bogan
-
సింధూర..
‘జయం’ రవి, అరవింద్ స్వామి హీరోలుగా, హన్సిక హీరోయిన్గా తెరకెక్కిన తమిళ చిత్రం ‘బోగన్’. లక్ష్మణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ చిత్రాన్ని అదే పేరుతో ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి తెలుగు ప్రేక్షకులకి అందిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘సింధూర..’ పాటను శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్ తాళ్లూరి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా తెలుగు ట్రైలర్‌కు విశేషమైన స్పందన రావడం మా టీమ్‌కి సంతోషంగా అనిపించింది. తమిళ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ డి. ఇమ్మాన్ ట్యూన్ చేసిన ‘సింధూర..’ పాటను తెలుగులో సమీర భరధ్వాజ్ ఆలపించారు. భువనచంద్రగారు ఈ పాటకు లిరిక్స్ అందించారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
రీమేక్‌ను పక్కన పెట్టేసిన మాస్ మహరాజ్
రెండేళ్ల విరామం తరువాత బ్లాక్ బస్టర్సక్సెస్ తో రీ ఎంట్రీ ఇచ్చాడు మాస్ మహరాజ్ రవితేజ. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన రాజా ది గ్రేట్ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో వరుస సినిమాలకురెడీ అవుతున్నాడు రవితేజ. ఇప్పటికే టచ్ చేసి చూడు సెట్స్‌మీద ఉండగా, శ్రీనువైట్ల దర్శకత్వంలో మరో సినిమా అంగీకరించాడు. ఈ రెండు సినిమాలతో పాటు తమిళ సూపర్ హిట్ భోగన్ను రవితేజ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా రవితేజ ఈ రీమేక్‌ను తప్పుకున్నాడన్న ప్రచారం జరుగుతోంది. తమిళ్లో జయం రవి, అరవింద్ స్వామిలు ప్రధాన పాత్రల్లో తెరకకెక్కిన ఈ సినిమా కోలీవుడ్ లో భారీ వసూళ్లు సాదించింది. అయితే ఈ సినిమా తెలుగు రీమేక్‌లో జయం రవి పాత్రకు రవితేజను తీసుకున్నారు. కానీ అరవింద్ స్వామి పాత్రకు సరైన నటుడు కుదరకపోవటంతో రవితేజ ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేశాడట. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ పై అధికారిక సమాచారం లేకపోయినా.. టచ్ చేసి చూడు సినిమా తరువాత రవితేజ శ్రీనువైట్ల సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. -
తెలుగులో మరోలా..!
సాక్షి, చెన్నై: ఒక భాషలో హిట్ అయిన చిత్రాలు ఇతర భాషల్లో రీమేక్ కావడం సహజమే. ఆ మధ్య తమిళ చిత్రం తనీఒరువన్ తెలుగులో రీమేక్ అయ్యింది. రామ్‌చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో తమిళంలో విలన్ గా నటించిన అరవిందస్వామినే తెలుగులోనూ నటించారు. అలా తెలుగులో రీమేక్ అవుతున్న మరో తమిళ చిత్రం బోగన్. తమిళంలో జయంరవి, అరవిందస్వామి కలిసి నటించిన ఇందులో హన్సిక నాయకి. లక్ష్మణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో పునర్నిర్మాణం కానుంది. లక్ష్మణ్‌నే దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో జయంరవి పాత్రలో రవితేజ నటించనున్నారట. కాగా అరవిందస్వామి పాత్రను తెలుగులోనూ ఆయననే నటించాలని కోరగా అందుకు నిరాకరించినట్లు ప్రచారం జరుగుతోంది. దీని గురించి దర్శకుడిని అడగ్గా అసలు బోగన్ చిత్రం తెలుగు రీమేక్‌లో నటించమని తాము అరవిందస్వామిని సంప్రదించలేదన్నారు. నిజం చెప్పాలంటే, తమిళంలో అరవిందస్వామి ఆ పాత్రను చాలా బాగా నటించారని, అందువల్ల నిర్మాత తెలుగులోనూ ఆయనే నటిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డ మాట వాస్తమేనన్నారు. అయితే ఈ పాత్ర తెలుగులో మరో విధంగా ఉంటుందని చెప్పారు. అందువల్ల తాను ఆ పాత్రకు అరవిందస్వామిని నటింపచేయాలని అనుకోలేదన్నారు. ఆ పాత్రకు తెలుగులో ఎస్జే.సూర్యను నటింపజేయాలని భావిస్తున్నానని అన్నారు. అయితే కొంత గ్యాప్ తరువాత విలన్ గా రీఎంట్రీ అయిన అరవిందస్వామి ఇప్పుడు మళ్లీ హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం చతురంగవేట్టై 2, భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు. అందుకే ఆయన మళ్లీ విలన్ గా నటిండానికి అంగీకరించడం లేదన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం. -
స్పీడు పెంచిన రవితేజ..!
బెంగాల్ టైగర్ సినిమా తరువాత ఏడాదికి పైగా వెండితెరకు దూరంగా ఉన్న రవితేజ ఇటీవల తిరిగి షూటింగ్‌లకు హాజరవుతున్నాడు. గ్యాప్‌లో ఫుల్ రీచార్జ్ అయిన మాస్ మహరాజ్ ఒకేసారి రెండు సినిమాలను పట్టాలెక్కించాడు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో రాజా ది గ్రేట్‌తో పాటు విక్రమ్ సిరి దర్శకత్వంలో టచ్ చేసి చూడు సినిమాల షూటింగ్లలో ఒకేసారి పాల్గొంటున్నాడు. ఈ రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగానే తాజాగా మరో సినిమాను అంగీకరించాడన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల తమిళ్లో ఘనవిజయం సాధించిన బోగన్ సినిమాను తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు. జయం రవి, అరవింద్ స్వామి హీరోలుగా తెరకెక్కిన బోగన్ సినిమాను తమిళ్లో డైరెక్ట్ చేసిన లక్ష్మణ్ తెలుగులోనూ డైరెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. జయం రవి పాత్రలో రవితేజ నటిస్తుండగా అరవింద్ స్వామి పాత్రకు తెలుగు టాప్ హీరోను సంప్రదిస్తున్నారట. త్వరలోనే ఈ రీమేక్‌పై చిత్రయూనిట్ క్లారిటీ ఇవ్వనుంది. -
జయంరవితో బాగుంటుంది!
నటుడు జయంరవితో నటిస్తున్నప్పుడు నాకు చాలా కంఫర్టబుల్‌గా ఉంటుందంటోంది నటి హన్సిక. దర్శకుల నటి, సక్సెస్ఫుల్ నటిలాంటి మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ నటించిన చిత్రాలు గత ఏడాది నాలుగు తెరపైకి వచ్చాయి. అలాంటిది తాజాగా కోలీవుడ్‌లో ఒక్క చిత్రం లేకపోవడం విశేషమే. ఇటీవల విడుదలైన బోగన్ చిత్రం మంచి విజయాన్నే అందుకుంది అయినా అవకాశాలు లేవు. ఏంటీ హన్సిక పనైపోయిందా?ఇక దుకాణం బందేనా? లాంటి చర్చ జరుగుతోంది.ఇత్యాధి విషయాల గురించి హన్సిక ఏం చెబుతుందో చూద్దాం.. ఏమిటి పరిస్థితి ఇలాగైందీ? చేతిలో ఒక్క చిత్రం కూడా లేదేం? నేను 2007 నుంచి కథానాయకిగా నటిస్తున్నాను.ఏడాదికి నాలుగైదు చిత్రాలు నటిస్తూ వచ్చాను. నేను టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నది 2012లోనే. నాకు క్వాంటిటీ ముఖ్యం కాదు.క్వాలిటీనే ప్రధా నం. ప్రస్తుతం చాలా కథలు వింటున్నాను.అందులో కొన్ని కథలను ఓకే చేశాను.సెలెక్టెడ్ చిత్రాలే చేస్తాను. విశాల్, శింబు, ధనుష్, జయంరవి, శివకార్తికేయన్ లాంటి ప్రముఖ హీరోలతో నటించిన మీరు ఇప్పుడు వర్దమాన నటులతో కూడా నటించడానికి సిద్ధం అంటున్నారటగా? జ: స్టార్ హీరోల సరసన మాత్రమే నటిస్తానని నేనేప్పుడూ చెప్పలేదే. మాన్‌కరాటే చిత్రంలో నటిస్తున్నప్పుడు ఆ చిత్ర హీరో శివకార్తీకేయన్ అప్పుడే ఎదుగుతున్న నటుడు. చిన్న నటుడు,పెద్ద నటుడు అన్న భేదాభిప్రాయాన్ని నేనెప్పుడూ వ్యక్తం చేయలేదు. జయంరవికి జంటగా నటిస్తున్నప్పుడు మాత్రమే చాలా సన్నిహితంగా నటిస్తారనే ప్రచారంపై మీ స్పందన? అవునా? ఇలాంటి ప్రచారం ఎవరు చేస్తున్నారోగానీ, రవితో నేనిప్పటికి మూడు చిత్రాలు చేశాను. నేను జయంరవికి ఫ్యామిలీ ఫ్రెండ్‌ను.ఆయన భార్య ఆర్తి నాకు మంచి స్నేహితురాలు. వారిద్దరూ నా వెల్‌విషర్స్. జయంరవితో కలిసి నటిస్తున్నప్పుడు నేను చాలా కంఫర్టబుల్‌గా ఫీలవుతాను.ఆయన ఎప్పుడూ చిరునవ్వుతో పాజిటీవ్ ఎనర్జీతో ఉంటారు. సినిమాల్లో మేము కంఫర్టబుల్ జంటగా కనిపించడం వల్లే మీరు అన్నట్లు కొందరు భావిస్తున్నారేమో. నటిగా దశాబ్దాన్ని పూర్తి చేసుకుంటున్నారు.అయినా చెక్కు చెదరని అందం.ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? మీ ప్రశ్నకు నాకు వయసైపోయిందేమోనన్న భయం కలుగుతోంది. నా వయసెంతనుకుంటున్నారు? నేను 16 ఏటనే నటిగా రంగప్రవేశం చేశాను.ఈ ఏడాది ఆగస్ట్ నెల వస్తే 26 ఏళ్లు వస్తాయి.ఇకపోతే నాకు ఆహారపు నియమాలంటే పెద్దగా ఏమీ ఉండవు. నచ్చిన ఆహారం అయితే పుల్గా లాగించేస్తా. మనసును సంతోషంగా ఉంచుకుంటే అందం పెరుగుతూ పోతుంది.యోగా మనసును, శరీరాన్ని మెరుగు పరిస్తుంది.నేను నిత్యం యోగా క్రమం తప్పకుండా చేస్తాను. -
దేవికి సీక్వెల్ ?
దేవి చిత్రానికి సీక్వెల్ ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే కోలీవుడ్ వర్గాల నుంచి వస్తోంది. దేవి చిత్ర కథానాయకుడు, నిర్మాత ప్రభుదేవా అన్న విషయం తెలిసిందే. కొన్నేళ్ల క్రితం దక్షిణాదిని విడిచి ఉత్తరాదికి వెళ్లి అక్కడ పలు హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రముఖ దర్శకుడిగా పేరు సాధించిన ప్రభుదేవా ఈ మధ్యనే మళ్లీ కోలీవుడ్‌కు తిరిగొచ్చి నిర్మాతగా అవతారమెత్తారు. ప్రభుదేవా స్టూడియోస్ చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి విజయ్ దర్శకత్వంలో దేవి చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మించి అందులో కథానాయకుడిగా నటించారు. తమన్నా నాయకిగా నటించిన ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జయంరవి, హన్సిక జంటగా బోగన్ చిత్రంతో పాటు సిల సమయంగళ్, వినోదన్ చిత్రాలు ఈయన నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో బోగన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. హీరోగా రీఎంట్రీలో మంచి విజయాన్ని అందించిన దేవి చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించే పనలో ప్రభుదేవా ఉన్నట్లు తాజా సమాచారం. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన పనులు ఇప్పటికే మొదలయ్యాయని తెలుస్తోంది. అయితే ఇందులో హీరోయిన్ గా మళ్లీ తమన్నానే నటిస్తారా? దర్శకుడెవరు? దేవి చిత్రం మాదిరిగానే ఈ చిత్రాన్ని మూడు భాషల్లో నిర్మిస్తారా? లాంటి ప్రశ్నలకు సమాధానంతో పాటు ఇందులో నటించే ఇతర నటీనటులు, సాంకేతికవర్గం వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
ఆయన చిన్న కమలహాసన్!
నటుడు జయంరవిని చిన్న కమలహాసన్‌గా ప్రభుదేవా అభివర్ణించారు. ప్రముఖ నృత్యదర్శకుడు, నటుడు, దర్శకుడు ప్రభుదేవా ఇటీవల దేవి చిత్రంలో నిర్మాతలా కూడా అవతారమెత్తిన విషయం తెలిసిందే. ఆయన తన ప్రభుదేవా స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్న తాజా చిత్రం బోగన్. జయంరవి, హన్సిక జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఇంతకు ముందు ఇదే జంటతో రోమిమో జూలియట్ వంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన లక్ష్మణ్ దర్శకత్వం వహిస్తున్నారు. నటుడు అరవిందస్వామి ముఖ్య పాత్రను పోషిస్తున్న ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని అం దిస్తున్నారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం చెన్నై శివారు ప్రాంతం ఇంజిమ్‌బాక్కమ్‌లో గల వేల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలోని ఐసరి వేలన్ ఆవరణలో జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర కథానాయకుడు జయంరవి మా ట్లాడుతూ బోగన్ పక్కా కమర్షియ ల్ ఫార్ములాలో తెరకెక్కిన మాస్ రొమాంటిక్ ఎంటర్టెయినర్ అని తెలిపారు. ఇందులో అరవిందస్వామితో మరోసారి కలిసి నటించడం ఆనందంగా ఉందన్నారు. ఇక ఈ చిత్రంలో యువ సంగీత దర్శకుడు అనిరుద్ పాడిన పాటకు తాను చిందేయడం మంచి అనుభూతి అని పేర్కొన్నారు. తనిఒరవన్ చిత్రం తరువాత అంత మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు. చిత్ర నిర్మాత ప్రభుదేవా మాట్లాడుతూ సినిమాకు చెందిన చాలా విషయాలు ఆయనకు తెలుసని, అందుకే తాను జయంరవిని కుట్టి(చిన్న) కమలహాసన్ అని పిలుస్తానని అన్నారు. ఇక నటి హన్సిక నటన బోగన్ చిత్రంలో తనను చాలా ఇంప్రెస్ చేసిందన్నారు. ఎంగేయుమ్ కాదల్ చిత్రం నాటి నుంచి ఇప్పటి వరకూ ఆమె ఎదుగుదలను తాను చూస్తున్నానని తెలిపారు. ఈ బోగన్ చిత్రం అని వరా్గాలను అలరించే మంచి కమర్షియల్ ఎంటర్‌టెరుునర్‌గా ఉంటుందని ప్రభుదేవా ఆశాభావం వ్యక్తం చేశారు. -
వినోదభరితంగా బోగన్
బోగన్ చిత్రంలో జయంరవిని విభిన్న పోలీస్‌గా చూస్తారంటున్నారు దర్శకుడు లక్ష్మణన్. రోమియోజూలియట్ వంటి విజయవంతమైన చిత్రం తరువాత ఈయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం బోగన్. దేవి వంటి సక్సెస్ఫుల్ చిత్రం తరువాత ప్రభుదేవా స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ఇది.జయంరవికి జంటగా హన్సిక నటిస్తున్న ఈ చిత్రంలో అరవిందస్వామి మరో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. వీటీవీ.గణేశ్, నరేన్, అశ్విన్, నాగేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ బోగన్ చిత్ర షూటింగ్ శనివారంతో పూర్తి అయిందని తెలిపారు. ఇందులో జయంరవి కథానాయకుడిగానూ, ప్రతినాయకుడిగానూ నటిస్తున్నారన్నారు. నటుడు అరవిందస్వామి పాత్ర కూడా అలాంటిదేనని చెప్పారు. అది ఏమిటీ? ఎలా అన్నదే బోగన్ చిత్ర కథ అని పేర్కొన్నారు. ఇది పోలీస్ కథా చిత్రం అయినా వేరే లెవల్ ఉంటుందన్నారు.అయితే పోలీస్ శాఖకు గౌరవాన్ని ఆపాదించే చిత్రంగా ఉంటుందని చెప్పారు. వినోదంతో కూడిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా బోగన్ ఉంటుదని తెలిపారు. చిత్ర టీజర్‌ను ఇటీవల విడుదల చేశామని, దాన్ని 23 గంటల్లోనే 10 లక్షలకు పైగా అభిమానులు చూశారని చెప్పారు. ఇది చిత్ర అంచనాలను మరింత పెంచిందని దర్శకుడు లక్ష్మణన్ అన్నారు. -
దయామయి హన్సిక
మానవత్వం అన్నది మాటల్లో చెబితే చాలదు. నిజమైన ప్రేమ,కరుణ, జాలి చూపేవారు ప్రచారం కోసం చెప్పుకోరు. ఇక సినీ తారల విషయానికి వస్తే సాయం చేస్తే దానికి పదింతలు ప్రచారం ఆశిస్తారు. ఈ విషయంలో నటి హన్సికను మినహాయించవచ్చు. నిరుపేదలను, అనాథలను చూస్తే ఇట్టే చలించిపోయే గుణం హన్సికది. తన ఒక్కో పుట్టినరోజుకు ఒక్క అనాథ చొప్పున ఇప్పటికి 30 మందిని దత్తత తీసుకుని వారి సంరక్షణ బాధ్యతలను తీసుకుంటున్నారు. ఆ పిల్లల కోసం ఒక ఆశ్రమాన్ని కట్టించి విద్య, ఆహారం వంటి సకల సౌకర్యాలను అందిస్తున్నారు. తన సేవా కార్యక్రమాలను చెన్నైలో కూడా కొనసాగించాలని ఆశిస్తున్నారు. అందుకు ఒక ఆశ్రమాన్ని కట్టించాలనే ఆలోచనలో ఉన్నారు. హన్సిక ప్రస్తుతం జయంరవికి జంటగా బోగన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చెన్నైలో చిత్రీకరణ జరుపుకుంటుంటోంది. ఇటీవల ఒక రోజు షూటింగ్ పూర్తి చేసుకుని హోటల్‌కు వెళుతుండగా కట్టుకోవడానికి సరైన బట్టలు కూడా లేక అవస్థలు పడుతూ ఫుట్‌పాత్‌పై పడుకున్న వారి దుస్థితి హన్సిక కంట పడింది. వారి దీన పరిస్థితికి చలించిపోయిన హన్సిక వారికి ఏదైనా సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. అంతే మరుసటి రోజు షూటింగ్ పూర్తి చేసుకుని తన సహచరులతో కలిసి నేరుగా బట్టల షాపునకు వెళ్లి బట్టలు, దుప్పట్లు, మరో షాపులో వాటర్ బాటిళ్లు కొని అర్ధరాత్రి ఫుట్‌పాత్‌పై గాడ నిద్రలో ఉన్న ఆ దీన జీవుల ఒక్కొక్కరి పక్కన ఈ సామగ్రిని పెట్టి వెళ్లారు. హన్సిక వచ్చినట్లు, తమకు సాయం చేసినట్లు ఆ సమయంలో ఆ ఫుట్‌పాత్ సంచారులకు తెలియదు. అయితే ఆ సంఘటనకు చెందిన దృశ్యాల మీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది.చేసిన దానం దాచినా దాగదంటే ఇదే మరి. ఏమైనా నటి హన్సిక సేవాగుణాన్ని అభినందించక తప్పదు. ఇలాంటి సేవలే నిజమైన మానవత్వానికి నిదర్శనంకాదంటారా.