ఇరువర్గాల తోపులాట మధ్య మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు
పెదపూడి (అనపర్తి): పెదపూడి మండలం పెద్దాడ గ్రామంలో శుక్రవారం జరిగిన జన్మభూమి గ్రామ సభలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు వర్గాల మధ్య గలాటా చోటు చేసుకుంది. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న సామాజిక భవనంలో జన్మభూమి మా ఊరు గ్రామ సభ శుక్రవారం నిర్వహించారు. సభకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఇదే గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు హాజరయ్యారు. సభలో భాస్కరరామారావు మాట్లాడుతూ గతంలో గ్రామంలో మన ఇంటికి మన ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించినప్పుడు ‘ఒక సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు.. 40 ఏళ్లు వివిధ పదవులు చేపట్టి ఆ సామాజిక వర్గానికి చెందిన గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి చేయలేదంటూ’ ఎందుకు విమర్శించారంటూ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని నిలదీశారు. అప్పటికే ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ వర్గీయులతో పాటు పోలీసు బలగాలు కూడా భారీగా మోహరించి ఉన్నాయి.
భాస్కరరామారావు లేవనెత్తిన అంశాన్ని పట్టించుకోకుండా ఎమ్మెల్యే ప్రభుత్వ పథకాలపై మాట్లాడుతుండగా స్థానికుడు లేచి భాస్కరరామారావు అడిగిన దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఎమ్మెల్యే వర్గీయులు అభివృద్ధి పనులపై మాట్లాడిన అనంతరం సమాధానం చెబుతారని చెప్పడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని గందరగోళానికి దారి తీసింది. వెంటనే కొంతమంది బొడ్డు భాస్కరరామారావును మీ విషయం ఎమ్మెల్యేకు చెప్పండి సమాధానం చెబుతారని చెప్పారు. దీనిపై భాస్కరరామారావు మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన అనిశెట్టి బుల్లబ్బాయిరెడ్డి, నల్లమిల్లి శేషారెడ్డి, పిల్లి అనంతలక్ష్మి, నాయకర్ మొదలగు వారు గ్రామానికి వచ్చి వారి పాలనను వారు సాగించుకున్నారన్నారు. గ్రామంలో ఒక అనామకుడ్ని వెంట వేసుకుని పాలన చేస్తున్నారని అనడంతో ఆ అనామకుడు ఎవరంటూ ఎమ్మెల్యే వర్గీయులు బొడ్డు సతీష్, సత్తిరాజు తిరిగి ప్రశ్నించడంతో తోపులాట మొదలైంది. దీంతో పోలీసులు వెంటనే లాఠీచార్జి చేశారు. ఇరువర్గాల వారిని అక్కడ నుంచి తరిమి వేశారు. ఎమ్మెల్యే టీడీపీ నేత బొడ్డు సత్తిరాజు ఇంటికి వెళ్లారు. బొడ్డు భాస్కరరామారావును పోలీసుల పర్యవేక్షణలో ఇంటికి పంపించేశారు. దీంతో ఉద్రిక్తత సద్దుమణిగింది.
అవినీతి పరుడిగా ఎమ్మెల్యే...
పార్టీలో వ్యక్తుల మధ్య గొడవలు జరిగితే వాటిని పరిష్కరించకుండా తప్పుడు కేసులు పెట్టించి నాయకులను పార్టీకి దూరం చేస్తున్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై అధిష్టానికి ఫిర్యాదు చేస్తానని బొడ్డు భాస్కరరామారావు విలేకర్లకు తెలిపారు. ఎమ్మెల్యే తీరును ఖండిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే పెద్ద అవినీతి పరుడిగా తయారయ్యారంటూ ఆరోపించారు. ఆయన చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment