బల్క్ డ్రగ్ పాలసీపై కసరత్తు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధాల తయారీ, నాణ్యత, ధరలు, పెట్టుబడులు వంటి కీలకాంశాలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం బల్క్ డ్రగ్ పాలసీపై కసరత్తు చేస్తోంది. ఈ పాలసీతో ఫార్మా రంగంలో పెట్టుబడులకు ఆస్కారం ఉంటుందని కేంద్ర ఫార్మాసూటికల్స్ విభాగం డెరైక్టర్ బీకే సింగ్ చెప్పారు. విద్యుత్, ఫార్మా, రసాయనాలు, ఎరువులు వంటి మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ఈ పాలసీ కిందికి తీసుకొచ్చి ఫార్మా రంగంలో నూతన ఆవిష్కరణలు చేస్తామన్నారు.
శుక్రవారమిక్కడ ‘ఫార్మాసూటికల్స్ విభాగం, కేంద్ర ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ’తో చర్చాకార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బీకే సింగ్ మాట్లాడుతూ.. ఐటీ, పరిశ్రమ రంగాలకు మాదిరిగా ‘ఫార్మా క్లస్టర్ డెవలప్మెంట్ స్కీం’ను తీసుకొచ్చి ఈ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బల్క్ డ్రగ్ మాన్యుఫాక్చర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీడీఎంఏఐ) ఎం జయంత్ ఠాగూర్, ఫార్మాసూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మెక్సిల్) రీజనల్ డెరైక్టర్ కే సుబ్బిరెడ్డి, సీఐఐ ఏపీ ప్రెసిడెంట్ బీ అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.