హలో.. బ్లడ్ కావాలండీ..!.
- బ్లడ్ ఆన్ కాల్‌కు విశేష స్పందన
- ప్రజల్లో ఇప్పుడిప్పుడే పెరుగుతున్న అవగాహన
- రవాణాకు జిల్లాలో ద్విచక్రవాహనం
సాక్షి, ముంబై: రాష్ట్రంలో ‘బ్లడ్ ఆన్ కాల్ (104)’కు ఇప్పుడిప్పుడే మంచి స్పందన లభిస్తోంది. ఈ సేవలను జనవరి 6వ తేదీన ప్రారంభించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 7,000 కాల్స్ వచ్చాయి. వాటిలో అవసరమైన 4,750 మందికి బ్లడ్ బ్యాగులను పంపిణి చేశామని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఈ సందర్భంగా స్టేట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కౌన్సిల్ (ఎస్‌బీటీసీ) సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. రోజూ కనీసం 55 కాల్స్ వస్తున్నాయి. చాలావరకు అత్యవసర కేసులకు సంబంధించినని కావు.. రోగులకు చికిత్స, శస్త్రచికిత్స అందజేసేందుకుగాను నిలువ ఉంచేందుకు ఫోన్ చేస్తుంటారు..’ అని తెలిపారు.
ఇందులో సిజేరియన్, ప్రసూతి ఇతర అత్యవసర చికిత్సల నిమిత్తం ఎక్కువగా ఫోన్ కాల్స్ వస్తుంటాయన్నారు. అలాంటప్పుడు తమకు వచ్చిన ఫోన్ కాల్స్‌ను సమీప బ్లడ్ బ్యాంక్‌లకు కనెక్ట్ చేస్తామని అధికారి చెప్పారు. కాగా, బ్లడ్ ఆన్ కాల్ సేవల కోసం ద్విచక్రవాహనాలు ఉపయోగిస్తున్నారు. వీటికి బ్లడ్‌ను రవాణా చేసేందుకు ఐస్ బాక్సులను అమరుస్తారు. కాగా వీరు ఈ బ్లడ్‌ను గంట లోగానే ఆస్పత్రులకు తరలించాల్సి ఉంటుందని ఎస్‌బీటీసీ అధికారి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఈ వాహనాలను నడిపేందుకు ముగ్గురు వ్యక్తులను అందుబాటులో ఉంచారు.
ఇదిలా వుండగా ముంబై నగరవ్యాప్తంగా తొమ్మిది బ్లడ్ స్టోరేజ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారి తెలిపారు. సమీపంలో ఉన్న స్టోరేజ్ యూనిట్‌తో జిల్లా బ్లడ్ బ్యాంక్ సమన్వయం కలిగి ఉంటుంది. తర్వాత రైడర్ అవసరమున్న వారికి ఈ బ్లడ్‌ను డెలివరి చేస్తారు.
కాగా, తాము ఇప్పటివరకు దాదాపు 190 ఆస్పత్రులకు, నర్సింగ్ హోమ్‌లకు బ్లడ్ బ్యాగ్‌లను అందజేశామన్నారు. అయితే చాలా మంది ఈ సేవలకు సంబంధించి ఫోన్‌కాల్స్ చేసి విచారిస్తున్నారని, నగర వాసుల్లో వీటిపై అవగాహన పెరుగుతోందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సంబంధం లేని కాల్స్‌ను రిసీవ్ చేసుకోవడం లేదని ఆ అధికారి తెలిపారు. రోజుకు దాదాపు 55 కాల్స్ రిసీవ్ చేసుకుంటున్నామన్నారు.