ప్రభుత్వ దొంగబుద్ధిని అసెంబ్లీలో బయటపెడతాం
⇒ మాజీ మంత్రి పార్ధసారథి
⇒ మినప రైతులకు న్యాయం జరిగేలా పోరాటం
⇒ 28న పెనమలూరులో ధర్నా
⇒ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపు
ఉయ్యూరు : మినుము రైతును ఆదుకోవడంలో ప్రభుత్వ దొంగబుద్ధిని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో నిలదీస్తారని ఆ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కొలుసు పార్ధసారథి తెలిపారు. ఉయ్యూరులోని పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజులపాటి రామచంద్రరావు కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మినుము పంట నష్టపోయి ఆర్థికంగా కుంగిపోయి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులను ప్రభుత్వం మరోసారి వెన్నుపోటు పొడిచిందన్నారు. ఫిబ్రవరి 15 నుంచే మినుము పంటను రైతులు పీకేస్తారని తెలిసి నెలాఖరుకు ఎన్యుమరేషన్ చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ఉద్దేశపూర్వకంగా రైతులను మోసం చేసేందుకేనని స్పష్టం చేశారు.
రైతులందరూ పంట పొలాలను దమ్ము చేసి దాళ్వా సాగు చేశారని, కొందరు పశువులు, గొర్రెల మేతకు వదిలేశారని చెప్పారు. పదిహేను రోజులు ముందుగానే వైఎస్సార్ సీపీ మినుము పంట నష్టంపై స్పష్టమైన వైఖరిని ప్రకటించిందన్నారు. అసలు ఎంత మంది రైతులు మినుము పంట సాగు చేశారో అనే లెక్క మీ దగ్గర ఉందా? లేదా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
మినుము రైతుకు న్యాయం జరిగేలా కృషి..
అసెంబ్లీలో మినుము రైతు అంశంపై చర్చకు పట్టుబట్టి న్యాయం జరిగేలా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తారని పార్ధసారథి తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు దమ్ము ధైర్యం ఉంటే సీఎంతో మాట్లాడి రైతులకు న్యాయం చేయాలని సూచించారు. ఎన్యుమరేషన్ తీరును నిరసిస్తూ, రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28న పెనమలూరు నియోజకవర్గంలో ధర్నా చేస్తామని ప్రకటించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గ సమన్వయకర్తలతో చర్చించి జిల్లా వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిస్తామన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగవీటి శ్రీనివాసప్రసాద్, పెనమలూరు, ఉయ్యూరు టౌన్ అధ్యక్షులు కిలారు శ్రీనివాసరావు, జంపాన కొండలరావు తదితరులు పాల్గొన్నారు.