని అప్పుడు టికెట్ ఇచ్చారు. అసంతృప్తితో ఇష్టం వచ్చిన ఆరోపణలు చేశారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికే టికెట్లు ఇచ్చాం. రోహిత్ వేముల అంశం మీ పార్టీకి ఇబ్బందిగా మారిందా.. ఈ వివాదం నుంచి ఎలా బయటపడతారు? ఈ అంశంపై ఇప్పుడు నేనేం చెప్పలేను. కోర్టు పరిధిలో ఉంది. ఉన్నత స్థాయి విచారణ కొనసాగుతోంది. కేంద్రంలో మోదీ - రాష్ట్రంలో కేసీఆర్ పాలన ఎలా ఉంది..?ఎవరికి ఎన్ని మార్కులు వేస్తారు.. కేంద్రంలో గడిచిన పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలను సవరించే విషయంలో మోదీ ముం దున్నారు. దేశాన్ని ప్రపంచంలో అగ్రరాజ్యంగా నిలబెట్టే క్రమంలో ఎంతో కృషి చేశారు. అవినీతి, దాపరికం లేని పాలనతో ముందుకు వెళుతున్నారు. అనేక ఫలితాలు దేశ ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి. మోదీకి నేనిచ్చే మార్కులు నూటికి నూరుశాతం. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఇంకా ప్రకటనల స్థాయిలోనే ఉంది.. ఫలితాలేవీ ప్రజలకు చేరలేదు.. ఆర్థిక క్రమశిక్షణ లోపంతో సర్ప్లస్ బడ్జెట్ నుండి మైనస్ బడ్జెట్లోకి రాష్ట్రం వెళ్లింది. వేచి చూడాలి.. ఇప్పుడే ఏం మార్కులు ఇవ్వలేం.