22 మంది ఐపీఎస్‌లను బదిలీ చేయాలంటూ ఈసీకి లేఖ
వారి స్థానంలో ఎవరెవరిని నియమించాలో కూడా సూచన
ఎన్నికల ప్రక్రియకు సంబంధం లేని అధికారులపైనా ఆరోపణలు
బెదిరింపు ధోరణిలో లేఖ రాయటం వెనక బాబు పాత్ర స్పష్టం
చంద్రబాబు కేసులు విచారిస్తున్న సీఐడీ అధికారిపైనా కక్ష ధోరణి
ఆయనకు ఎన్నికలతో సంబంధం లేకున్నా.. బదిలీ చేయాలని లేఖ
మరిది కోసం పూర్తిగా దిగజారిన తీరు; పదవి తాకట్టుపై బీజేపీలోనే విస్మయం
సాక్షి, అమరావతి: ఎన్నికల వేళ... తన మరిది చంద్రబాబు నాయుడి కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి బరితెగించేశారు. ఒకేసారి ఏకంగా 22 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాయటమే కాక... ఆ 22 మంది స్థానంలో ఎవరెవరిని నియమించాలో పేర్లతో సహా సూచించారు. ఒకరకంగా అనధికారిక సిఫారసు చేశారు. నిజానికిలా ఎవరెవరిని నియమించాలో కూడా సూచిస్తూ లేఖ రాయటమనేది అనూహ్యం.
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం... తాను ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా కొనసాగుతుండటం వల్లే ఆమె ఇంతకు బరితెగించారని..ఒకరకంగా రాజ్యాగం వ్యవస్థలను బ్లాక్‌మెయిల్ చెయ్యటానికి దిగారని బీజేపీ వర్గాలే పేర్కొంటున్నాయి. ‘‘బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని అడ్డం పెట్టుకొని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని రాజకీయంగా ప్రభావితం చేయటం... రాష్ట్రంలో ఇతర అధికారులందరినీ బెదిరించడం అనే ధోరణి ఈ లేఖలో కనిపిస్తోంది’’ అని బీజేపీలో మొదటి నుంచీ ఉంటున్న సీనియర్ నాయకుడొకరు అభిప్రాయపడ్డారు.
తన మరిది, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి ప్రయోజనాలే పరమావధిగా ఆమె పనిచేస్తున్నారని, ఈ క్రమంలో తన పదవిని దుర్వినియోగం చేస్తున్నారని మరో సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు. నిజానికి ఈ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఆరు లోక్‌సభ, పది అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోంది. కానీ తాము అసలు పోటీలోనే లేని అనంతపురం, ðనెల్లూరు, చిత్తూరు, నంద్యాల , పల్నాడు, ప్రకాశం జిల్లాల ఎస్పీలను కూడా బదిలీ చేయాలంటూ పురంధేశ్వరి లేఖ రాయటంతో... ఇది బీజేపీ ప్రయోజనాల కోసం కాదనేది స్పష్టంగా తేలిపోయింది.
బీజేపీకున్న అధికార బలాన్ని తాకట్టు పెట్టయినా తెలుగుదేశానికి మేలు చేయాలనే దృఢ చిత్తంతో ఆమె పనిచేస్తున్నారని, చంద్రబాబు ప్రయోజనాల కోసం పూర్తిగా దిగజారిపోయారనేది కూడా స్పష్టమవుతోంది. 2019 ఎన్నికల సమయంలో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)తో పాటు డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసినందున... ఇప్పుడు కూడా అలా చేయాలని ఒత్తిడి తెచ్చేందుకే చంద్రబాబు పురందేశ్వరితో ఈ లేఖ రాయించారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోలీసు అధికారులను బదిలీ చేయించటం ద్వారా మిగిలిన వారిని భయపెట్టి తన చెప్పుచేతల్లో ఉంచుకోవాలన్నది వీరి ఎత్తుగడన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
బెదిరింపు ధోరణి
సాధారణంగా ఎవరిపైనైనా ఫిర్యాదు చేస్తే.. వారివల్ల తామెదుర్కొంటున్న ఇబ్బందులు తెలుపుతూ వినతిపత్రాలు ఇస్తూ ఉంటారు. కానీ దగ్గుబాటి పురందేశ్వరి 22 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ కోరుతూ.. ఆయా స్థానాల్లో ఎవరిని నియమించాలో కూడా సూచిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాశారంటే... బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని అడ్డం పెట్టుకొని పురందేశ్వరి– చంద్రబాబులు అధికారులను ఎలా బెదిరించాలని ఆలోచన చేస్తున్నారో అర్ధమైపోతుందని అటు రాజకీయ, ఇటు అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది.
సాధారణ ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి సంబంధం ఉండని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (విపత్తుల నివారణ ) డీజీ, సీఐడీ ఏడీజీ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఐజీ అధికారులను సైతం బదిలీ చేయాలని ఈ లేఖలో పేర్కొన్నారంటే... తమకు నచ్చని, తాము బెదిరించాలని అనుకున్న అ«ధికారులకు వ్యతిరేకంగా ఈ ఫిర్యాదు చేసినట్టు స్పష్టంగా తెలిసిపోతోంది. చంద్రబాబు అవినీతి కేసులపై విచారణ జరుపుతున్న సీఐడీ ఏడీజీకి, ఎన్నికల ప్రక్రియకు సంబంధం లేకపోయినా పురందేశ్వరి అతనిపైనా ఫిర్యాదు చేయడం... ఎన్నికలు సజావుగా జరగాలన్న ఆలోచన కన్నా ఇతర దురుద్దేశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
తొలి నుంచీ సొంత రాజకీయ అజెండాతోనే
పది నెలల కిత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పురందేశ్వరి తన కుటుంబ, బంధువుల ప్రయోజనాల కోసమే సొంత అజెండాతో పనిచేస్తున్నారని బీజేపీ నాయకులే విమర్శిస్తున్నారు. రాష్ట్రంలోనూ, దేశ వ్యాప్తంగా చాలా మంది ఆయా కేసుల్లో బెయిల్‌పై కొనసాగుతుండగా.. పురందేశ్వరి మాత్రం బాధ్యతలు చేపట్టిన మూడు నెలలకే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు సీజేకి లేఖ రాయడాన్ని ఇప్పుడు పలువురు గుర్తు చేస్తున్నారు.
బీజేపీ– టీడీపీ పొత్తు లేని సమయంలో కూడా ఏళ్ల తరబడి చంద్రబాబు చేస్తున్న రాజకీయ డిమాండ్‌కు అనుగుణంగా ఆమె అప్పట్లో సీజేకి లేఖ రాశారని కమలం పార్టీలో అంతర్గతంగా పెద్ద చర్చ సాగింది. అంతకు ముందు నాలుగేళ్ల పాటు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై టీడీపీ చేస్తున్న ఆరోపణలనే పురందేశ్వరి వల్లె వేస్తూ కేంద్ర దర్యాపు సంస్థలతో విచారణలు జరపాలంటూ కేంద్ర హోంమంత్రికి సైతం లేఖలు రాసిన రాశారంటే... మొదట నుంచీ చంద్రబాబు– పురందేశ్వరిల రాజకీయ సంబంధాలు ఎలా ఉండేవో అర్ధమవుతుందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment