చంద్రబాబు నల్ల చొక్కా గుట్టు విప్పిన మోదీ
సాక్షి, గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నల్ల చొక్కా ధరించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెటైర్లు వేశారు. తమకు దిష్టి తగలకుండా ఉండేందుకే ఆయన నల్ల చొక్కా వేసుకుని నిరసన తెలిపారంటూ మోదీ వ్యాఖ్యానించారు. కాగా ప్రధాని ఏపీ పర్యటన సందర్భంగా టీడీపీ నేతలు నల్ల చొక్కాలు ధరించి, నల్లజెండాలు, బెలూన్లుతో, మోదీ గో బ్యాక్ అంటూ నిరసన తెలిపిన విషయం తెలిసిందే. టీడీపీ నిరసనలపై నరేంద్ర మోదీ బీజేపీ ప్రజా చైతన్య సభలో మాట్లాడుతూ... ‘టీడీపీ వాళ్లు నల్ల బెలూన్లు ఎగరేసి మాకు దిష్టి తీశారు. మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఇది మాకు శుభ సూచకం. ఢిల్లీ వెళ్లి మళ్లీ అధికార పీఠంపై కూర్చోమని గో బ్యాక్ అంటున్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ మేమే అధికారంలోకి వస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ సందర్భంగా టీడీపీకి ధన్యవాదాలు చెబుతున్నాను. ఈసారి కూడా అధికారం మాదే’ అని స్పష్టం చేశారు.
ఒక ముఖ్యమంత్రిగా నేను కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అందుకే 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ప్రజలకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించా. ప్రజల పట్టుదల, కష్టపడే తత్వం, వినయం, సంస్కృతి ప్రపంచానికి తెలుసు. కానీ కొద్దిరోజులుగా చంద్రబాబు తనకు తెలిసిన తిట్లన్నీ మోదీపైనే వాడుతున్నారు. ఆంధ్రుల గౌరవాన్ని కించపరిచే హక్కు చంద్రబాబుకు ఎవరిచ్చారు. కొద్దిరోజులుగా మీరు నన్ను తిడుతూనే ఉన్నారు. కానీ నేను నోటికి తాళం వేసుకుని ఉన్నాను. ఒక్కమాట కూడా మాట్లాడలేదు. మీరు చెప్పిన తప్పుడు మాటలు ఎవరూ నమ్మరు. ఏపీలో ఉన్న తండ్రీకొడుకుల అవినీతి ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు చరమగీతం పాడతారని ప్రధాని వ్యాఖ్యానించారు.
చదవండి...
చంద్రబాబు భయంతో వణికిపోతున్నారు: మోదీ
గుంటూరు ప్రజలకు నమస్కారం: మోదీ
విజయవాడ చేరుకున్న ప్రధాని మోదీ