క్రషింగ్ ప్రశ్నార్థకం
బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌లైన్ : కోవూరు సహకార చక్కెర కర్మాగారంలో క్రషింగ్ ప్రక్రియ ప్రశ్నార్థకంగా మారింది. నేటికీ క్రషింగ్ ప్రారంభం కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కోవూరు నియోజకవర్గంలో 1.80 లక్షల టన్నుల చెరకు క్రషింగ్ సిద్ధంగా ఉంది. బాయిలర్ మరమ్మతులు నేటికీ ప్రారంభించకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్రంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా చిత్తూరు, ఆర్థికశాఖామంత్రి జిల్లా నెల్లూరు మినహా మిగతా అన్ని జిల్లాల్లోని సహకార కర్మాగారాలు బకాయిలు పూర్తిగా చెల్లించాయి.
2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కోవూరు చక్కెర కర్మాగారం రైతులకు రూ.5.40 కోట్లు, ఉద్యోగుల జీతాలు రూ.4.80 కోట్లు చెల్లించా ల్సి ఉంది. ఈ ఏడాది ఫ్యాక్టరీలో క్రషింగ్ జరపాల్సి ఉంటే రూ.4 కోట్లు మరమ్మతులకు అవసరం ఉంది. గతేడాది ప్రారంభం నుంచే ఫ్యాక్టరీలో క్రషింగ్ ముగిసే వరకు బాయిలర్ మరమ్మతులకు గురికావడం ప్రధాన సమస్యగా మారింది. గత ఏడాది బాయిలర్ మరమ్మతులు చేపట్టినా తరచూ మరమ్మతులకు గురువుతూనే ఉంది. ఈ ఏడాది బాయిలర్ మరమ్మతులను పూర్తి స్థాయిలో చేయాల్సి ఉంది.
బాయిలర్‌లోని 3,600 ట్యూబ్‌లను మరమ్మతులు చేయాలంటే దాదాపు రెండు నెలల సమయం పడుతుందిన సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. కోవూరులో నిర్వహించిన రచ్చబండ సందర్భంగా చక్కెర కర్మాగారం బకాయిలు, ఇతర అవసరాలకు నిధులు విడుదల చేస్తానని చెప్పిన మంత్రి ఆనం మాటలు నేటికీ నోచుకోలేదు. ఈ క్రమంలో కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి కర్మాగారం పరిస్థితిపై సీఎం కిరణ్, మంత్రి ఆనంని కలిసి విన్నవించారు. క్రషింగ్ ఆలస్యమవుతుండటంతో చెరకును జిల్లాలోని ఇతర ఫ్యాక్టరీలకు తరలించే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీకాంత్‌ను కోరారు. దీంతో కలెక్టర్ నాయుడుపేట చక్కెర కర్మాగారంలో నిత్యం వెయ్యి టన్నులు క్రషింగ్ జరిపేం దుకు ఒప్పందం కుదిర్చారు. అయితే దాదాపు మూడు నెలల పాటు క్రషింగ్ జరిగినా నెలకు ముప్పై వేల టన్నుల చొప్పున క్రషింగ్ ముగిసే నాటికి కేవలం 90 వేల టన్నులు మాత్రం క్రషింగ్ జరిగే అవకాశం ఉంది. మిగతా 90 వేల టన్నులు పరిస్థితి ఏంటన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా ఉంది.
ఫ్రీజోన్ ప్రకటిస్తే మేలు
కోవూరు చక్కెర కర్మాగారం పరిధిలో పండించిన 1.80 వేల టన్నుల చెరకు కోవూరు చక్కెర కర్మాగారంలో క్రషింగ్ అయ్యే పరిస్థితి లేదు. మరమ్మతులు చేసి ఫ్యాక్టరీ ప్రారంభించినా ముప్పై వేలకు మించి క్రషింగ్ జరిగే దాఖలాలు లేవని రైతు సంఘాలు చెబుతున్నాయి. కోవూరును ఫ్రీజోన్‌గా కలెక్టర్ శ్రీకాంత్ ప్రకటిస్తే మేలు జరుగుతుందని రైతులు భావిస్తున్నారు. ఫ్రీ జోన్ ప్రకటిస్తే రైతులు తమ చెరకును రాష్ట్రంలోని ఏ ఫ్యాక్టరీకైనా తరలించే అవకాశం ఉంది.
అగ్రిమెంట్ 15 వేల టన్నులకే..
ఇప్పటి వరకు కోవూరు చక్కెర కర్మాగారం పరిధిలో క్రషింగ్ జరిపేందుకు కేవలం 15 వేల టన్నులకే అగ్రిమెంట్ అయింది. తాజాగా అధికారులు గ్రామా ల్లో పర్యటిస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అగ్రిమెంట్ చేయనున్నట్లు చెబుతున్నారు. కోవూరు చక్కెర కర్మాగారం లో ప్రతి ఏడాది అక్టోబరు నుంచి ఏప్రిల్ వరకు సీజన్‌గా ప్రకటిస్తారు. నవంబరులో స్లోఫైరింగ్ చేసి, డిసెంబరులో క్రషింగ్ ప్రారంభిస్తారు. ఇంత వరకు కర్మాగారంలో స్లోఫైరింగ్ జరిగిన దాఖలాలు లేవు. కోవూరు చక్కెర కర్మాగారం ఎండీ సుధాకర్‌రెడ్డి నిర్లక్ష్యంతో గతేడాది రైతులకు తీవ్రనష్టం జరిగింది.