బీజేపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి
నామినేషన్ల ఘట్టం ముగిసే రోజుల్లో కూటమిలో మరో హైడ్రామా
తమ పార్టీ అభ్యర్థి ఆయనే అన్న బీజేపీ చీఫ్ పురందేశ్వరి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి కట్టిన పార్టీల నడుమ మంగళవారం రాత్రి మరో హైడ్రా మా నడిచింది. పొత్తులో భాగంగా బీజేపీకి కేటా యించిన అనపర్తి నియోజకవర్గ నుంచి కూడా టీడీపీ నేతనే రంగంలోకి దింపేందుకు నాయకుడి మార్పు డ్రామా పూర్తయ్యింది. రెండు రోజుల్లో నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగుస్తున్న సమయంలో అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీకి కేటాయించిన అనపర్తి నియోజకవర్గం నుంచి మాజీ సైనికుడైన శివకృష్ణంరాజు పేరును పార్టీ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే.. అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం రాజమండ్రి లోక్‌సభ స్థానం పరిధిలో ఉంది. ఆ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనపర్తి నుంచి బీజేపీ జాతీయ నాయకత్వం ప్రకటించిన అభ్యర్థి కంటే ప్రస్తుత టీడీపీ ఇన్‌చార్జి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేస్తేనే ప్రయోజనం ఉంటుందనేలా కొంతకాలంగా పురందేశ్వరి రాజకీయాలు నెరుపుతున్నారు. మరోవైపు బీజేపీ జాతీయ నాయకత్వం ప్రకటించిన అభ్యర్థి శివకృష్ణంరాజును ప్రచారం చేసుకోనివ్వకుండా టీడీపీ నాయకులు అడ్డుపడుతూ వచ్చారు.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ శివకృష్ణంరాజు సోమవారం బీజేపీ తరఫున నామినేషన్ కూడా దాఖలు చేశారు. అనపర్తిలో బీజేపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసిన తరువాత కూడా టీడీపీ నేతను బీజేపీలో చేర్పించి.. ఆ పార్టీకి, పొత్తు ధర్మానికి వెన్నుపోటు పొడిచారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయాక పునరావాసం కోసం టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నాయకులే బీజేపీకి కేటాయించిన సీట్లలోనూ పోటీ చేస్తున్నారు. తొలి నుంచి బీజేపీలో రాజకీయాలు కొనసాగించిన నాయకులకు బీజేపీ మొండిచేయి చూపడంతో ఆ పార్టీ శ్రేణులు రగిలిపోతున్నారు.
మా అభ్యర్థి ఆయనే: పురందేశ్వరి
కాగా.. టీడీపీ అనపర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం రాత్రి విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. బీజేపీ జాతీయ కార్యదర్శి, ఏపీ ఎన్నికల ఇన్‌చార్జి అరుణ్‌సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. బీజేపీ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment