Boddu Bhaskar Rao
-
తెలుగు తమ్ముళ్ల ఢీ అంటే ఢీ
పెదపూడి (అనపర్తి): పెదపూడి మండలం పెద్దాడ గ్రామంలో శుక్రవారం జరిగిన జన్మభూమి గ్రామ సభలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు వర్గాల మధ్య గలాటా చోటు చేసుకుంది. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న సామాజిక భవనంలో జన్మభూమి మా ఊరు గ్రామ సభ శుక్రవారం నిర్వహించారు. సభకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఇదే గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు హాజరయ్యారు. సభలో భాస్కరరామారావు మాట్లాడుతూ గతంలో గ్రామంలో మన ఇంటికి మన ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించినప్పుడు ‘ఒక సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు.. 40 ఏళ్లు వివిధ పదవులు చేపట్టి ఆ సామాజిక వర్గానికి చెందిన గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి చేయలేదంటూ’ ఎందుకు విమర్శించారంటూ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని నిలదీశారు. అప్పటికే ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ వర్గీయులతో పాటు పోలీసు బలగాలు కూడా భారీగా మోహరించి ఉన్నాయి. భాస్కరరామారావు లేవనెత్తిన అంశాన్ని పట్టించుకోకుండా ఎమ్మెల్యే ప్రభుత్వ పథకాలపై మాట్లాడుతుండగా స్థానికుడు లేచి భాస్కరరామారావు అడిగిన దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఎమ్మెల్యే వర్గీయులు అభివృద్ధి పనులపై మాట్లాడిన అనంతరం సమాధానం చెబుతారని చెప్పడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని గందరగోళానికి దారి తీసింది. వెంటనే కొంతమంది బొడ్డు భాస్కరరామారావును మీ విషయం ఎమ్మెల్యేకు చెప్పండి సమాధానం చెబుతారని చెప్పారు. దీనిపై భాస్కరరామారావు మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన అనిశెట్టి బుల్లబ్బాయిరెడ్డి, నల్లమిల్లి శేషారెడ్డి, పిల్లి అనంతలక్ష్మి, నాయకర్ మొదలగు వారు గ్రామానికి వచ్చి వారి పాలనను వారు సాగించుకున్నారన్నారు. గ్రామంలో ఒక అనామకుడ్ని వెంట వేసుకుని పాలన చేస్తున్నారని అనడంతో ఆ అనామకుడు ఎవరంటూ ఎమ్మెల్యే వర్గీయులు బొడ్డు సతీష్, సత్తిరాజు తిరిగి ప్రశ్నించడంతో తోపులాట మొదలైంది. దీంతో పోలీసులు వెంటనే లాఠీచార్జి చేశారు. ఇరువర్గాల వారిని అక్కడ నుంచి తరిమి వేశారు. ఎమ్మెల్యే టీడీపీ నేత బొడ్డు సత్తిరాజు ఇంటికి వెళ్లారు. బొడ్డు భాస్కరరామారావును పోలీసుల పర్యవేక్షణలో ఇంటికి పంపించేశారు. దీంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. అవినీతి పరుడిగా ఎమ్మెల్యే... పార్టీలో వ్యక్తుల మధ్య గొడవలు జరిగితే వాటిని పరిష్కరించకుండా తప్పుడు కేసులు పెట్టించి నాయకులను పార్టీకి దూరం చేస్తున్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై అధిష్టానికి ఫిర్యాదు చేస్తానని బొడ్డు భాస్కరరామారావు విలేకర్లకు తెలిపారు. ఎమ్మెల్యే తీరును ఖండిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే పెద్ద అవినీతి పరుడిగా తయారయ్యారంటూ ఆరోపించారు. ఆయన చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తామన్నారు. -
వైఎస్సార్ సీపీకి జనసేన నేతల మద్దతు
కొవ్వూరుటౌన్/ భీమవరం అర్భన్, న్యూస్‌లైన్ : వైఎస్సార్ సీపీకి మద్దతు తెలుపుతున్నట్టు కొవ్వూరు, భీమవరం పట్టణాల్లోని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రకటించారు.మంగళవారం పెరవలిలో జనసేన కార్యకర్తలు నిడదవోలు వైఎస్సార్ సీపీ అభ్యర్థి రాజీవ్ కృష్ణకు సంఘీభావం ప్రకటించగా బుధవారం కొవ్వూరు, భీమవరంలో ఆ పార్టీ నేతలు వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు మద్దతు తెలిపారు. కొవ్వూరు నియోజకవర్గ జనసేన యూత్ వైఎస్సార్ సీపీ పార్లమెంటు, ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతు తెలుపుతున్నట్టు పవన్ కల్యాణ్ రిజిస్టర్డ్ ఫ్యాన్స్ పట్టణ అధ్యక్షుడు గంటా చిరంజీవి బుధవారం ప్రకటించారు. ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పరిమి హరిచరణ్ తదితర నాయకుల సమక్షంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టో సమాజంలోని అన్ని వర్గాలకు మేలు చేసేదిగా ఉందని చిరంజీవి చెప్పారు. చంద్రబాబు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే జొన్నకూటి బాబాజీరావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు బండి పట్టాభి రామారావు, జనసేన యూత్ డేగల రాము, అల్లు శ్రీను, నాయుడు బాబ్జి, ఆవుల వాసు, ముత్యాల సాయి, మహరాజు వాసు, కళ్లేపల్లి శ్రీను, మట్టా సతీష్ పాల్గొన్నారు. -
రానున్నది వైఎస్సార్ సీపీ ప్రభంజనమే
కడియం, న్యూస్‌లైన్ : రానున్నది వైఎస్సార్ సీపీ ప్రభంజనమేనని ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు అన్నారు. సోమవారం వీరవరంలో రాజమండ్రి రూరల్ అసెంబ్లీ అభ్యర్థి ఆకుల వీర్రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొడ్డు మాట్లాడుతూ సంక్షేమరాజ్య స్థాపనే జగన్ మోహన్‌రెడ్డి లక్ష్యమన్నారు. వైఎ స్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పార్టీలో పలువురి చేరిక వివిధ గ్రామాల నుంచి పలువురు నాయకులు వైఎస్సార్ సీపీలో చేరారు. కీలకనేతలు ఆకుల వీర్రాజుకు మద్దతునిచ్చారు. జెడ్పీటీసీ మాజీ సభ్యులు దొంతంశెట్టి వీరభద్రయ్య, బత్తుల రా ము, మాజీ ఎంపీటీసీ సభ్యులు రేమళ్ల ప్రసాద్, లంక కనకారావు, రేమళ్ల పరమేష్, వీరవరం సర్పంచ్ పరమటి భాగ్యవతి, ఉప సర్పంచ్ కొత్తపల్లి లక్ష్మణరావు, దొంతంశెట్టి చినవీర్రాజు, బత్తుల బ్రహ్మయూత్ సభ్యులు, చేనేత సొసైటీ అధ్యక్షుడు కర్రా సూర్యచంద్రరావు, ఆదిమూ లం పెద్దబ్బు, దొంతంశెట్టి ఏకాంబరం, దోర శ్రీనివాసు సహా వందలాది మంది పార్టీలో చేరా రు. వీరిని బొడ్డు, ఆకుల సాదరంగా ఆహ్వానిం చారు. పొట్టిలంకలో సొసైటీ మాజీ అధ్యక్షుడు పాటంశెట్టి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో వందమంది, మురమండలో పలువురు చేనేత నాయకులు పార్టీలో చేరారు. రావి పాటి రామచంద్రరావు, యాదల సతీష్‌చంద్రస్టాలిన్, గిరజాల బాబు, దాసరి శేషగిరి పాల్గొన్నారు. -
స్థానిక సంస్థలను జగన్‌కు కానుకగా ఇవ్వండి
దేవరపల్లి, న్యూస్‌లైన్ : స్థానిక సంస్థల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి కానుకగా ఇవ్వాలని వైఎస్సార్ సీపీ నేత, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు శ్రేణులకు పిలుపునిచ్చారు. దేవరపల్లిలో ఆదివారం గోపాలపురం నియోజకవర్గస్థాయి పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపొందే అభ్యర్థులను గుర్తించి ఎంపిక చేయాలని స్థానిక నేతలను కోరారు. ఇతర పార్టీల నుంచి వైసీపీలోకి రావటానికి సిద్ధంగా ఉన్న నాయకులు, కార్యకర్తలను ఆహ్వానించాలన్నారు. గత ప్రభుత్వ అసమర్ధత వల్లే ఎన్నడూ లేనట్టుగా వరుసగా ఎన్నికలు వచ్చాయని భాస్కర రామారావు విమర్శించారు. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు బొడ్డు అనంత వెంకట రమణ చౌదరి మాట్లాడుతూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ద్వారా పార్టీ బలం నిర్ధారణ అవుతుందన్నారు. పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సమాయత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో సాధించే విజయాలు సార్వత్రిక ఎన్నికలకు పునాదులవుతాయన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నాలుగు సంక్షేమ పథకాలను కార్యకర్తలు విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారు. సభకు మండల కన్వీనర్ గడా జగదీష్ అధ్యక్షత వహించారు. ఏఎంసీ మాజీ చైర్మన్ ఎన్.రాజేద్రబాబు, జిల్లా కమిటీ సభ్యులు ఇళ్ల భాస్కరరావు, పెన్మత్స రంగరాజు, గోపాలపురం మండల కన్వీనర్ ముల్లంగి శ్రీనివాసరెడ్డి, జిల్లా రైతు విభాగం కన్వీనర్ కాండ్రేగుల శ్రీహరి, జిల్లా కమిటీ సభ్యులు వెలగా శ్రీరామూర్తి, కాట్నం రాంబాబు, పోలిన నారాయణరావు, కారుమంచి రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
పార్టీ వీడే ప్రసక్తేలేదు: వైఎస్సార్సీపీ
ఆ పత్రిక కథనం అవాస్తవం, హాస్యాస్పదం: తోట చంద్రశేఖర్ 20, 30 ఏళ్లపాటు జగన్‌తోనే: బొడ్డు భాస్కర రామారావు సాక్షి, హైదరాబాద్: తాము పార్టీని వీడిపోతున్నామని ఒక పత్రికలో వచ్చిన కథనం అసత్యం, అవాస్తవం, హాస్యాస్పదమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు లోక్‌సభా నియోజకవర్గం పరిశీలకులు తోట చంద్రశేఖర్, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు స్పష్టంచేశారు. ఆ పత్రికలో ఇలాంటి కథనాలు రాసే ముందు మీడియా విలువలు పాటించి తమను కూడా వివరణ కోరి ఉంటే బాగుండేదన్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద బుధవారం వారు మీడియాతో మాట్లాడుతూ పార్టీ వీడుతున్నట్లు వచ్చిన కథనాలను ఖండించారు. చంద్రశేఖర్ ఏమన్నారంటే... - పశ్చిమగోదావరి జిల్లాలో పార్టీని పటిష్టం చేయడానికి మేమంతా ప్రజల్లో విసృ్తతంగా తిరుగుతుంటే ఇలాంటి తప్పుడు కథనాలు రావడం విడ్డూరం. ఏలూరు లోక్‌సభా నియోజకవర్గం పరిధిలోని ఏడింటికి ఏడు అసెంబ్లీ స్థానాలను గెల్చుకునే దిశగా మేము ప్రయత్నిస్తున్నాం. - ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారు, పార్టీ టికెట్లు ఆశించి భంగపడ్డ వారు పనిగట్టుకుని తమ పార్టీలో నేతలకు గౌరవం లేదనే ప్రచారం చేస్తున్నారు. వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరంలేదు. భాస్కరరామారావు ఏమన్నారంటే... - ‘మిడిల్ డ్రాప్’ అనే శీర్షికన వార్త ప్రచురించిన ఆ పత్రిక యజమానికి పేకాట బాగా అలవాటేమో, అందుకే అలాంటి వార్తలు రాస్తున్నారు. - రానున్న 20, 30 ఏళ్ల పాటు వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి నడవాలనే ఉద్దేశంతోనే నా కుమారుడు వెంకటరమణ చౌదరి ఆ పార్టీలో చేరి విసృ్తతంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. - నేను 1972 నుంచీ సర్పంచ్‌గా, జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా, రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి వ్యక్తిత్వం ఉన్న నాయకుడిని. నాపై ఇలాంటి రాతలు రాయడమేంటి? - ఓ పత్రిక తమ సర్క్యులేషన్ పెంచుకోవడానికి, ఓ చానెల్ తన రేటింగ్ పెంచుకోవడానికి ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తున్నాయి. ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేస్తే మా పార్టీ కార్యకర్తలు వాటి యాజమాన్యాలకు గుణపాఠం చెప్పే పరిస్థితి రానీయవద్దు. -
'ఆంధ్రజ్యోతిలో అసత్య కథనాలు'
-
'ఆంధ్రజ్యోతిలో అసత్య కథనాలు'
హైదరాబాద్: ఆంధ్రజ్యోతి దినపత్రిక అసత్య కథనాలు ప్రచురించి తమపైనా, పార్టీపైనే బురద చెల్లించేందుకు కుట్ర పన్నిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తోట చంద్రశేఖర్, బొడ్డు భాస్కరరావు ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ సీపీలో పలువురు నేతలు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారంటూ ఆ పత్రిక ప్రచురించిన కథనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పార్టీ మారుతాననంటూ ఆ పత్రికలో వచ్చిన వార్తలు అవాస్తవమని తోట చంద్రశేఖర్ అన్నారు. వైఎస్ఆర్ సీపీలో తనకు ఎలాంటి ఇబ్బందులూ లేవని, వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీ తరపునే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఆంధ్రజ్యోతిలో ఇలాంటి కథనాలు రాసేముందు తమను సంప్రదించి ఉంటే బాగుండేదని తోట చంద్రశేఖర్ హితవు పలికారు. వైఎస్ఆర్ సీపీ నేత బొడ్డు భాస్కరరావు మాట్లాడుతూ.. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ రేటింగ్ పెంచుకోవడం కోసం ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారు విమర్శించారు. ఉభయగోదావరి జిల్లాల్లో బలంగా ఉన్న వైఎస్ఆర్ సీపీ దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి కథనాలు ప్రచురిస్తున్నారని అన్నారు. పొలిటికల్ ఎజెండాతో ఇలాంటి కథనాలు ప్రచురించడం వల్ల పత్రికల పట్ల విలువ ఉండదని బొడ్డు భాస్కరరావు పేర్కొన్నారు.