ఈ కోతికి కాపీరైట్ లేదట!
పళ్లికిలిస్తూ.. ఇలా తనను తానే అందంగా ఫొటో తీసుకున్న ఈ మకాక్ కోతికి తాను తీసుకున్న ఈ సెల్ఫీపై కాపీరైట్ హక్కు లేదట! అమెరికాలోని కాపీరైట్ కార్యాలయం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ కోతి సెల్ఫీ వల్ల వికీపీడియా వెబ్సైట్, బ్రిటన్ ఫొటోగ్రాఫర్ డేవిడ్ జే స్లాటర్ల మధ్య కాపీరైట్ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. మూడేళ్ల క్రితం.. ఇండోనేసియాలోని సులావెసీ దీవిలో కోతుల గుంపును ఫొటోలు తీస్తుండగా ఈ కోతి డేవిడ్ కెమెరా లాక్కుపోయి వందలాది ఫొటోలు క్లిక్‌మనిపించింది. తర్వాత చూస్తే.. అందమైన ఈ సెల్ఫీతోపాటు మరికొన్ని ఫొటోలు వచ్చాయి.
దీంతో ఈ కోతి వార్తల్లో సందడి చేసింది. దీనిని తొలి ‘మంకీ ఫొటోగ్రాఫర్’గా గుర్తిస్తూ వికీపీడియా తమ వెబ్సైట్లో పెట్టారు. ఈ ఫొటోపై తనకే హక్కులు ఉన్నాయని, ఈ ఫొటోను నా అనుమతి లేకుండా అందరికీ ఉచితంగా ఎలా అందుబాటులో ఉంచుతారంటూ డేవిడ్ మండిపడుతున్నాడు. ఈ వెబ్‌సైట్‌పై కేసువేస్తానని ప్రకటించాడు. కానీ.. ‘కెమెరా నీదే అయినా.. ఫొటో తీసింది కోతే కాబట్టి.. ఫొటోపై కాపీరైట్ కోతికే ఉంటుంద’ని వికీపీడియా వాదించింది. అమెరికా చట్టాల తాజా నిబంధనల ప్రకారం.. కోతి, ఏనుగు లేదా మరే ఇతర జంతువైనా సరే తీసిన ఫొటోలు, వేసిన పెయింటింగులపై వాటికి ఎలాంటి హక్కులూ ఉండవని అమెరికా కాపీరైట్ కార్యాలయం ధ్రువీకరించింది.