నవంబరు నుంచి విద్యుత్ ఉత్పత్తి
ముత్తుకూరు, న్యూస్‌లైన్ : మండలంలోని నేలటూరులో నిర్మితమవు తున్న ఏపీ జెన్కో విద్యుత్ ప్రాజెక్టులో ఈ ఏడాది నవంబర్ నుంచి మొదటి దశ లో (800 మెగావాట్లు) విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమవుతుందని ఆ సంస్థ సీఈ సత్యనారాయణ చెప్పారు. విద్యుత్ ఉత్పత్తిలో కీలకమైన బాయిలర్‌ను మంగళవారం తెల్లవారు జామున 3.14 గంటలకు మండించారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రాజెక్టు ప్రగతి ఊపందుకుంది. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ లైటప్ ప్రక్రియ విజయవంతం కావడంతో మొదటి దశ విద్యుత్ ఉత్పత్తికి మార్గం సుగుమం అయిందన్నారు.
రెండో దశ (800 మెగావాట్లు) విద్యుత్ ఉత్పత్తి 2014 ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతుందన్నారు. ప్రాజెక్టులో ప్రధానమైన కూలింగ్ టవర్లు, సీ వాటర్ ఇంటేక్ ప్లాంటు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఈతో పాటు ప్రధాన భాగస్వామ్య సంస్థలైన టాటా, గామన్ ఇండియా, బీహెచ్ఈఎల్, ఆల్‌స్ట్రోమ్, ఇండ్‌వెల్ సంస్థల ప్రతినిధులంతా పాల్గొన్నారు. బాయిలర్ లైటప్ విజయవంతంగా జరిగినందుకు జెన్కో సీఎండీ విజయానంద్, డెరైక్టర్ రాధాకృష్ణ తదితరులు ప్రాజెక్టు ఇంజనీర్లను అభినందించారు.