అనపర్తిలో ఆగ్రహజ్వాలలు
నల్లమిల్లికి జరిగిన అన్యాయంపై భగ్గుమన్న శ్రేణులు
టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై మండిపాటు
∙పార్టీ కరపత్రాలు, జెండా, సైకిల్ దహనం
ఇటీవల ఓ సభలో కుర్చీలు మడతబెట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపును తెలుగు తమ్ముళ్లు ఏ విధంగా అర్థం చేసుకున్నారో గానీ.. ఆయన తీరుపై రగిలిపోయి పార్టీ ఎన్నికల గుర్తయిన సైకిల్‌నే మడతపెట్టి తగలెట్టేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ‘పచ్చ’దండు అధిష్టానం తీరుపై దండెత్తుతోంది. టికెట్ల కేటాయింపుపై మండిపడుతోంది. చంద్రబాబు నమ్మించి మోసం చేస్తున్నారని ఆశావహులు రెబల్స్‌గా మారుతున్నారు. ఇండిపెండెంట్లుగా పోటీకి సిద్ధమవుతున్నారు.
సాక్షి, రాజమహేంద్రవరం/పెనుగంచిప్రోలు/సాక్షి ప్రతినిధి, కడప/సాక్షి, అమరావతి/అరకు: అనపర్తి అసెంబ్లీ స్థానాన్ని పొత్తుల్లో భాగంగా బీజేపీకి కేటాయించడాన్ని టీడీపీ శ్రేణులు తట్టుకోలేకపోయాయి. ఆగ్రహంతో ఊగిపోయాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి జరిగిన ద్రోహానికి కార్యకర్తలు భగ్గుమన్నారు. నల్లమిల్లి స్వగ్రామం రామవరంలో గురువారం పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలకు దిగారు. టీడీపీ కరపత్రాలు, పార్టీ జెండాలు కుప్పగా పోసి తగులబెట్టారు. అందులో సైకిల్‌ను వేసి దహనంచేశారు. ఇంటిపైకి వెళ్లి దూకేందుకు ఓ కార్యకర్త ప్రయత్నించాడు.
చంద్రబాబుకు, టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్లమిల్లికి టికెట్ ఇచ్చే వరకూ వెనక్కు తగ్గేది లేదని కుండబద్దలు కొట్టారు. కట్టప్ప రాజకీయాలు మానుకోవాలని బాబును హెచ్చరించారు. దీంతో రామవరం గ్రామం అట్టుడికింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి భావోద్వేగానికి గురయ్యారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తన జీవితంతో ఆడుకున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు. టీడీపీ కోసం ఐదేళ్ల పాటు తన ప్రాణాన్ని, కుటుంబాన్ని పణంగా పెట్టానని ఆవేదన చెందారు.
కార్యకర్తల అభీష్టం మేరకు భవిష్యత్తు నిర్ణయం ప్రకటిస్తానన్నారు. తాను, తన కుటుంబం ఐదురోజులపాటు నియోజకవర్గంలో పర్యటిస్తామని, ప్రజలు, కార్యకర్తల అభిప్రాయాలను తీసుకుని ఎన్నికల్లో పోటీపై తుది నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించారు. నల్లమిల్లి టీడీపీ రెబల్‌గా బరిలోకిదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనపర్తి సీటును బీజేపీకి కేటాయిస్తారని మూడురోజులుగా ప్రచారం జరుగుతోంది. అప్పటి నుంచి నల్లమిల్లి వర్గం ఆందోళన చెందుతోంది. నిరసన వ్యక్తం చేస్తోంది.
బీజేపీ బుధవారం అభ్యర్థిని ప్రకటించగానే ఒక్కసారిగా నల్లమిల్లి అనుచరులు రగిలిపోయారు. ఇద్దరు కార్యకర్తలు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇదిలా ఉంటే ఏ పార్టీ అయినా పొత్తు ధర్మాన్ని పాటించాలని బీజేపీ అభ్యర్థి శివరామకృష్ణం రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కలిసి సహకరించాలని కోరతానని వెల్లడించారు. రాష్ట్ర బీజేపీ పెద్దల నిర్ణయం మేరకు ముందుకెళ్తానని స్పష్టం చేశారు.
♦ వై నాట్ పులివెందుల అంటూ ప్రగల్బాలు పలికే చంద్రబాబుకు వైఎస్సార్ జిల్లా కడప లోక్‌సభ స్థానంలో పోటీకి అభ్యర్థి దొరకడం లేదు. దీంతో రకరకాల పేర్లతో టీడీపీ ఐవీఆర్‌ఎస్ సర్వే చేపడుతోంది. తాజాగా ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పేరుతో గురువారం ఐవీఆర్‌ఎస్ సర్వే చేపట్టింది. ఈ సీటులో పోటీకి ఇప్పటికే ఐదుగురి పేర్లు తెరపైకి వచ్చాయి.
వాస్తవానికి ఈ స్థానానికి అభ్యర్థిగా ఏడాది క్రితమే ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాసులరెడ్డిని చంద్రబాబు ప్రకటించారు. శ్రీనివాసులురెడ్డి పోటీకి విముఖత చూపడంతో మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, జమ్మలమడుగు, బద్వేల్ ఇన్‌చార్జిలు భూపేష్‌రెడ్డి, రితీష్‌రెడ్డి పేర్లతోనూ టీడీపీ ఐవీఆర్‌ఎస్ సర్వే చేపట్టింది. ఓదశలో వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ పేరూ వినిపించింది.
కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పోటీచేస్తారని వార్తలు వచ్చాక సౌభాగ్యమ్మ పేరు కనుమరుగైంది. తాజాగా ఆరోవ్యక్తిగా గండ్లూరు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పేరును టీడీపీ పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈయన ప్రొద్దుటూరు అసెంబ్లీ సీటును ఆశించి భంగపడ్డారు. దీంతో ప్రవీణ్‌ను కడప లోక్ సభ నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు యోచిస్తున్నారు.
♦ రాష్ట్ర బీజేపీలో అభ్యర్థులనూ చంద్రబాబు నిర్ణయిస్తున్నారంటూ బద్వేల్ బీజేపీ సీనియర్ నాయకుడు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమాల ద్వారా ప్రజల్లోంచి వచ్చిన తనలాంటి దళిత నాయకులకు అన్యాయం చేస్తూ టీడీపీకి చెందిన రోశన్నకు టికెట్ ఇవ్వడంపై మండిపడ్డారు. బీజేపీ నాయకత్వం ఇకనైనా పార్టీని నమ్ముకున్న వ్యక్తులకు గుర్తింపు ఇవ్వాలంటూ గురువారం విజయవాడలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఫ్లకార్డులతో నిరసనకు దిగారు.
20ఏళ్లపాటు పార్టీకి సేవ చేసిన తనలాంటి యువకుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని కోరారు. చంద్రబాబు హయాంలో ప్రజాస్వామ్యం అంటే అర్థం తెలియని ఆయన కుమారుడు లోకేష్ కనీసం ఎమ్మెల్యేగా గెలవకుండానే పదవులు అనుభవించారని ఎద్దేవా చేశారు.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) తీరుపై తెలుగు తమ్ముళ్లు మండిపడ్డారు. పెనుగంచిప్రోలు మండలం మునేరు అవతల నూతలపాటి కన్వెన్షన్‌లో గురువారం టీడీపీ రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి, ఓ చానల్ ఎండీ బొల్లా రామకృష్ణ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి తాతయ్య మాట్లాడిన తీరు అభ్యంతరకరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనను వైఎస్సార్ సీపీ నుంచి వచ్చానని చెబుతున్నారని, తాతయ్య కాంగ్రెస్‌లో నుంచే టీడీపీలోకి వచ్చిన సంగతి మరచిపోతే ఎలా అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం భారీగా ఖర్చుచేశానని, అందుకే సీటు ఆశించానని పేర్కొన్నారు. తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డానని తాతయ్య ఆరోపించడం అసంబద్ధమని, ఆయన మీడియా ముఖంగా క్షమాపణ కోరాలని, లేకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేసి సత్తా చాటుతానని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment