
పార్టీ వీడే ప్రసక్తేలేదు: వైఎస్సార్‌సీపీ
ఆ పత్రిక కథనం అవాస్తవం, హాస్యాస్పదం: తోట చంద్రశేఖర్
20, 30 ఏళ్లపాటు జగన్‌తోనే: బొడ్డు భాస్కర రామారావు
సాక్షి, హైదరాబాద్: తాము పార్టీని వీడిపోతున్నామని ఒక పత్రికలో వచ్చిన కథనం అసత్యం, అవాస్తవం, హాస్యాస్పదమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు లోక్‌సభా నియోజకవర్గం పరిశీలకులు తోట చంద్రశేఖర్, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు స్పష్టంచేశారు. ఆ పత్రికలో ఇలాంటి కథనాలు రాసే ముందు మీడియా విలువలు పాటించి తమను కూడా వివరణ కోరి ఉంటే బాగుండేదన్నారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద బుధవారం వారు మీడియాతో మాట్లాడుతూ పార్టీ వీడుతున్నట్లు వచ్చిన కథనాలను ఖండించారు. చంద్రశేఖర్ ఏమన్నారంటే...
- పశ్చిమగోదావరి జిల్లాలో పార్టీని పటిష్టం చేయడానికి మేమంతా ప్రజల్లో విసృ్తతంగా తిరుగుతుంటే ఇలాంటి తప్పుడు కథనాలు రావడం విడ్డూరం. ఏలూరు లోక్‌సభా నియోజకవర్గం పరిధిలోని ఏడింటికి ఏడు అసెంబ్లీ స్థానాలను గెల్చుకునే దిశగా మేము ప్రయత్నిస్తున్నాం.
- ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారు, పార్టీ టికెట్లు ఆశించి భంగపడ్డ వారు పనిగట్టుకుని తమ పార్టీలో నేతలకు గౌరవం లేదనే ప్రచారం చేస్తున్నారు. వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరంలేదు.
భాస్కరరామారావు ఏమన్నారంటే...
- ‘మిడిల్ డ్రాప్’ అనే శీర్షికన వార్త ప్రచురించిన ఆ పత్రిక యజమానికి పేకాట బాగా అలవాటేమో, అందుకే అలాంటి వార్తలు రాస్తున్నారు.
- రానున్న 20, 30 ఏళ్ల పాటు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి నడవాలనే ఉద్దేశంతోనే నా కుమారుడు వెంకటరమణ చౌదరి ఆ పార్టీలో చేరి విసృ్తతంగా కార్యక్రమాలు
చేపడుతున్నారు.
- నేను 1972 నుంచీ సర్పంచ్‌గా, జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా, రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి వ్యక్తిత్వం ఉన్న నాయకుడిని. నాపై ఇలాంటి రాతలు రాయడమేంటి?
- ఓ పత్రిక తమ సర్క్యులేషన్ పెంచుకోవడానికి, ఓ చానెల్ తన రేటింగ్ పెంచుకోవడానికి ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తున్నాయి. ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేస్తే మా పార్టీ కార్యకర్తలు వాటి యాజమాన్యాలకు గుణపాఠం చెప్పే పరిస్థితి రానీయవద్దు.