
స్థానిక సంస్థలను జగన్‌కు కానుకగా ఇవ్వండి
దేవరపల్లి, న్యూస్‌లైన్ :
స్థానిక సంస్థల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించి పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కానుకగా ఇవ్వాలని వైఎస్సార్ సీపీ నేత, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు శ్రేణులకు పిలుపునిచ్చారు. దేవరపల్లిలో ఆదివారం గోపాలపురం నియోజకవర్గస్థాయి పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపొందే అభ్యర్థులను గుర్తించి ఎంపిక చేయాలని స్థానిక నేతలను కోరారు.
ఇతర పార్టీల నుంచి వైసీపీలోకి రావటానికి సిద్ధంగా ఉన్న నాయకులు, కార్యకర్తలను ఆహ్వానించాలన్నారు. గత ప్రభుత్వ అసమర్ధత వల్లే ఎన్నడూ లేనట్టుగా వరుసగా ఎన్నికలు వచ్చాయని భాస్కర రామారావు విమర్శించారు. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు బొడ్డు అనంత వెంకట రమణ చౌదరి మాట్లాడుతూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ద్వారా పార్టీ బలం నిర్ధారణ అవుతుందన్నారు. పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సమాయత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో సాధించే విజయాలు సార్వత్రిక ఎన్నికలకు పునాదులవుతాయన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నాలుగు సంక్షేమ పథకాలను కార్యకర్తలు విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారు. సభకు మండల కన్వీనర్ గడా జగదీష్ అధ్యక్షత వహించారు. ఏఎంసీ మాజీ చైర్మన్ ఎన్.రాజేద్రబాబు, జిల్లా కమిటీ సభ్యులు ఇళ్ల భాస్కరరావు, పెన్మత్స రంగరాజు, గోపాలపురం మండల కన్వీనర్ ముల్లంగి శ్రీనివాసరెడ్డి, జిల్లా రైతు విభాగం కన్వీనర్ కాండ్రేగుల శ్రీహరి, జిల్లా కమిటీ సభ్యులు వెలగా శ్రీరామూర్తి, కాట్నం రాంబాబు, పోలిన నారాయణరావు, కారుమంచి రమేష్ తదితరులు పాల్గొన్నారు.