అందరినీ కూడగట్టి కొట్లాడదాం | KCR Said TRS Would Initiative Nationwide Movement against BJP At Center | Sakshi
Sakshi News home page

అందరినీ కూడగట్టి కొట్లాడదాం

Published Thu, Nov 19 2020 3:19 AM | Last Updated on Thu, Nov 19 2020 9:33 AM

KCR Said TRS Would Initiative Nationwide Movement against BJP At Center - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త ఉద్యమానికి టీఆర్‌ఎస్‌ చొరవ చూపుతుందని కేసీఆర్‌ ప్రకటించారు. బీజేపీపై పోరులో ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. హైదరాబాద్‌ వేదికగా డిసెంబర్‌ రెండోవారంలో సమరశంఖం పూరించనున్నట్లు తెలిపారు.

‘కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజల కోసం ఏమీ చేయదు. కొత్త వ్యవసాయ బిల్లుల ద్వారా రైతాంగానికి, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నది. మతవిద్వేషాలను రెచ్చగొట్టి... ప్రజలను విభజిస్తూ, భావోద్వేగాలతో రాజకీయ లబ్దిపొందుతోంది. దేశానికి నష్టం చేసే ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన కాంగ్రెస్‌ చతికిలపడింది. బడేభాయ్‌ వెంటే చోటేభాయ్‌ అన్నట్లు కాంగ్రెస్, బీజేపీలు రెండూ దేశానికి సరైన మార్గం చూపడంలో విఫలమయ్యాయి. దేశం మీద, ప్రజల మీద ఉన్న బాధ్యతతో టిఆర్‌ఎస్‌ చొరవ చూపుతుంది.

బీజేపీ విధానాలపై పోరాటానికి దేశంలోని ఇతర ప్రతిపక్షాలన్నింటినీ ఒక్కతాటిపై నిలిపేందుకు టీఆర్‌ఎస్‌ ప్రయత్నాలు చేస్తోంది’అని రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో బుధవారం నిర్వహించిన ఎంపీలు, ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధుల సంయుక్త సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడారు. గ్రేటర్‌ ఎన్నికల్లో పార్టీ వ్యూహాన్ని వివరించడంతో పాటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ విధానాలు, దానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరాన్ని వివరించారు.

‘ఇప్పటికే పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేరళ సీం విజయన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఒడిషా సీఎం నవీన్‌ పట్నాయక్, డీఎంకే నేత స్టాలిన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్‌ యాదవ్, శరద్‌ పవార్, ప్రకాశ్‌సింగ్‌ బాదల్, కుమారస్వామి, సీపీఐ, సీపీఎం నాయకులతో మాట్లాడాను. బీజేపీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడే విషయంలో కలిసి పనిచేయాలని నిర్ణయించాం. ఈ నాయకులందరితో డిసెంబర్‌ రెండోవారంలో హైదరాబాద్‌ నగరంలో సదస్సు నిర్వహించబోతున్నాం. అందులో దేశవ్యాప్త ఉద్యమం గురించి చర్చిస్తాం. దేశానికి ఓ దిశ, దశ నిర్ణయించే విషయంపై మాట్లాడతాం. కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల నష్టపోతున్న రైతులు, కార్మికులు, పేదల పక్షాన నిలుస్తాం’అని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

తప్పుడు ప్రచారంలో దిట్ట
మోదీ ప్రభుత్వం ఆరున్నరేళ్లలో తప్పుడు విధానాలు, ప్రచారాలతో దేశాన్ని తిరోగమనం వైపు నెట్టిందన్నారు. కాంగ్రెస్‌ నిష్క్రియాపరత్వ రాజకీయాల నేపథ్యంలో బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ఇతరపక్షాలపై పడిందన్నారు. ‘దేశ రాజకీయాల్లో ఇప్పుడు భిన్నమైన ట్రెండ్‌ నడుస్తున్నది. ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పి నిజమని నమ్మించే ప్రయత్నం బీజేపీ చేస్తున్నది. ప్రజల కోసం పనిచేస్తున్న వారిపై నిందలు మోపుతూ సోషల్‌ మీడియాను యాంటీ సోషల్‌ మీడియాగా మార్చింది. ఎన్నికలప్పుడు రాజకీయ లబ్ధి పొందడానికి పాకిస్తాన్, కశ్మీర్, పుల్వామా అంటూ ప్రచారానికి దిగుతున్నది. సరిహద్దుల్లో ఏదో యుద్ధం చేసినట్లు ప్రచారం చేసుకుంటారు. అదే చైనాకు వ్యతిరేకంగా కోట్లాడలేక చతికిలపడతారు. ఏదో చేసినట్లు తప్పుడు ప్రచారం మాత్రం జోరుగా చేసుకుంటారు’అని కేసీఆర్‌ ఎద్దేవా చేశారు.

బంగారుబాతులను అమ్మేస్తున్నారు
ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ పేరిట మోదీ సర్కారు వాటిని ప్రైవేటు కార్పోరేట్‌ కంపెనీలకు దారాదత్తం చేస్తోంది. వాజ్‌పేయి, మన్మోహన్‌ హయాంలో ప్రారంభమైన పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను కొనసాగిస్తూ మోదీ ప్రభుత్వం ఏకంగా 23 ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించింది. దీంతో లక్షలాది మంది ఉద్యోగులకు తీరని అన్యాయం జరుగుతోంది’అని కేసీఆర్‌ విమర్శించారు.

‘లాభాల్లో నడుస్తూ ప్రజలకు సేవ, ప్రభుత్వాలకు నిధులు అందిస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను మూసి వేస్తున్నారు. రైల్వేస్టేషన్‌లో ఛాయ్‌ అమ్మిన అని చెప్పిన మోదీ ఇప్పుడు రైల్వేస్టేషన్లనే తెగనమ్ముతున్నాడు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి’’అని కేసీఆర్‌ ప్రశ్నించారు. బంగారుబాతు లాంటి ఎల్‌ఐసీతో పాటు రైల్వేలు, ఎన్టీపీసీ, బీహెచ్‌ఈఎల్, బీఎస్‌ఎన్‌ఎల్, బీపీసీఎల్‌ లాంటి నవరత్న కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా వాటిని ప్రైవేటు, కార్పోరేట్‌ సంస్థలకు కేంద్రం అప్పగిస్తోంది.

ఈ సంస్థల్లో పనిచేసే లక్షలాది మంది ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. అవి ప్రైవేటుపరం కాకుండా చూడాలని వేడుకుంటున్నారు. వారికి అండగా నిలవాలని టిఆర్‌ఎస్‌ పార్టీ నిర్ణయించిందిని తెలిపారు. ‘1980 వరకు భారతదేశం కన్నా తక్కువ జీడీపీ ఉన్న చైనా నేడు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. కానీ కేంద్ర ప్రభుత్వ చేతగానితనం వల్ల భారతదేశం వెనక్కిపోతున్నది’అని విమర్శించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement