తెలుగులో మరోలా..!
సాక్షి, చెన్నై: ఒక భాషలో హిట్ అయిన చిత్రాలు ఇతర భాషల్లో రీమేక్ కావడం సహజమే. ఆ మధ్య తమిళ చిత్రం తనీఒరువన్ తెలుగులో రీమేక్ అయ్యింది. రామ్‌చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో తమిళంలో విలన్ గా నటించిన అరవిందస్వామినే తెలుగులోనూ నటించారు. అలా తెలుగులో రీమేక్ అవుతున్న మరో తమిళ చిత్రం బోగన్. తమిళంలో జయంరవి, అరవిందస్వామి కలిసి నటించిన ఇందులో హన్సిక నాయకి. లక్ష్మణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో పునర్‌నిర్మాణం కానుంది.
లక్ష్మణ్‌నే దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో జయంరవి పాత్రలో రవితేజ నటించనున్నారట. కాగా అరవిందస్వామి పాత్రను తెలుగులోనూ ఆయననే నటించాలని కోరగా అందుకు నిరాకరించినట్లు ప్రచారం జరుగుతోంది. దీని గురించి దర్శకుడిని అడగ్గా అసలు బోగన్ చిత్రం తెలుగు రీమేక్‌లో నటించమని తాము అరవిందస్వామిని సంప్రదించలేదన్నారు.
నిజం చెప్పాలంటే, తమిళంలో అరవిందస్వామి ఆ పాత్రను చాలా బాగా నటించారని, అందువల్ల నిర్మాత తెలుగులోనూ ఆయనే నటిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డ మాట వాస్తమేనన్నారు. అయితే ఈ పాత్ర తెలుగులో మరో విధంగా ఉంటుందని చెప్పారు. అందువల్ల తాను ఆ పాత్రకు అరవిందస్వామిని నటింపచేయాలని అనుకోలేదన్నారు.
ఆ పాత్రకు తెలుగులో ఎస్‌జే.సూర్యను నటింపజేయాలని భావిస్తున్నానని అన్నారు. అయితే కొంత గ్యాప్ తరువాత విలన్ గా రీఎంట్రీ అయిన అరవిందస్వామి ఇప్పుడు మళ్లీ హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం చతురంగవేట్టై 2, భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు. అందుకే ఆయన మళ్లీ విలన్ గా నటిండానికి అంగీకరించడం లేదన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం.