వేస్ట్ కాదు....మేమే బెస్ట్ | Not Waste Best ourselves | Sakshi
Sakshi News home page

వేస్ట్ కాదు....మేమే బెస్ట్

Published Tue, Jan 26 2016 12:28 AM | Last Updated on Sun, Sep 3 2017 4:18 PM

వేస్ట్ కాదు....మేమే బెస్ట్

వేస్ట్ కాదు....మేమే బెస్ట్

♦ మోదీపై రాజకీయ లబ్ది కోసమే టీఆర్‌ఎస్ ఆరోపణలు
♦ కేసీఆర్ మెచ్చుకుంటే.. కేటీఆర్ విమర్శించడమేంటి?
♦ గ్రేటర్ ఎన్నికల్లో సాధారణ ఎన్నికల ఫలితాలే పునరావృతం
♦ రోహిత్ వేముల వివాదంపై విచారణ ముగిసే వరకు మాట్లాడను
♦ కేసీఆర్ ప్రభుత్వం ఇంకా ప్రకటనలతోనే సరిపెడుతోంది..
♦ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ
 
 బండారు దత్తాత్రేయ.. నగర రాజకీయాల్లో అత్యంత సుపరిచితమైన పేరు. అంతకంటే ఎక్కువగా ఇటీవలి హెచ్‌సీయూ వివాదంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన వ్యక్తి. సికింద్రాబాద్ లోక్‌సభ నుండి అత్యధికంగా నాలుగుమార్లు విజయం సాధించిన రికార్డు సొంతం చేసుకుని ప్రస్తుతం కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేస్తున్న దత్తాత్రేయ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో క్షణం తీరిక లేకుండా ప్రచారసభల్లో పాల్గొంటున్నారు. టీఆర్‌ఎస్ -ఎంఐఎం పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు  గుప్పిస్తున్నారు. మోదీని గొప్ప నాయకుడంటూ  కేసీఆర్ ఆకాశానికెత్తితే.. ఆయన కుమారుడు కేటీఆర్ మోదీ వృథా నాయకుడంటూ విమర్శలు చేస్తుండటాన్ని తప్పుబడుతున్నారు. బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపిస్తే హైదరాబాద్‌ను అన్నింటా అగ్రస్థానంలో నిలబెడతామంటున్న దత్తాత్రేయతో...ఇంటర్వ్యూ
 
 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయం ఎవరిది..?
 ఫిబ్రవరి 2న జరిగే ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో  బీజేపీ- టీడీపీ కూటమి అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు. అన్ని సామాజిక వర్గాలతో కూడిన కూటమి అభ్యర్థులు రంగంలో ఉన్నారు. హైదరాబాద్‌కు వాజ్‌పేయ్ హయాంలో అనేక పథకాలు తెచ్చాం. మూసీ ఆధునీకరణ, ఔటర్ రింగు రోడ్డు, మెట్రోరైలు  తదితర పథకాలకు వాజ్‌పేయ్ హయాంలోనే బీజం పడింది. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం సైతం హైదరాబాద్‌ను అన్నింటా అగ్రగామిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెళుతుంది. అభివృద్ధిని, మోదీ విధానాలను మెచ్చే నగరవాసులంతా గత సాధారణ ఎన్నికల్లో ఇచ్చిన తీర్పునే మళ్లీ రిపీట్ చేయబోతున్నారు..

 ప్రధాని నగరాన్ని పట్టించుకోవటం లేదన్న  కేటీఆర్ ఆరోపణలపై ఏమంటారు...
 మొన్నటి కి మొన్న సీఎం కేసీఆర్ మోదీ ఆదర్శవంతమైన(బెస్ట్) ప్రధాని అంటూ ఆకాశానికి ఎత్తారు. ఇప్పుడు ఆయన కుమారుడు కేటీఆర్ మోదీని వృథా(వేస్ట్) నాయకుడంటూ విమర్శలు చేస్తున్నారు. మోదీ నగరానికి ఏం చేయలేదంటున్నారు. శుద్ధ అబద్దం..స్వచ్ఛ హైదరాబాద్ కోసం రూ.100 కోట్లను కేటాయించారు. 58 వేల ఇళ్ల నిర్మాణం కోసం రూ.480 కోట్లను, రామగుండం విద్యుత్ ప్లాంట్ కోసం రూ.9954 కోట్లు, స్మార్ట్ సిటీ పథకం కోసంర రూ.488 కోట్లు కేటాయించారు. మెట్రో రైలు ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ త్వరలో ప్రారంభోత్సవానికి హాజరు కాబోతున్నారు. హైదరాబాద్‌లో నిరంతర విద్యుత్ కోసం ఉత్తర-దక్షిణ గ్రిడ్‌ల అనుసంధానం, మల్లేపల్లి ఐటీఐని ఆదర్శవంతమైన కేంద్రంగా మార్చడం, ఆటో కార్మికులందరికీ ఈఎస్‌ఐ సౌకర్యం, భవననిర్మాణ కార్మికులను ఈపీఎఫ్ పరిధిలోకి తెచ్చిన ఘనత మోదీకే దక్కింది.

 మీ హయాంలో హైదరాబాద్‌కు ఏం చేశారు.. ఇంకా ఏం చేయబోతున్నారు?
 హైదరాబాద్‌ను అన్నింటా అగ్రస్థానంలో నిలబెట్టే కృషి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వసేవలను ఉపయోగించుకోవటంలో రాష్ట్రం పూర్తిగా విఫలం అవుతోంది. తెలంగాణలో ప్రధాన రహదారుల విస్తరణ, ఎంఎంటీఎస్ పొడిగింపు, గడువులోగా మెట్రో పనుల పూర్తి, మూసీ ఆధునీకరణ, ఇంటింటికీ పైప్‌లైన్ గ్యాస్, హైదరాబాద్-వరంగల్ రహదారి విస్తరణ పనులు గడువులోగా పూర్తి చేసే దిశగా ముందుకు వెళతాం.

 టీడీపీ-బీజేపీలు పరస్పరం తిరుగుబాటు అభ్యర్థులను రంగంలో దింపారు.. ఎందుకిలా?
 అవును, నిజమే..బీజేపీకి కేటాయించిన 63 సీట్ల కంటే 7 సీట్లలో, టీడీపీకి కేటాయించిన 93 సీట్ల కేంటే 7 సీట్లలో అధికంగా బీ ఫారాలు ఇచ్చారు.. ఇరుపక్షాల కార్యకర్తల ఒత్తిడి ఉండటం వల్లే అలా జరిగింది.
 
 అభ్యర్థుల నుంచి మీరు, కిషన్‌రెడ్డి డబ్బులు తీసుకున్నా రన్న మీ ఎమ్మెల్యే ఆరోపణలపై ఏం చెబుతారు..
 దురదృష్టకరం. బీజేపీ అనేది వ్యక్తి కేంద్రంగా నడిచే పార్టీ కాదు. ఎన్నికల కమిటీయే ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేది నిర్ణయిస్తుంది. రాజాసింగ్ నిరాధార ఆరోపణలు చేశారు. బీజేపీలో డబ్బులకు ప్రాధాన్యం ఇస్తే..అసలు రాజాసింగ్ నేడు ఎమ్మెల్యే అయ్యేవాడే కాదు. రాజాసింగ్ వద్ద ఏం డబ్బులుఉన్నాయని అప్పుడు టికెట్ ఇచ్చారు. అసంతృప్తితో ఇష్టం వచ్చిన ఆరోపణలు చేశారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికే టికెట్లు ఇచ్చాం.

 రోహిత్ వేముల అంశం మీ పార్టీకి ఇబ్బందిగా మారిందా.. ఈ వివాదం నుంచి ఎలా బయటపడతారు?
 ఈ అంశంపై ఇప్పుడు నేనేం చెప్పలేను. కోర్టు పరిధిలో ఉంది. ఉన్నత స్థాయి విచారణ కొనసాగుతోంది.
 
 కేంద్రంలో మోదీ - రాష్ట్రంలో కేసీఆర్ పాలన ఎలా ఉంది..?ఎవరికి ఎన్ని మార్కులు వేస్తారు..
 కేంద్రంలో గడిచిన పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలను సవరించే విషయంలో మోదీ ముం దున్నారు. దేశాన్ని ప్రపంచంలో అగ్రరాజ్యంగా నిలబెట్టే క్రమంలో ఎంతో కృషి చేశారు. అవినీతి, దాపరికం లేని పాలనతో ముందుకు వెళుతున్నారు. అనేక ఫలితాలు దేశ ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి. మోదీకి నేనిచ్చే మార్కులు నూటికి నూరుశాతం. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఇంకా ప్రకటనల స్థాయిలోనే ఉంది.. ఫలితాలేవీ ప్రజలకు చేరలేదు.. ఆర్థిక క్రమశిక్షణ లోపంతో సర్‌ప్లస్ బడ్జెట్ నుండి మైనస్ బడ్జెట్‌లోకి రాష్ట్రం వెళ్లింది. వేచి చూడాలి.. ఇప్పుడే ఏం మార్కులు ఇవ్వలేం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement